logo

డి.హీరేహాళ్‌లో అత్యధిక వర్షపాతం

జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని డి.హీరేహాళ్‌ మండలంలో 69.8 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది.

Published : 03 Jun 2023 03:14 IST

పత్తి రైతులకు తీరని నష్టం

మల్లికేతిలో నీట మునిగిన పత్తి పంట

జిల్లా వ్యవసాయం, డి.హీరేహాళ్‌, న్యూస్‌టుడే : జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని డి.హీరేహాళ్‌ మండలంలో 69.8 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలను పరిశీలిస్తే... గార్లదిన్నెలో 68.6, బ్రహ్మసముద్రం 15.2, రాయదుర్గం 14.2, యాడికి 10.2, కణేకల్లు 10.0, బెళుగుప్ప7.6, శింగనమల 5.8, గుత్తి 5.6, గుమ్మగట్ట 2.6. బొమ్మనహాళ్‌ 2.2, రాప్తాడులో 2.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ప్రేమచంద్ర వివరించారు.

* డి.హీరేహాళ్‌ మండలంలో వర్షం కారణంగా పత్తి పంట సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జాజరకల్లులో దాదాపు 150 ఎకరాల్లో పత్తి సాగైంది. ఇక్కడి పొలాల్లో వరద నీరు ప్రవహించడంతో చెట్లు నేలకూలాయి. మల్లికేతి, మడేనహళ్లి, నాగాలాపురం తదితర గ్రామాల్లో 170 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మల్లికేతి గ్రామంలో వి.అప్పన్నరెడ్డి 10 ఎకరాల్లో పత్తి సాగు చేయగా దాదాపు ఐదు ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిందని బాధిత రైతు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల వ్యాప్తంగా 320 ఎకరాల్లో పత్తి రైతులకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ఏఓ కృష్ణకుమార్‌రెడ్డి తెలిపారు.

విద్యుత్తుశాఖకు రూ.40లక్షల నష్టం

అనంత (విద్యుత్తు),న్యూస్‌టుడే: రెండు రోజులుగా ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో స్తంభాలు, నియంత్రికలు పడిపోవడంతో విద్యుత్తు శాఖకు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఎస్‌ఈ సురేంద్ర తెలిపారు. అనంతపురం గ్రామీణం, కళ్యాణదుర్గం, గుత్తి డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు 11కేవీ 118, ఎల్‌టీ స్తంభాలు 62, నియంత్రికలు 16 కిందపడిపోయాయని పేర్కొన్నారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌ఈ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని