logo

బోధించడం పాపమా.. గురువులపై క్రూరత్వమా?

నవ సమాజ నిర్మాతలు గురువులు.. ఎందుకో జగన్‌కు వీరంటేనే గిట్టదు. తనకు విద్యాబుద్ధులు నేర్పిందీ ఒక గురువే అన్న జ్ఞానాన్ని విస్మరించి.. వారిని శత్రువుల్లా చూస్తూ దండెత్తుతున్నాడు.

Updated : 23 Apr 2024 05:16 IST

టీచర్లను శత్రువుల్లా చూస్తున్న జగన్‌
కేసులు, అరెస్టులతో భయాందోళన
యాప్‌ల పేరుతో నిత్యం వేధింపులు
మానసిక ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: నవ సమాజ నిర్మాతలు గురువులు.. ఎందుకో జగన్‌కు వీరంటేనే గిట్టదు. తనకు విద్యాబుద్ధులు నేర్పిందీ ఒక గురువే అన్న జ్ఞానాన్ని విస్మరించి.. వారిని శత్రువుల్లా చూస్తూ దండెత్తుతున్నాడు. తమకు దక్కాల్సిన హక్కులు... తీర్చాల్సిన సమస్యలపై ఉద్యమించారన్న కోపంతో వారిపై కక్ష పెంచుకున్నారు. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి ఒక ఉద్యోగ వర్గాన్నే లక్ష్యంగా చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. ఐదేళ్ల ఏలుబడిలో ఏనాడూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కనీస చొరవ చూపలేదు. సరికదా.. ఎక్కడైనా ఉద్యమించారంటే చాలు.. అరెస్టులు, వేధింపులతో ముప్పతిప్పలు పెట్టారు. ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలనే తన నిరంకుశ, నియంత పాలనతో అణచి వేశారంటే.. జగన్‌ సర్కారు వైఖరి ఏంటో తేటతెల్లం చేస్తోంది. పవిత్ర ఉపాధ్యాయ వృత్తినే తన సోషల్‌ మీడియా ద్వారా అవహేళన, అవమానం, అగౌరవపరచడం ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. పాఠశాలల్లో కనీస వసతులు ఉండవు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు. బోధనా సామగ్రి ఇవ్వరు. కనీసం చదువుకోడానికి పుస్తకాలు పంపిణీ జరగదు. ఇలా అనేక సమస్యల మధ్య ఉపాధ్యాయులు మెరుగైన బోధనకు కృషి చేసినా ఏదొక వంక, సాకుతో వారిలో భయాన్ని, ఆందోళనను రేకెత్తించేలా అమర్యాదగా ప్రవర్తించిన ఏకైక ప్రభుత్వం ఇదేనేమో!. ఇందుకు ఉమ్మడి అనంత జిల్లాలో అనేక ఉదాహరణలు లేకపోలేదు.

17 వేల మందితో చెలగాటం

ఉమ్మడి అనంత జిల్లాలో 3,855 ప్రభుత్వ బడుల్లో 16,945 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జగన్‌ పైకి ఒకటి చెబుతూ.. అపరిచితుడి అవతారంతో టీచర్లపై ఉక్కుపాదం మోపాడు. బోధన కంటే.. బోధనేతర పనులతో రోజూవారీ జీవితాలతో, ఆరోగ్యంతో చెలగాటం ఆడారు. ముఖఆధారిత హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, మూల్యాంకనం, అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక, చిక్కీలు.. ఇలా అనేక పేర్లతో యాప్‌లు తీసుకొచ్చాడు. ఇవన్నీ భర్తీ చేసేందుకే వారి సమయం వృథా అవుతోంది. సర్వర్‌ సతాయించినా ఉపాధ్యాయులనే బాధ్యులుగా చేసి తాఖీదులు ఇచ్చారు. ఇలా టీచర్లపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారు.

]

పీఆర్‌సీ అమలు కోరుతూ అనంతపురంలో ఉపాధ్యాయుల ఆందోళన (పాత చిత్రం)

పాఠశాల విధులకు సకాలంలో తీసుకెళ్లాలన్న ఆత్రుత, భయంతో ఓ కానిస్టేబుల్‌ టీచరైన తన భార్యను ద్విచక్ర వాహనంలో తీసుకెళ్తూ అనంత నగర శివారులో మృత్యువాత పడ్డాడు. అతి కష్టంపై ఆ టీచరు ప్రాణాలతో బతికి బట్టకట్టింది. ఇది అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఉమ్మడి జిల్లాలో రోజూ టీచర్ల పరిస్థితి ఇదే. విధులకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదన్న మానసిక ఆందోళనతో సతమతం అవుతున్నారు.

గుత్తేదారుడు వడ్డించే మధ్యాహ్నం భోజనం రుచిగా లేదన్న సాకుతో ఏకంగా ఓ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్‌ చేసిన ఘనత జగన్‌ సర్కారుకే దక్కుతుంది. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా, పిల్లలు బడికి రాకపోయినా గురువులపై వేటు వేసిన సందర్భాలు కోకొల్లలు. టీచర్ల పట్ల వైకాపా ప్రభుత్వం ఎంత నిరంకుశంగా ప్రవర్తించిందో ఐదేళ్లలో నమోదైన ఘటనలే నిలువెత్తు సాక్ష్యం.

రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలో జరగని రీతిలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ టీచర్ల గుండెల్లో దడ పుట్టించాడు. ఈయన వస్తున్నాడన్న ఆందోళనతో గత డీఈవో సాయిరాం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడు. అతికష్టంపై బెంగళూరులో ఆధునాతన వైద్య చికిత్సతో బతికారు. ఇప్పటికీ ఆయన పూర్తిగా కోలుకోలేదు. వేలాదిమంది టీచర్లల్లోనూ ఇదే ఆందోళన ఇప్పటికీ సాగుతోంది.

జీవో 117తో నిర్వీర్యం

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది. జీవో 117 పేరుతో పాఠశాల విద్యను విభజించి.. వేలాది టీచర్‌ పోస్టులను రద్దు చేశారు. వైకాపా ప్రభుత్వ నిరంకుశ నిర్ణయంతో జిల్లాలో ఏకంగా వెయ్యికిపైగా పోస్టులు గల్లంతయ్యాయి. నిరుద్యోగుల కడుపు కొట్టాడు. దేశంలోనే ఆదర్శంగా కొనసాగుతున్న పాఠశాల విద్యను భ్రష్టు పట్టించారు. ఆ జీవో ప్రకారం 3, 4, 5 తరగతులను విడదీసి ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి అస్తవ్యస్తంగా మార్చారు. అప్పటి దాకా సాఫీగా సాగుతున్న ఉన్నత పాఠశాల విద్యాబోధన గందరగోళంగా మారింది. పీˆరియడ్ల సంఖ్యను పెంచేసి టీచర్లపై రెట్టింపు స్థాయిలో పని భారాన్ని మోపాడు. విద్యా వ్యవస్థ తికమక కావడమే కాదు.. టీచర్‌ పోస్టులను కూడా రద్దు పరిచారు.

మరుగుదొడ్లూ కడిగించారు!

ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే గురువుల భుజ స్కంధాలపై మరుగుదొడ్ల శుభ్రతను కూడా మోపారంటే వైకాపా ప్రభుత్వ మానసిక స్థితి ఏపాటితో తెలుస్తోంది. మరుగుదొడ్లు సరిగా లేకపోతే కూడా హెచ్‌ఎంలపై సస్పెన్షన్‌ వేటు పడింది. గురువుల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో ఈ మరుగుదొడ్ల వ్యవహారమే చెబుతోంది. శుభ్రంగా ఉన్నాయా లేవా? అని తెలుసుకోడానికి రోజూ ఫొటోలు తీసి నిర్దేశిత యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. నాడు-నేడు పథకంతో హడావుడి చేస్తూ.. టీచర్లను నానా తిప్పలు పెడుతోంది. ఇసుక, కంకర, సిమెంటు, ఇటుకలు సరిగా లేకపోయినా హెచ్‌ఎంలనే బాధ్యులు చేసి సస్పెండ్‌ చేసింది. తల్లిదండ్రుల కమిటీల పేరుతో స్థానిక వైకాపా నాయకులకే పెత్తనాన్ని అప్పగించింది. ఉపాధ్యాయుల్లో ప్రశ్నించే తత్వం ఎక్కువ. వీరిని మాట్లాడటానికి కూడా వీలులేకుండా ఎక్కడికక్కడ అణచి వేసింది. బైజూస్‌, ఓఎమ్మార్‌ స్కాన్‌.. వంటి యాప్‌లతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.

జీతం అడిగినా బెదిరింపులే..

ఒకటో తేదీ జీతం ఇవ్వడం ఆనవాయితీ. ఇదే టీచర్ల కుటుంబాలకు ఆధారం. వైకాపా ప్రభుత్వ పాలనలో ఏనాడూ సకాలంలో జీతం ఇచ్చిన దాఖలాలు లేవు. రెండు మూడు వారాలు గడిచిన తర్వాతే ఇస్తున్నారు. సకాలంలో వేతనం ఇవ్వాలంటూ నిరసన తెలిపినా పోలీసులతో వేధించారు. ఉద్యమాలు చేసిన సంఘాల నాయకులను ఫోన్లల్లో బెదిరించిన సందర్భాలు అనేకం. ఏదో ఒక వంకతో నోటీసులు ఇచ్చారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ఉద్యమాలు, నిరసనకు వెళ్లకూడదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోరాటాల్లో పాల్గొంటారన్న అనుమానంతో ఏకంగా పాఠశాలలకు వెళ్లి పోలీసులు పహారా కాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని