icon icon icon
icon icon icon

కంచుకోటలో కొత్త గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు తాను ప్రాతినిధ్యం వహించిన అమేఠీ సీటును కాదని ఇప్పుడు రాయ్‌బరేలీని ఎంచుకోవడంతో అందరి దృష్టీ ఆ నియోజకవర్గంపైకి మళ్లింది.

Published : 04 May 2024 06:27 IST

తాత, నానమ్మ, అమ్మ పోటీ చేసిన రాయ్‌బరేలీ బరిలో రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు తాను ప్రాతినిధ్యం వహించిన అమేఠీ సీటును కాదని ఇప్పుడు రాయ్‌బరేలీని ఎంచుకోవడంతో అందరి దృష్టీ ఆ నియోజకవర్గంపైకి మళ్లింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక జరిగిన తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తాత ఫిరోజ్‌గాంధీ (మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భర్త) ఈ స్థానం నుంచి రెండుసార్లు నెగ్గారు. తర్వాత ఇందిరాగాంధీ మూడుసార్లు, సోనియాగాంధీ నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇలా తన తాత, నానమ్మ, అమ్మ కలిసి కాంగ్రెస్‌కు కంచుకోటగా మార్చిన రాయ్‌బరేలీలో ఇప్పుడు రాహుల్‌ అడుగుపెట్టారు.

ఎలా మొదలైందంటే..

రాయ్‌బరేలీలో గాంధీ కుటుంబం బరిలో దిగడం ప్రారంభమవడం వెనుక ఆసక్తికర విషయాలను ‘ఫిరోజ్‌: ది ఫర్‌గాటెన్‌ గాంధీ’ పుస్తకంలో రచయితలు పేర్కొన్నారు. ఆ వివరాల ప్రకారం- ఫిరోజ్‌ అలహాబాద్‌కు చెందిన వ్యక్తి. కానీ తొలి సార్వత్రిక ఎన్నికల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి, మసూరియాదిన్‌ వంటి హేమాహేమీలు అక్కడ టికెట్‌ కోసం పోటీలో ఉండటంతో.. తాను బరిలో దిగేందుకు ఫిరోజ్‌ మరో నియోజకవర్గం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. అప్పుడు రఫీ అహ్మద్‌ కిద్వాయ్‌ ఆయన్ను రాయ్‌బరేలీకి తీసుకెళ్లారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో చేసిన మంచి పనులతో రాయ్‌బరేలీలో కిద్వాయ్‌కి మంచి పేరుండేది. ఫిరోజ్‌ను నెహ్రూ అల్లుడిగా అక్కడి ప్రజలకు ఆయన పరిచయం చేశారు. తమ నియోజకవర్గం నుంచి గొప్ప వ్యక్తి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకున్న రాయ్‌బరేలీ ఓటర్లకు ఫిరోజ్‌ రాక ఉత్సాహాన్నిచ్చింది. తొలి ఎన్నికల్లో నెహ్రూ, ఇందిర కూడా ప్రచారం చేయడంతో ఆయన సులభంగానే గెలిచారు. తర్వాతి ఎన్నికల్లోనూ అక్కడే పోటీ చేసి విజయం సాధించారు.

పెట్టని కోట

1967 నుంచి రాయ్‌బరేలీలో ఇందిర పోటీ చేయడం ప్రారంభించారు. 1967, 1971 ఎన్నికల్లో గెలిచిన ఆమె.. ఆత్యయిక స్థితి విధింపు దెబ్బకు 1977లో పరాజయం చవిచూశారు. అయితే 1980లో తిరిగి విజయం సాధించారు. తొలినుంచీ రాయ్‌బరేలీ గాంధీ కుటుంబానికి చాలా నమ్మకమైన స్థానం. ఆ కుటుంబసభ్యులు పోటీచేయలేని పరిస్థితుల్లో వారి సన్నిహతులైన అరుణ్‌ నెహ్రూ (నెహ్రూ కుటుంబం), షీలా కౌల్‌ (కమలానెహ్రూ అన్న భార్య), కెప్టెన్‌ సతీష్‌శర్మ (ఎయిర్‌లైన్స్‌ అకాడమీలో రాజీవ్‌గాంధీ సహచరుడు) ఈ నియోజకవర్గంలో గెలుపొందారు. అయితే 1996, 1998 ఎన్నికల్లో షీలా కౌల్‌ పిల్లలు విక్రమ్‌కౌల్‌, దీపాకౌల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఇక్కడ పోటీచేసి పరాజయం పాలయ్యారు. మొత్తంగా మూడు ఎన్నికల్లో మినహా మరెప్పుడూ హస్తం పార్టీ ఈ స్థానంలో ఓడిపోలేదు. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా నానమ్మ రాజమాత విజయరాజె సింధియా 1980లో ఈ నియోజకవర్గంలో జనతా పార్టీ తరఫున పోటీచేసి ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అరుణ్‌నెహ్రూ చేతిలో అంబేడ్కర్‌ సతీమణి సవితా అంబేడ్కర్‌ (లోక్‌దళ్‌ పార్టీ) పరాజయం చవిచూశారు.

సోనియా రాక

1999 ఎన్నికల్లో సోనియాగాంధీ తొలిసారి తన భర్త ప్రాతినిధ్యం వహించిన అమేఠీ నుంచి పోటీచేసి గెలుపొందారు. 2004లో ఆ నియోజకవర్గాన్ని కుమారుడు రాహుల్‌గాంధీకి వదిలి.. రాయ్‌బరేలీకి మారారు. అప్పటినుంచి 2019 ఎన్నికల వరకు ఆమె వరుసగా గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో అమేఠీలో రాహుల్‌ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఆయన అమేఠీ నుంచి కాకుండా తమ కుటుంబానికి అత్యంత నమ్మకమైన రాయ్‌బరేలీని ఎంచుకున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అరుణ్‌ నెహ్రూకు 70.07% ఓట్లురాగా, 2009లో సోనియాగాంధీ 72.23% ఓట్లతో ఆ రికార్డును చెరిపేశారు. ఇక్కడినుంచి గెలిచిన అన్ని ఎన్నికల్లోనూ సోనియాకు 55%పైనే ఓట్లు దక్కాయి.

హోరాహోరీ తప్పదా?

ప్రస్తుతం రాయ్‌బరేలీలో భాజపా అభ్యర్థిగా దినేశ్‌ సింగ్‌ బరిలో ఉన్నారు. ఆయన గతంలో గాంధీ కుటుంబానికి విధేయుడే. స్థానిక రాజకీయాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. 2018లో భాజపాలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియాగాంధీపై పోటీ చేసి 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో మంత్రిగా ఉన్న దినేశ్‌ ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


విధేయుడు గెలిపిస్తాడా?

అమేఠీని మళ్లీ దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ తహతహ
ఈనాడు, దిల్లీ

అమేఠీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానంలో అయిదేళ్ల కిందటి దాకా గాంధీ కుటుంబానిదే హవా. కాంగ్రెస్‌కు కంచుకోటగా దానికి పేరుండేది. 2019లో ఆ కోటకు బీటలు వారాయి. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో హస్తం పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పరాజయం పాలయ్యారు. మళ్లీ ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌.. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడైన కిశోరీలాల్‌ను ఇప్పుడు అక్కడ బరిలో దింపింది. గత పాతికేళ్లలో గాంధీ కుటుంబేతరులు హస్తం పార్టీ తరఫున ఈ స్థానంలో పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

సంజయ్‌గాంధీతో మొదలు

గత నాలుగున్నర దశాబ్దాల్లో దాదాపు 31 ఏళ్లు అమేఠీకి లోక్‌సభలో గాంధీ కుటుంబసభ్యులే ప్రాతినిధ్యం వహించారు. 1980లో తొలిసారి సంజయ్‌గాంధీ ఇక్కడ గెలుపొందారు. ఆయన మరణంతో మరుసటి ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ గెలిచారు. అప్పటినుంచి 1991 వరకు ఆయనే అమేఠీ ఎంపీగా కొనసాగారు. 1999లో సోనియాగాంధీ పోటీ చేయగా, 2004 ఎన్నికల్లో అమేఠీని రాహుల్‌గాంధీకి అప్పగించారు. ఆయన వరుసగా మూడుసార్లు ఈ స్థానంలో విజయం సాధించారు. 2019లో ఓడిపోయారు.

ఇన్నేళ్లకు ఇంకొకరు..

1991లో రాజీవ్‌గాంధీ మరణం తర్వాత అమేఠీలో కాంగ్రెస్‌ తరఫున సతీశ్‌ శర్మ పోటీ చేశారు. ఆ ఉప ఎన్నికల్లో గెలిచిన శర్మ.. 1996లో రెండోసారి గెలుపొందారు. 1998లో మాత్రం భాజపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరుసటి ఏడాదే మళ్లీ ఎన్నికలు జరిగ్గా, అమేఠీలో సోనియాగాంధీ మరోసారి కాంగ్రెస్‌ జెండాను రెపరెపలాడించారు. అప్పటినుంచి గాంధీ కుటుంబసభ్యులే ఇక్కడ హస్తం పార్టీ తరఫున పోటీచేయగా, మళ్లీ ఇన్నేళ్లకు ఇతరులకు అవకాశమిచ్చారు.

పంజాబ్‌ నుంచి వచ్చి..

ఇప్పుడు అమేఠీ బరిలో నిలిచిన కిశోరీలాల్‌.. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన వ్యక్తి. గాంధీ కుటుంబానికి ఆయన అత్యంత విధేయుడు. 1987లో తొలిసారి అమేఠీకి వచ్చారు. అప్పటినుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. 1999లో అమేఠీలో సోనియా విజయం సాధించడంలో కిశోరీలాల్‌ కీలక పాత్ర పోషించారు. సోనియా ఈ స్థానాన్ని వదులుకున్న తర్వాత కూడా అమేఠీలో పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తూ వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img