logo

కాలం చెల్లి.. కదలనంటోన్న ప్రగతి రథచక్రం

‘అనంతపురం ఆర్టీసీ బస్టాండులో ఈనెల 7న హిందూపురం డిపోకు చెందిన బస్సు 8వ ఫ్లాట్‌ఫాం మీదకు పరుగులు పెట్టింది.

Updated : 28 Apr 2024 04:50 IST

 ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణం.. గాల్లో దీపం
కొత్త బస్సులు, సౌకర్యాల కల్పనను గాలికొదిలేసిన జగన్‌

‘అనంతపురం ఆర్టీసీ బస్టాండులో ఈనెల 7న హిందూపురం డిపోకు చెందిన బస్సు 8వ ఫ్లాట్‌ఫాం మీదకు పరుగులు పెట్టింది. బ్రేకు పడకపోవడంతో పది అడుగుల మేర ముందుకెళ్లింది. ఉదయం కావడం, పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గడిచిన మూడేళ్లలో ఇప్పటికే మూడుసార్లు ఇలా ఫ్లాట్‌ఫాం మీదకు బస్సులు దూసుకొచ్చాయి.’

ఈనెల 22న ఉరవకొండలో పల్లె వెలుగు బస్సు గేర్లు పడకపోవడాన్ని గుర్తించిన డ్రైవర్‌ అప్రమత్తమై ఆపేశారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మెకానిక్‌లు, సిబ్బంది బస్సును తోసుకుంటూ డిపోకు తీసుకెళ్లారు.

‘ఈనెల 26న సాయంత్రం కళ్యాణదుర్గం డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు మల్లికార్జునపల్లి వద్ద పక్కనే ఉన్న చిన్న లోయలోకి పడింది. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో 53 మంది వరకు ప్రయాణికులున్నారు. 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.’

మల్లికార్జునపల్లి వద్ద ఈనెల 26న బోల్తా పడిన కళ్యాణదుర్గం డిపో బస్సు

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: ఆర్టీసీ అనగానే సురక్షిత ప్రయాణం అనే నమ్మకాన్ని వైకాపా ప్రభుత్వం పోగొడుతోంది. కొత్త బస్సులు, డిపోల నిర్వహణ, బస్టాండ్లలో సౌకర్యాల కల్పన, సురక్షిత ప్రయాణాన్ని గాలికొదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఐదేళ్లుగా ఒక్క కొత్త బస్సూ ఇవ్వని ముఖ్యమంత్రి జగన్‌ మాటలు మాత్రం కోటలు దాటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత డొక్కు బస్సుల మీద ఛార్జీల హారన్‌ మోగిస్తూ ప్రయాణికుల నుంచి ఆదాయాన్ని జుర్రుకుంటున్నారు. ఆర్టీసీ ప్రగతి చక్రాన్ని పూర్తిగా కకావికలం చేసి వికటాట్టహాసం చేస్తూ తప్పును తప్పించుకొనేందుకు ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశామని రాగాలు తీస్తున్నాడు.

అధ్వాన రోడ్లతో బిక్కు బిక్కు

ఉన్నవాటిలో పాతికశాతం డొక్కు బస్సులే కావడంతో అధ్వాన రోడ్ల మీద విడిభాగాలు ఊడిపోయే పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను తుక్కుగా మార్చాల్సి ఉన్నా.. యథేచ్ఛగా తిప్పుతూనే ఉన్నారు.

తరచూ మొరాయిస్తూ..

గతనెల ఉరవకొండ-కళ్యాణదుర్గం దారిలో ఆగిపోయిన పల్లెవెలుగు బస్సు

డిపో: ఉరవకొండ, బస్సుల సంఖ్య: 45
రోజువారీ ప్రయాణికులు: 18 వేలు
ప్రతినెలా ఆదాయం: రూ.2.25 కోట్లు

ఉరవకొండ: డిపో పరిధిలో చాలా బస్సులు పది పన్నెండు సంవత్సరాలు దాటినవే. వాటిలోనే పల్లెవెలుగు 31 పోగా మిగతావి ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ లగ్జరీ ఉన్నాయి. చాలా వరకు పల్లె వెలుగు బస్సులు కాలం చెల్లుతున్నాయి. దీంతో ఉరవకొండ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సులు తరుచూ రోడ్ల మీద ఆగి పోతున్నాయి. ఇంజిన్‌లో లోపాల కారణంగా ఈ సమస్య తలెత్తుతోంది. డిపోలో మెకానిక్‌లతో పాటు అన్ని పరికరాలు ఉన్నాయని డిపో అధికారులు చెప్తున్నారు. మరి బస్సులు మాత్రం రోడ్డు మీద ఆగి పోయి, ప్రయాణికులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇక బస్సులో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స పెట్టెల్లో మాట వరుసకు కూడా తగిన మందులు కనిపించడం లేదు. వాటిలో వ్యర్థాలు కనిపిస్తున్నాయి. బస్టాండులో కొన్ని ఫ్యాన్లు పాడైనా పట్టించుకోవడం లేదు.

ప్రయాణానికి అగచాట్లు

బళ్లారికి పల్లె వెలుగు బస్సే దిక్కు

డిపో: రాయదుర్గం
బస్సుల సంఖ్య: 64
రోజువారీ ప్రయాణికులు: ప్రతినెలా ఆదాయం: రూ.10 లక్షలు

రాయదుర్గం: డిపోకు అయిదేళ్లలో కొత్త బస్సులు రాకపోవడంతో పాతవాటిలోనే ప్రయాణికులు ఇబ్బందుల నడుమ ప్రయాణం చేయాల్సి వస్తోంది. వేగపరిమితిని 45 కిలోమీటర్లకు కుదించడంతో మండు వేసవిలో ప్రయాణికులు వేడిగాలితో నరకయాతన అనుభవిస్తున్నారు. బళ్లారికి పల్లెవెలుగు బస్సులే దిక్కయ్యాయి. వంద కిలోమీటర్ల దూరంలోని అనంతపురానికి 2.30 నుంచి 3 గంటలు, బళ్లారికి రెండు గంటల సమయం పడుతోంది. బీఎస్‌-6 సిస్టం బస్సుల్లో కూలింగ్‌ విధానం సక్రమంగా లేక ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. 12 లక్షల దాకా తిరిగిన బస్సులు 4 ఉండగా 8 లక్షలకు పైబడి తిరిగిన సూపర్‌ లగ్జరీలు 10 దాకా ఉన్నాయి.

కొత్త బస్సులు కేటాయించాలి

గుంతకల్లు: ఆర్టీసీ డిపోకు ప్రభుత్వం కొత్త బస్సులను కేటాయించకుండా పాత బస్సులతో కాలాన్ని నెట్టుకు వస్తోంది. పాత బస్సులు ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారాయి. ఇరుకైన బస్టాండు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. పల్లెటూరులో నిర్మించేవిధంగా గతంలో అధికారులు బస్టాండును ఏర్పాటు చేశారు. బస్టాండు పరసరాలను శుభ్రంగా ఉంచడంలేదు. ఇతర వాహనాలు బస్టాండులోకి రాకుండా చూడాలి.  అశోక్‌, గుంతకల్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని