logo

అవినీతిలోనూ పెద్దాయనే..

అవినీతికి..అరాచకానికి చొక్కా, పంచె తొడిగితే అచ్చం అయనలాగే ఉంటుంది. తాడిపత్రిలో వైకాపా ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న ‘పెద్ద’మనిషి అక్రమాలను చెప్తే చాంతాడంతా.. రాస్తే రామాయణమంతా అవుతుంది.

Updated : 28 Apr 2024 04:51 IST

 ఇసుక, మట్టిని మింగేస్తున్న ప్రజాప్రతినిధి
పెన్నాకు తాళాలేసి అక్రమ రవాణా
 ప్రత్యర్థులపై దాడులే దినచర్య

 అవినీతికి..అరాచకానికి చొక్కా, పంచె తొడిగితే అచ్చం అయనలాగే ఉంటుంది. తాడిపత్రిలో వైకాపా ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న ‘పెద్ద’మనిషి అక్రమాలను చెప్తే చాంతాడంతా.. రాస్తే రామాయణమంతా అవుతుంది. కనీసం పదో తరగతి చదవకపోయినా.. అవినీతిలో మాత్రం పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రజాసమస్యలపై ఏరోజూ పట్టించుకోని పెద్దమనిషి.. ఐదేళ్లు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడి ఫ్యాక్షన్‌ నేతగా మారారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థుల్ని ఇబ్బందులకు గురిచేసి రాక్షసానందం పొందుతున్నారు. అనుచరులు, బంధువుల్ని ముందుపెట్టి ఇసుక, మట్టి దందా సాగించారు. గ్రానైట్‌, స్టీటైట్‌ గనుల్ని చెరపట్టి రూ.కోట్లు వెనకేశారు. ఐదేళ్లలో అవినీతి సంపాదన రూ.300 కోట్లు దాటేసిందనే ప్రచారం జరుగుతోంది.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం

తాడిపత్రిలో ‘పెద్ద’ వైకాపా ప్రజాప్రతినిధికి 2019 ఎన్నికల ముందు మంచి కారు లేదు. పక్క నియోజకవర్గంలో ఉన్న సొంతూరిలో పెద్దల ఆస్తి 50 ఎకరాలు ఉండేది. ఫ్యాక్షన్‌ను నమ్ముకుని రాజకీయాలు చేస్తూ ప్రజాప్రతినిధి అయ్యారు. గ్రానైట్‌, స్టీటైట్‌ పరిశ్రమలను గుప్పిట్లోకి తెచ్చుకుని జేబులు నింపుకొన్నారు. వ్యాపారులను భయందోళనకు గురిచేసి కమీషన్లు గుంజుకున్నారు. ఒకప్పుడు అభివృద్ధి, పరిశుభ్రతలో మేటిగా ఉన్న తాడిపత్రి ..ఆయన ఏలుబడిలో అరాచకాలు, దౌర్జన్యాలకు కేంద్ర బిందువుగా మారింది.

పెన్నాను పంచేసుకున్నారు

తాడిపత్రి వైకాపా నాయకులు పెన్నానదిని వాటాలేసుకున్నారు. నది చెంత గేట్లు ఏర్పాటు చేసి తాళాలు వేసుకోవడం తాడిపత్రిలోనే సాధ్యమైంది. ‘పెద్ద’ మనిషి కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా సాగించారు. నాణ్యమైన ఇసుక లభించే పది ప్రాంతాలను గుర్తించి పంచుకున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లతో తాడిపత్రితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ట్రాక్టరు రూ.2వేల నుంచి రూ.4వేలకు సరఫరా చేస్తున్నారు. నంద్యాల జిల్లా అవుకు, బనగానపల్లికి ట్రాక్టరు ఇసుక రూ.10 వేల చొప్పున తరలిస్తున్నారు. పది మంది బినామీలతో వ్యవహారం నడిపించారు. రోజుకు రూ.1.50 లక్షల చొప్పున సదరు ‘పెద్ద’ మనిషికి కప్పం కట్టేలా ఒప్పందం చేసుకున్నారు.  పెద్దపప్పూరులోనూ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగించారు. తవ్వకాలతో ఏర్పడిన భారీ గోతుల్ని కప్పిపెట్టేందుకు చాగల్లు జలాశయం గేట్లు ఎత్తి... నీటిని విడుదల చేసి రైతుల పొట్టకొట్టారు. సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యురాలు సైతం ఎద్దులబండ్లపై ఇసుక తరలిస్తున్న వారి నుంచి రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఇసుక దందాలోనే సదరు ప్రజాప్రతినిధి రూ.50 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది.

మట్టి మాఫియా..

పుట్లూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల పరిధిలోని కొండలు, గుట్టలు వైకాపా నాయకుల అక్రమ తవ్వకాలతో రూపు కోల్పోయాయి. పెద్దపప్పూరు సోమనపల్లి, చిన్నయక్కలూరు, తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి, ఆవులతిప్పయ్యపల్లి, ఆలూరికోనతో పాటు యాడికి మండలంలోని పలు ప్రాంతాల్లో గుట్టలను కరిగించి ఎర్రమట్టి తరలిస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణం పేరిట తాత్కాలిక అనుమతులు పొంది ప్రయివేటుకు తరలిస్తున్నారు.

ఒకేచోట 189 ఎకరాలు

పక్క నియోజకవర్గంలోని సొంత గ్రామంలో కుటుంబసభ్యుల పేరుతో 50 ఎకరాల పొలం ఉన్నట్లు గతంలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక పుట్లూరు మండలంలోని ఓ గ్రామంలో ఒకేచోట 189 ఎకరాలు కొన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయనకు ఒక కారు మాత్రమే ఉంది. ప్రస్తుతం విలాసవంతమైన కార్లు పది వరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనుమానం రాకుండా బినామీల పేరుతో కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రిలో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. హైదరాబాద్‌లోనూ ఆపార్ట్‌మెంట్‌ కొన్నట్లు తెలుస్తోంది.

గుటకాయస్వాహా..

పెద్దపప్పూరు మండలం ఎర్రగుంటపల్లి, పెద్దపప్పూరు, ముచ్చుకోట, గార్లదిన్నె, అమ్మలదిన్నె తదితర ప్రాంతాల్లో గుట్టలను చదును చేసి వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు.  స్థానిక వైకాపా నాయకులు ఒక్కొక్కరు 5 ఎకరాల చొప్పున గుట్టలను ఆక్రమించారు. పండ్ల తోటలు సాగుచేసి తమ పేరుతో ఆన్‌లైన్‌ చేసుకుంటున్నారు. స్థానిక నాయకుల అక్రమాలకు ‘పెద్ద’ అండ పుష్కలంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజాప్రతినిధి అండతో తబ్జుల్లాలోని వైకాపా నాయకుడొకరు గ్రామకంఠం భూమి రెండెకరాలు కబ్జా చేసి పంటలు వేశారు. యాడికి మండలంతోపాటు నంద్యాల జిల్లా సరిహద్దులోని గుట్టల్లో మట్టి తరలించిన తర్వాత చదును అయిన ప్రాంతాలను కబ్జా చేసి పంటలు వేశారు.

ప్రతిపక్ష నాయకులపై దౌర్జన్యాలు

గతంలో తాడిపత్రిలో పనిచేసిన ఓ డీఎస్పీని అడ్డం పెట్టుకుని తెదేపా నాయకులపై కక్ష సాధింపునకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు తెదేపా మద్దతుదారులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. తెదేపా కౌన్సిలర్లే లక్ష్యంగా దాడులకు తెగపడ్డారు.  ఎస్సీలపై భౌతిక దాడులకు తెగపడ్డారు. తెదేపా నాయకులు, సానుభూతిపరులపై దాడులకు పాల్పడటమే దినచర్యగా పెద్దాయన ఐదేళ్ల పాలన కొనసాగింది.

రియల్‌ దందా..

తాడిపత్రి పరిధిలో ఎవరు భూమి కొనుగోలు చేసినా..అమ్మినా ‘పెద్దా’యనకు కప్పం కట్టాల్సిందే. ఎక్కడ లేఅవుట్‌ వేసినా ఎకరాకు రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. పెద్దమొత్తంలో అసైన్డ్‌ భూముల్ని పేదలను బెదిరించి లాక్కున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నిషేధిత జాబితాలోని భూముల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి మాముళ్లు వసూలు చేస్తున్నారు. సోలార్‌, గాలిమరలకు సేకరించిన భూముల్ని లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రి సమీపంలో పెద్దాయన బంధువు వెంచర్‌ ప్రహరీ నిర్మాణం కోసం ఓ వ్యక్తికి చెందిన ఆయిల్‌మిల్లును దౌర్జన్యంగా పడగొట్టారు. తర్వాత అతణ్ణి బెదిరించి లాక్కునే ప్రయత్నం చేశారు. ఐదేళ్లలో సంపాదించిన అవినీతి సొమ్ము రూ.150 కోట్లు దాటి ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని