logo

రోడ్ల మంత్రి ప్రారంభించిన పనులకే దిక్కులేదు

రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులకే దిక్కులేకుండా పోయింది.

Published : 28 Apr 2024 03:55 IST

కొత్తపల్లి-ఎల్‌జీబీ నగర్‌ మధ్య దెబ్బతిన్న రహదారి

సోమందేపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులకే దిక్కులేకుండా పోయింది. ఒకటి, కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్లు గడిచినా నిధులు లేక ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. ఈ దుస్థితి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. సోమందేపల్లి మండలం కొత్తపల్లి చెరువు నుంచి పెనుకొండ మండల గ్రామాల మీదుగా రొద్దం మండలం ఎల్‌జీబీ నగర్‌ వరకు మొత్తం 14 కిలోమీటర్ల రహదారిని రెండు వరుసల బీటీ రహదారి విస్తరణ, నిర్మాణ పనులకు వైకాపా ప్రభుత్వం ఆర్‌పీపీ కింద రూ.12 కోట్లు మంజూరు చేసింది.

2021లో ఆర్భాటంగా శంకుస్థాపన

ఈ రహదారి నిర్మాణ పనులకు కొత్తపల్లి మలుపు వద్ద 2021 జులై 5న నాటి రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ, ఎంపీ మాధవ్‌తో కలిసి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆయన చిత్రంతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. అయినా ఇప్పటికీ ఈ రహదారి నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదు. ఇక్కడి రహదారి పక్కన శిలాఫలకం ఒక దిష్టిబొమ్మలా మారింది. కొత్తపల్లి చెరువు నుంచి రంగేపల్లి రైల్వే స్టేషన్‌ సమీపం వరకు రహదారి కంకర తేలి, గుంతల మయంగా మారింది. ఇక అడదాకులపల్లి మలుపు నుంచి ఎల్‌జీబీ నగర్‌ వరకు బీటీ రహదారి దెబ్బతిని గుంతలు పడి ప్రయాణం తీవ్ర ఇబ్బందికరంగా తయారైంది. ఈ రహదారిపై ఎప్పుడు ఏ ప్రమాదం చోటుచేసుకొంటుందోనని వాహనాల చోదకులు, స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తయితే హిందూపురం ర.భ, సోమందేపల్లి జాతీయ రహదారుల నుంచి అటు మడకశిర..ఇటు రొద్దం, పావగడ, బళ్లారి, పేరూరు, తిరుమణి ఇలా అనేక ప్రాంతాలకు ప్రయాణాలు సాగించడానికి ఎంతో సులభంగా ఉంటుంది. కొన్ని కిలో మీటర్ల ప్రయాణ దూరం, రవాణ ఖర్చులు తగ్గిపోయి సమయం ఆదా అవుతుందని వివిధ వాహన దారులు, చోదకులు, మూడు మండలాల ప్రజలు వాపోతున్నారు. చివరకు వైకాపా ఐదేళ్ల పాలనలో నిధులు విడుదల చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వెక్కిరిస్తున్న శిలాఫలకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని