logo

నాటి మాటలు.. నీటి మూటలేనా?

ప్రజా సంకల్ప పాదయాత్ర, 2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లాపై వరాల జల్లు కురిపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మరిచారు.

Published : 04 Jul 2023 01:50 IST

హామీలను  విస్మరించిన సీఎం, ప్రజాప్రతినిధులు
నేటి సభలోనైనా భరోసా ఇవ్వాలని ప్రజల వేడుకోలు
ఈనాడు, చిత్తూరు

ప్రజా సంకల్ప పాదయాత్ర, 2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లాపై వరాల జల్లు కురిపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మరిచారు. జిల్లా నుంచి ఏకంగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా గట్టిగా ఒత్తిడి చేయకపోవడంతో ప్రభుత్వం సైతం మిన్నకుండిపోయింది. ఎమ్మెల్యేలు సంబంధిత దస్త్రాలు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని పట్టించుకోవడంలేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేనందున మంగళవారం జరిగే సభలోనైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరిస్తే జిల్లా ఎంతోకొంత ప్రగతి పథంలోకి వెళుతుంది.  


జిల్లా కేంద్రంలో ఒక్క వర్సిటీ లేక..

జిల్లా కేంద్రంలో ఒక్క విశ్వవిద్యాలయం ఏర్పాటుకూ ప్రభుత్వం ఆమోదం తెలపలేదని చిత్తూరు యువత ధ్వజమెత్తుతోంది. వర్సిటీ నెలకొల్పాలంటూ ఇటీవల సంతకాల సేకరణ చేపట్టగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 2020 జనవరిలో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడే నగరంలో నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు కోరినా ముఖ్యమంత్రి స్పందించలేదు. అనంతరం ఎమ్మెల్యే సైతం ఆ అంశాన్ని పట్టించుకోనందునే ప్రభుత్వం నైపుణ్య కళాశాలతో సరిపెట్టిందని ప్రజలు అంటున్నారు.


గుజ్జు పరిశ్రమలు ఏర్పాటయ్యేదెన్నడో?

జిల్లాలో టమోటా సాగు అధికంగా ఉందని.. ఆ పంటకు గిట్టుబాటు ధరలు లభించక రోడ్లపైనే పారేయాల్సి వస్తోందని ప్రజా సంకల్పయాత్రలో అడుగడుగునా తనను కలిసిన రైతులు చెప్పారని జగన్‌ పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు నష్టం వాటిల్లకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మూసేసిన చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం భూముల్లో ఆహారశుద్ధి కర్మాగారాలు నెలకొల్పుతామని మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. ముఖ్యమంత్రి హామీకి పొంతన లేకుండా ఇలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎంతవరకు భావ్యమని రైతులు ప్రశ్నిస్తున్నారు.

గిట్టుబాటు ధరలూ అమలు కాక..: మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు జిల్లా పెద్దల ఆశీస్సులతో ధరలు తగ్గించడంపై గతవారం వరకూ విపక్ష పార్టీలు, రైతు సంఘాలు ధ్వజమెత్తాయి. అన్నదాతలు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 


సీఎంసీలో అమలు కాని ఆరోగ్యశ్రీ

2006 మార్చిలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సీఎంసీ యాజమాన్యానికి గుడిపాల మండలం చీలాపల్లె సమీపంలో 640 ఎకరాల భూమిని కేవలం రూ.6.40 కోట్లకే కేటాయించింది. అప్పట్లో పదేళ్లలో వైద్య కళాశాల, దంత, నర్సింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఫలితంగా చిత్తూరు జిల్లా ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందుతాయని భావించి పరిసర ప్రాంతాల రైతులు తమ భూములను తక్కువ ధరకు విక్రయించారు. నేటికీ అక్కడ పూర్తిస్థాయిలో సేవలు అందకపోగా పేదలకు ప్రయోజనం కలిగించే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడంలేదు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య కార్డులను అంగీకరించడం లేదు. అటువంటప్పుడు తాము చేసిన త్యాగాలకు అర్థమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి జగన్‌ ఆ సంస్థపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు మేలు చేయాలి.


హంద్రీ- నీవా గురించి పట్టించుకోక..

మ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతం  సస్యశ్యామలం కావాలంటే హంద్రీ- నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టు పూర్తి చేయడమే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి కాక ముందు జగన్‌ చెప్పారు. కాలువ పనులు ఆగమేఘాలపై చేస్తామని చెప్పినప్పటికీ ప్రధాన కాలువ పరిధిలో ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదు. పుంగనూరు బ్రాంచ్‌ కాలువ పరిధిలో  పదుల సంఖ్యలో కూడా చెరువులు నింపలేదు. గతేడాది సెప్టెంబరులో కుప్పం బ్రాంచ్‌ కాలువ పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి.


ప్రోత్సాహం కరవై..

చెన్నై, బెంగళూరు మహా నగరాలకు జిల్లా దగ్గరగా ఉన్నా పరిశ్రమల స్థాపనకు గతంలోలా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేవు. ఫలితంగా ఉన్నవారే ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రూ.9,500 కోట్లతో ఏర్పాటు కావాల్సిన అమరరాజా లిథియం పరిశ్రమ ప్రభుత్వ వేధింపులతో పొరుగునే ఉన్న తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు వెళ్లింది.

గంగాధరనెల్లూరు, గంగవరం మండలంలోని గండ్రాజుజల్లె పారిశ్రామికవాడల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవంటే పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థమవుతోంది.


తాగునీటి కష్టాలు తీరక..

నగరంలో నీటి ఎద్దడిని నివారించేందుకు అడవిపల్లె జలాశయం నుంచి నీళ్లు తెప్పిస్తామని పదేపదే నాయకులు హామీ ఇస్తున్నా కార్యరూపం దాల్చలేదు.

కుప్పంలోని ద్రవిడ వర్సిటీ ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వ హయాంలోనే ఎదురైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని