logo

భృతిలేక.. పీఆర్సీ అమలుకాక

‘ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంకుస్థాపనలు నమ్మొద్దు అని’ విపక్ష నేతగా చెప్పిన ప్రస్తుత సీఎం జగన్‌, ఇప్పుడు అచ్చం అవే పనులు చేశారు..

Published : 28 Apr 2024 03:03 IST

వచ్చే సర్కార్‌లో ఇస్తారంట..
ఒకొక్కరికి రూ.5 లక్షల దాకా బకాయిలు
ఉద్యోగుల్ని వంచించిన వైకాపా ప్రభుత్వం

  • రాష్ట్ర విభజన సమయంలో క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఉద్యోగుల సమస్యలు గుర్తించిన నాటి తెదేపా ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించక.. ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది.
  • ప్రస్తుతం రివర్స్‌ ఫిట్‌మెంట్‌ 27 శాతం ఇచ్చి.. రివర్స్‌లో 23 శాతం ఐఆర్‌ ఇవ్వడం గమనార్హం. పైగా సమస్యలపై గళమెత్తితే నిర్బంధాల పేరిట అమానుషంగా అణచివేసింది వైకాపా ప్రభుత్వం.
  • చిత్తూరు నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ప్రస్తుతం రూ.60 వేల వేతనం వస్తోంది. 27 శాతం పీఆర్‌సీ అమలై ఉంటే వేతనానికి అదనంగా రూ.16,200 జమయ్యేది. పీఆర్సీ అమలుకాక గతేడాది జులై నుంచి అతడు ఈ లబ్ధిని కోల్పోవాల్సి వచ్చింది. సగటున పది నెలల పాటు ఆ ఉద్యోగి నష్టపోయిన మొత్తం రూ.1.62 లక్షలు.
  • పూతలపట్టు మండలానికి చెందిన ఉపాధ్యాయుడికి రూ.50 వేల వేతనం. 27 శాతం పీఆర్‌సీ అమలు చేసి ఉంటే వేతనం రూ.13 వేలు అదనంగా జమయ్యేది. పీఆర్‌సీ లేకపోవడంతో ఐఆర్‌ ఇచ్చి ఉన్నా.. రూ.11,500 వచ్చి ఉండేది. పీఆర్‌సీ లేకపోవడంతో పది నెలల కాలానికి రూ.1.3 లక్షలు నష్టపోయారు. ఐఆర్‌ లేకపోవడంతో 10 నెలల కాలానికి రూ.1.15 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది.

నిరసనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు(పాత చిత్రం)

న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌: ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంకుస్థాపనలు నమ్మొద్దు అని’ విపక్ష నేతగా చెప్పిన ప్రస్తుత సీఎం జగన్‌, ఇప్పుడు అచ్చం అవే పనులు చేశారు.. 12వ పీఆర్‌సీని నియమిస్తూ 2023 జులైలో ప్రభుత్వం జీవో ఇచ్చింది.. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయింది.. ఉద్యోగుల పోరాటంతో ఈ ఫిబ్రవరిలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది.. పీఆర్‌సీని వచ్చే జులైలో అప్పుడు అధికారంలో ఉన్న సర్కారు ఇస్తుంది.. ఇప్పుడు ఐఆర్‌(మధ్యంతర భృతి) ఎందుకు అంటూ చావు కబురు చల్లగా చెప్పారు వైకాపా ప్రభుత్వాధినేత జగన్‌.. నిన్నటిదాకా ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యమని బాకాలూదిన జగన్‌ జమానా.. నేడు అకస్మాత్తుగా మాట మార్చేసింది.. మడమ తిప్పేసింది.. ఫలితంగా ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది.. ఇవన్నీ ఎన్నికలకు ముందు ఉద్యోగుల్ని వంచించేలా చేసిన ద్రోహం కాక మరేమిటిది..!

సంప్రదాయానికి తూట్లు..!

ప్రతి ఐదేళ్లకోసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్‌సీ ఇవ్వడం సాధారణం. ఇది ఆలస్యమైతే మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వడం సంప్రదాయమే. ఈ సంప్రదాయానికి జగన్‌ సర్కార్‌ ఇష్టారాజ్యంగా అడుగడుగునా తూట్లు పొడిచింది. గతేడాది ప్రకటించిన 12వ పీఆర్‌సీపై మీనమేషాలు లెక్కించి.. ఎన్నికలకు చేరుకుంది. సామ దాన భేద దండోపాయాలను ఉద్యోగులపై ఇష్టారీతిన ప్రయోగించింది వైకాపా ప్రభుత్వం.. ఈ ఐదేళ్లపాటూ ఉద్యోగుల్ని దారుణంగా అణచివేతకు గురిచేసింది. ఎక్కడా నోరు మెదపకుండా తొక్కిపడేసింది. గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, నోటీసుల పేరిట తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. ఒకదశలో ఇల్లు దాటితే కష్టమేననే రీతిన వ్యవహరించింది. హక్కుల సాధనకు గళమెత్తిన వారిపై అడుగడుగునా ఉక్కుపాదం మోపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న మంత్రి వర్గ ఉప సంఘంలో ఉత్తుత్తి చర్చలతో ముగించడమే కాకుండా భృతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరుతో ప్రతి ఉద్యోగికీ రూ.5 లక్షల దాకా ప్రభుత్వం బకాయి పడినట్లు అవుతుందంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి.

అన్యాయానికి గురయ్యాం..

2023 నుంచి ఐఆర్‌ 30 శాతం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నా ఈ ప్రభుత్వం కనీసం స్పందించ లేదు. 2023 జులై నాటికి 12వ పీఆర్‌సీ ఇవ్వాల్సి ఉన్నా అసలు దాని గురించిన ఊసేలేదు. గత పీఆర్‌సీలో జరిగిన అన్యాయాల్ని ఇప్పటివరకు సవరించనే లేదు. పీఆర్‌సీ కమిషన్‌ వేసినా కమిషన్‌ సభ్యులు ఛార్జి తీసుకోవడం ఆలస్యమైంది. దీంతో ఉద్యోగులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి.

భానుప్రకాష్‌, చిత్తూరు తాలూకా యూనిట్‌ అధ్యక్షుడు, ఎనీఎన్జీజీవో

ప్రతి ఉద్యోగికీ రూ.లక్షల్లో నష్టం..

పీఆర్‌సీ లేక, ఐఆర్‌ ఇవ్వకపోవడంతో ప్రతి ఉద్యోగి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ నష్టపోతున్నారు. ఎన్నికల హామీలో ఇస్తామన్న 27 శాతం ఐఆర్‌.. ఏడు నెలలు ఆలస్యంగా ఇవ్వడంతో లబ్ధిని కోల్పోయాం. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు.

సుధాకర్‌, జిల్లా గౌరవాధ్యక్షులు, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని