logo

బకాయిలపై గురి

ఏళ్లుగా పేరుకుపోయిన రుణ బకాయిలపై ఎస్సీ కార్పొరేషన్‌ దృష్టిసారించింది. బకాయిల వసూలుకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో రవాణా, రవాణేతర విభాగాల్లో స్వయం ఉపాధి కోసం రుణాలు పొంది.. తిరిగి చెల్లించని వారి జాబితాలు సిద్ధంచేసిన సంస్థ.

Published : 20 Jan 2022 05:42 IST


కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

ఈనాడు - కాకినాడ: ఏళ్లుగా పేరుకుపోయిన రుణ బకాయిలపై ఎస్సీ కార్పొరేషన్‌ దృష్టిసారించింది. బకాయిల వసూలుకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో రవాణా, రవాణేతర విభాగాల్లో స్వయం ఉపాధి కోసం రుణాలు పొంది.. తిరిగి చెల్లించని వారి జాబితాలు సిద్ధంచేసిన సంస్థ.. వీరితోపాటు.. వీరికి హామీ ఇస్తూ ష్యూరిటీ సంతకాలు చేసిన వారికీ తాఖీదులు పంపడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా బకాయిదారులు వెయ్యి మందికి పైనే ఉంటే.. ఇప్పటికే 500 మందికి నోటీసులు జారీచేసింది.

జిల్లాలో షెడ్యూల్డు కులాల సహకార సంఘం పరిధిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జాతీయ ఎస్సీల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) 2015-16 నుంచి.. జాతీయ సఫాయి కర్మచారీల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ) పథకాన్ని 2016-17 నుంచి అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ రెండు పథకాల కింద రవాణా, రవాణేతర విభాగాల్లో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలు మంజూరుచేశారు. కొద్ది మంది మాత్రమే సవ్యంగా చెల్లిస్తున్నా.. మరికొందరు కొన్ని వాయిదాలు చెల్లించి ఆపేయడం.. ఇంకొందరు ఆ ఊసేలేకపోవడంతో తాజాగా బకాయిల వసూలుపై దృష్టిసారించారు.

కట్టింది ఎంత.. కట్టాల్సింది ఎంత..?
జిల్లాలో రవాణా విభాగంలో కార్లు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు, రవాణేతర విభాగం కింద కిరాణా, ఇతర దుకాణాలు, టెంట్‌ హౌస్‌ తదితర స్వయం ఉపాధి యూనిట్లు మంజూరుచేశారు. రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఈ రుణాలు అప్పట్లో మంజూరు చేశారు. పొందిన రుణాల్లో రూ.3 లక్షల వరకు 60 శాతం, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 50 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 40 శాతం, రూ.10 లక్షలు దాటితే 35 శాతం వరకు రాయితీ ఇచ్చారు. రెండు శాతం లబ్ధిదారుని వాటా కాగా.. మిగిలినవి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా ఈ రుణాలు మంజూరుచేశారు. అయిదేళ్ల గడువులో వాయిదాల రూపంలో రుణాలు చెల్లించాలనే నిబంధన లబ్ధిదారులు పాటించకపోవడంతో తాజాగా నోటీసులకు ఉపక్రమించారు.

* ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ కింద 903 యూనిట్లు రూ.27.11 కోట్లతో మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు రూ.4.04 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 
* ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ కింద 159 యూనిట్లు రూ.2.94 కోట్లతో మంజూరుచేస్తే.. రూ.21.74 లక్షలు మాత్రమే లబ్ధిదారులు చెల్లించారు. 

వసూళ్లపై దృష్టి
జిల్లాలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకాల కింద రవాణా, రవాణేతర యూనిట్లకు 2015 నుంచి రుణాలు మంజూరయ్యాయి. రుణ బకాయిలు చాలామంది చెల్లించడంలేదు. వారి నుంచి బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. రుణాలు చెల్లించని లబ్ధిదారులతోపాటు, వారికి హామీగా ఉన్నవారు 500 మందికి నోటీసులు ఇస్తున్నాం. లబ్ధిదారులు తీసుకున్న రుణం సక్రమంగా చెల్లిస్తేనే భవిష్యత్తులో మరికొందరికి లబ్ధి చేకూరే వీలుంది.
-డి.ఎస్‌.సునీత, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, కాకినాడ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని