logo

జగనన్న సైనికులకు ఝలక్‌

స్థానికంగా వాలంటీరు ఉద్యోగం వచ్చింది. కుటుంబంతో ఉంటూ ఊళ్లోనే ఇప్పటివరకు పనిచేసుకున్నా. అందులో భాగంగా రేషను పంపిణీలో భాగస్వామ్యం చేశారు.

Published : 28 Apr 2024 04:05 IST

వాలంటీర్లకు అందని రేషన్‌ పంపిణీ పారితోషికం

స్థానికంగా వాలంటీరు ఉద్యోగం వచ్చింది. కుటుంబంతో ఉంటూ ఊళ్లోనే ఇప్పటివరకు పనిచేసుకున్నా. అందులో భాగంగా రేషను పంపిణీలో భాగస్వామ్యం చేశారు. అందుకోసం రూ.750 ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ రేషను ఇచ్చేలా చర్యలు చేపట్టాం. ఇంతలో ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఇప్పుడేమో మాతో బలవంతంగా రాజీనామా చేయించారు. మూడు నెలల పారితోషికం వస్తుందో, రాదో తెలియని పరిస్థితి.

 

 తాళ్లపూడిలోని ఇటీవల రాజీనామా చేసిన ఓ వాలంటీరు ఆవేదన

తాళ్లపూడి, న్యూస్‌టుడే: వాలంటీర్లు వైకాపా సైన్యమంటూ కోతలు కోసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వారికే ఝలక్‌ ఇచ్చింది. ఇంటింటికీ రేషన్‌ సరఫరా పేరుతో జగన్‌ సర్కారు తెరపైకి ఎండీయూ వాహనాలను తెచ్చింది. వీరు ప్రతి ఇంటికీ వెళ్లకుండా, వీధిలో ఓ చోట బండి ఆపి సరకులు సరఫరా చేసేవారు. దీనిపై చాలామంది అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో రేషన్‌ పంపిణీలో వాలంటీర్లను భాగస్వామ్యం చేశారు. అందుకోసం నెలకు రూ.750 ఇస్తామని గతేడాది డిసెంబరులో ప్రకటించారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత రూ.750 కాదని.. రూ.500 ఇస్తామన్నారు. వాలంటీర్ల భాగస్వామ్యంతో రేషన్‌ పంపిణీ నడిచింది. తీరా మూడు నెలలు దాటినా.. ఒక్క నెల కూడా వారికి పారితోషకం ఇవ్వలేదు.

ఎన్నికల కోడ్‌ రావడంతో..

ఇంతలో ఎన్నికల నగరా మోగింది. కోడ్‌ అమల్లోకి వచ్చింది. వాలంటీర్ల సేవలను వైకాపా నాయకులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వారిని ప్రచార కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల కార్యక్రమాలకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. దీంతో వైకాపా నాయకులు వారితో వాలంటీరు విధులకు బలవంతంగా రాజీనామ చేయిస్తున్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తే.. రేషన్‌ పంపిణీ పారితోషికం అందేది ఎలా అని వారు వాపోతున్నారు.

సుమారు రూ.1.36 కోట్ల బకాయి..

జిల్లా వ్యాప్తంగా సుమారు 9,099 మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.500 చొప్పున నెలకు దాదాపు రూ.45,49,500 ఇవ్వాలి. మూడు నెలలకు కలిపి సుమారు రూ.1.36,48,500 బకాయిలు ఇవ్వాలి. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులను అడిగితే ఒక నెలకు మాత్రమే ఇవ్వాలని, ఈలోగా ఎన్నికల కోడ్‌ వచ్చిందని చెబుతున్నారు. మూడు నెలలు ఇవ్వాల్సిందేనని వాలంటీర్లు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని