logo

ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత

రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్‌ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్‌ సంపత్‌రెడ్డి గల్లంతయ్యాడు.

Published : 19 May 2024 02:53 IST

మరొకరి గల్లంతు

మృతులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి,  పెంటా జయకుమార్‌

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్‌ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్‌ సంపత్‌రెడ్డి గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపాలేనికి చెందిన జయకుమార్, కొమర్తి రాజేష్, ఈశ్వరరెడ్డి, అతడి అన్నయ్య సత్యనారాయణరెడ్డి, చిన్నమ్మ కుమారుడు విజయనగరానికి చెందిన సంపత్‌రెడ్డి సరదాగా గోదావరిలో సాన్నం చేసేందుకు గౌతమి వంతెన వద్దకు శనివారం సాయంత్రం వెళ్లారు. సత్యనారాయణరెడ్డి గట్టుపై కూర్చుని ఉండగా, మిగిలిన నలుగురు గోదావరిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈశ్వరరెడ్డి, జయకుమార్, సంపత్‌రెడ్డి గల్లంతయ్యారు. రాజేష్‌కు ఈత రావడంతో ఒడ్డుకు చేరాడు. విషయం తెలుసుకున్న సీఐ ఆంజనేయులు సిబ్బందితో అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా ఈశ్వరరెడ్డి, జయకుమార్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సంపత్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలానికి ఆలమూరు ఎస్సై శ్రీను నాయక్, రావులపాలెం ఎస్సై రాజేష్, కొత్తపేట అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.

సత్తి అజయ్‌ సంపత్‌ రెడ్డి (గల్లంతు)

అన్న చూస్తుండగానే మునిగి..

ఈశ్వర్‌రెడ్డి ఓడలరేవులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. తండ్రి రైతు. అందివచ్చిన కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. చూస్తుండగానే తమ్ముడు ఈశ్వర్‌రెడ్డి నదిలో గల్లంతు కావడంతో అతని అన్న సత్యనారాయణరెడ్డి విలపిస్తున్న తీరు కలచివేసింది.

సెలవుల్లో సరదాగా గడిపేందుకు వచ్చి...

గోదావరిలో గల్లంతైన సత్తి అజయ్‌ సంపత్‌రెడ్డి పదో తరగతి విద్యార్థి. సొంత గ్రామం అనపర్తికాగా, ఉపాధి నిమిత్తం కుటుంబం మొత్తం విజయనగరం వలస వెళ్లారు. సెలవుల నేపథ్యంలో రావులపాలెంలోని తన పిన్ని ఇంటికి వచ్చాడు. సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి, ఈశ్వరరెడ్డికి తమ్ముడు అవుతాడు. అక్కాచెల్లెళ్ల కుటుంబాల్లో ఇద్దరు మృత్యువాత  పడడంతో వారి బాధ వర్ణనాతీతం.

మృతదేహాలను పరిశీలిస్తున్న సీఐ ఆంజనేయులు

కుటుంబానికి  ఆసరాగా ఉంటూ..

రావులపాలేనికి చెందిన పెంటా జయకుమార్‌ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతూనే స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఓ చెల్లి ఉంది. తండ్రి కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొడుకు మృత్యువాత ఆ కుటుంబాన్ని శోకంలోకి నెట్టింది. అందరితో కలివిడిగా, సరదాగా ఉండే జయకుమార్‌ మృతి విషయం తెలుసుకున్న స్నేహితులు, స్థానికులు గోదావరి వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు.

మళ్లీ శనివారమే..

వారం తిరగకుండానే గోదావరిలో రెండో ప్రమాదం చోటుచేసుకుంది. గత శనివారం ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడుకు చెందిన ముగ్గురు మహిళలు దైవ దర్శనానికి బయలుదేరి ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి గోదావరిలో పడి మృతిచెందారు. ఈ శనివారం ఇదే గౌతమి గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతు కాగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాలువలకు నీటి సరఫరా నిలుపుదల చేయడం, గోదావరికి నీటి ప్రవాహం పెరగడం, ఊబి ప్రాంతాలు ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గోదావరి పరిసర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని