icon icon icon
icon icon icon

Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు: నారా బ్రాహ్మణి

రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు.

Updated : 20 Apr 2024 17:23 IST

మంగళగిరి: రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా యర్రబాలెం సంధ్య స్పైసెస్‌ కంపెనీని సందర్శించి కూలీలతో మాట్లాడారు.

‘‘మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు, లోకేశ్‌ నిరంతరం పరితపిస్తారు. డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదటి మహిళా స్పీకర్‌గా  ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది ఆయనే.  ఆర్థిక ఇబ్బందులు మహిళ విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ప్రకటించారు. దీని ద్వారా ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణం లభిస్తుంది. ఉమ్మడి ఏపీలో పెద్ద ఎత్తున ఇంజినీరింగ్‌ కళాశాలలు, ప్రొఫెషనల్‌ కోర్సుల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించారు. పేద ప్రజలకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకే సూపర్‌-6 పథకాలను ప్రకటించారు. మహిళల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్థికంగా చేయూత అందించాలని నారా లోకేష్ మంగళగిరిలో స్త్రీశక్తి పథకాన్ని అమలుచేస్తున్నారు. మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మీరంతా ఆయనను ఆశీర్వదిస్తే మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందిస్తారు’’ అని బ్రాహ్మణి తెలిపారు.

అన్నా క్యాంటీన్లు ఎత్తేసి మా పొట్టగొట్టారు..

‘‘గతంలో అన్నా క్యాంటీన్‌ ద్వారా రూ.5తో మా ఆకలి తీరేది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక క్యాంటీన్లు ఎత్తేసి  మా పొట్టగొట్టారు. గ్రామంలో పబ్లిక్‌ టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. రోడ్లన్నీ అధ్వానంగా మారడంతో అవస్థలు పడుతున్నాం. గత ఐదేళ్లుగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్‌ బిల్లులు రెట్టింపయ్యాయి. చాలీ చాలని ఆదాయంతో ఇంటిల్లిపాది పనిచేసినా ఇల్లు గడవడం కష్టంగా ఉంది.  గతంలో రాజధాని పనులు జరిగే సమయంలో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేది. వైకాపా వచ్చాక రాజధాని పనులు నిలిపివేయడం, కౌలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు సైతం కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది’’ అని బ్రాహ్మణి ఎదుట మహిళా కూలీలు వాపోయారు. మీ అందరికీ అండగా నిలిచేందుకే సూపర్‌-6 పథకాలను ప్రకటించారని బ్రాహ్మణి తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదల ఆకలి తీరుస్తామన్నారు. లోకేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే.. నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img