AP HighCourt: శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా

శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.

Published : 23 Apr 2024 15:17 IST

అమరావతి: శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. వైకాపా నేత తోట త్రిమూర్తులు, మరో 8 మంది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బాధితులను ప్రతివాదులుగా చేర్చాలని కోరింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో  తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 8 మందీ దోషులేనని స్పష్టం చేసింది. 

ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టాల ప్రకారం మొత్తం 9మంది నిందితులకు 18 నెలల సాధారణ జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.42 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో రెండు నెలల జైలుశిక్ష అనుభవించాలని స్పష్టంచేసింది. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని పేర్కొంది. 1996 డిసెంబరు 29న దళితులకు శిరోముండనం చేశారన్న ఆరోపణలతో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం ఠాణాలో అప్పటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మరికొందరిపై 1997 జనవరి 4న కేసు నమోదైంది. మొత్తం 10 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదుచేసి అభియోగపత్రం దాఖలుచేశారు. ఆరో నిందితుడు మరణించగా, మిగిలిన నిందితులపై విశాఖ కోర్టు విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని