logo

బ్యాండేజీ తీశాక బయటపడిన జగన్నాటకం: లోకేశ్‌

జగన్‌రెడ్డి తలకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజీ తీసేస్తే ఎలాంటి మచ్చా లేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని యువనేత, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Published : 28 Apr 2024 05:27 IST

ఇందిరానగర్‌ రచ్చబండలో పాల్గొన్న గ్రామస్థులు, డిజైన్ల పుస్తకాన్ని లోకేశ్‌కు చూపుతున్న మహిళ

మంగళగిరి, న్యూస్‌టుడే: జగన్‌రెడ్డి తలకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజీ తీసేస్తే ఎలాంటి మచ్చా లేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని యువనేత, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరిలోని ఇందిరానగర్‌ వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రచ్చబండలో శనివారం రాత్రి ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్‌పై పడిన స్పెషల్‌ గులకరాయి జగన్‌కు తగిలి.. అటు నుంచి వెల్లంపల్లికి తగిలిందంటూ ఎద్దేవా చేశారు. 2019లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయితో దాడి చేయించుకున్నారని ఆరోపిచారు. సొంత బాబాయ్‌ని చంపి ఆ నెపం చంద్రబాబుపై నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందారన్నారు. ఒకటో తేదీన పింఛను ఇవ్వకుండా 32 మంది వృద్ధుల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. సొంత చెల్లెలు పసుపు రంగు చీర ధరిస్తే తెదేపా అని విమర్శిస్తున్నారని, మరి ఆయన తల్లి, భార్య కూడా పసుపు చీర ధరిస్తే వారిని ఏమంటారో అని ప్రశ్నించారు. సొంత తల్లి, చెల్లికే న్యాయం చేయలేని వారు ప్రజలకేం న్యాయం చేస్తారని నిలదీశారు. తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తులిమిల్లి రామకృష్ణ, నాయకులు దామర్ల రాజు, గోవాడ దుర్గారావు, మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని, తాగునీటి ఎద్దడి తీర్చాలని, ఉపాధి కల్పించాలని స్థానికులు లోకేశ్‌కు విన్నవించారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని