logo

సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి

బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్‌లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి  బయటకి కనిపిస్తున్న ఇనుప చువ్వలు.. వంతెనలపైనే గోతులు.. ఇవీ సామాన్యుడు వెళ్లే వారధులు.. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రగతిదారులు.. అదే సీఎం సారు బయటకు అడుగేస్తే వాటి రూపురేఖలే మారిపోతాయి.. ఆయన అడుగుపెట్టేచోట ముందురోజే తళతళలాడే తారు రోడ్డు వేయాల్సిందే.

Updated : 28 Apr 2024 09:20 IST

శిథిల వంతెనల మరమ్మతులకు నిధులివ్వరు
అధ్వాన స్థితిలో వాహనదారుల రాకపోకలు

ఈనాడు, అమరావతి న్యూస్‌టుడే, దుగ్గిరాల, పొన్నూరు: బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్‌లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి  బయటకి కనిపిస్తున్న ఇనుప చువ్వలు.. వంతెనలపైనే గోతులు.. ఇవీ సామాన్యుడు వెళ్లే వారధులు.. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రగతిదారులు.. అదే సీఎం సారు బయటకు అడుగేస్తే వాటి రూపురేఖలే మారిపోతాయి.. ఆయన అడుగుపెట్టేచోట ముందురోజే తళతళలాడే తారు రోడ్డు వేయాల్సిందే. శిథిల వంతెనలకూ మరమ్మతులు చేయాల్సిందే. రూ.కోట్లు ఖర్చయినా సీఎంకు అసౌకర్యం కలగకూడదంతే. జగన్‌ మార్క్‌ పాలన అంటే ఇదే.

ప్రమాదకరస్థితిలో వంతెనలు

ఉమ్మడి గుంటూరులో చాలాచోట్ల వంతెనలు, కల్వర్టులు, చప్టాలు శిథిలావస్థకు చేరుకుని పాడైపోవడంతో వాహనచోదకులు రాకపోకలు సాగించడానికి భయాందోళనలు చెందుతున్నారు. వాటి నిర్వహణ, మరమ్మతులకూ నిధులు కరవయ్యాయి. వంతెనల జీవితకాలం ముగిసినా వాటిస్థానంలో కొత్తవి నిర్మించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. కొన్ని పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో భారీవాహనాల రాకపోకలను నియంత్రించారు. భారీ వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండడంతో సమయం, ఇంధనం వృథా అవుతోంది.

సీఎం జగన్‌ తాడేపల్లిలో తన నివాసం నుంచి పశువులాస్పత్రి మీదుగా వెళ్లి మైదానంలో ఉన్న హెలీకాప్టర్‌ ఎక్కాల్సి ఉంది. సీఎం ప్రయాణించే దారిలో వంతెన బాలేదని రూ.1.8కోట్లు వెచ్చించి ఆగమేఘాల మీద మరమ్మతులు చేపట్టారు.

ఎక్కడెక్కడ ఎలా...

  • గుంటూరు నగరంలో పాత, కొత్త నగరాలను కలిపే కీలకమైన శంకర్‌విలాస్‌వంతెన శిథిలావస్థకు చేరింది. పదేళ్ల నుంచి నూతన వారథి నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ, రైల్వే, నగరపాలక సంస్థల మధ్య సమన్వయంతో చేపట్టాల్సిన పనులు ఒక అడుగు ముందుకు మూడుడగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ఉదయం, సాయంత్రం వేళ్లలో వంతెనపై విపరీతమైన రద్దీతో ఇరుకు మార్గంలో రాకపోకలకు ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఏదైనా కారణాల వల్ల వంతెనపై వాహనం ఆగిపోతే ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు అరగంటకుపైగా సమయం పడుతోంది.
  • గుంటూరు నుంచి నందివెలుగు వెళ్లే మార్గంలో హాఫ్‌పేట వద్ద వంతెన పాడై పోగా మరమ్మతులతో సరిపెట్టారు. అటుఇటూ రెయిలింగ్‌ దెబ్బతిని ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. వంతెనకు కొన్నిచోట్ల పగుళ్లు సైతం వచ్చాయి.

20 కి.మీ.లు చుట్టూ తిరగాల్సిందే..

  • ప్రత్తిపాడు నుంచి చినకొండ్రుపాడు మీదుగా జాతీయరహదారికి వెళ్లే మార్గంలో లోలెవల్‌ చప్టా కుంగిపోయి మధ్యలో పెద్ద గొయ్యి పడింది. దీంతో భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. సుమారు 20 కిలోమీటర్లు అదనంగా తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది.
  • దుగ్గిరాల వద్ద కృష్ణా పశ్చిమడెల్టా ప్రధాన కాలువపై పాదచారులు, ద్విచక్రవాహనదారులు వెళ్లడానికి ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. ఇరువైపులా కమ్మీలు పూర్తిగా పోయాయి. గతంలో ఇక్కడ పోలీసులు కర్రలు కట్టి వంతెన ప్రమాదకరంగా ఉందని హెచ్చరిక బోర్డు సైతం పెట్టారు. ఇదే కాలువ మీద రేవేంద్రపాడు వద్ద వంతెన అడుగుభాగం ఇనుప చువ్వలు బయటపడి, పిట్ట గోడ పడిపోయింది. వద్దని చెప్పినా ఈ వంతెనపై విద్యాసంస్థల బస్సులు, అధికలోడ్‌తో ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి.

ఇదీ గుంటూరు- బాపట్ల ప్రధాన రహదారి. చేబ్రోలు సమీపంలో కొమ్మమూరు సాగు నీటి కాలువపై సూమారు 110 ఏళ్ల కిందట ఈ వంతెన నిర్మించారు. 2018లో వంతెన ఒకవైపు కుంగిపోయింది. రోడ్లు భవనాలశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. నూతన వంతెన నిర్మాణ పనులకు అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.32కోట్లు మంజూరు చేసింది. ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభించలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. వంతెన నిర్మాణ పనులు చేపడతానని ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య 2019 ఎన్నికల ముందు ప్రకటించారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే వంతెన నిర్మాణ పనులకు హడావుడిగా శంకుస్థాపన చేయడం గమనార్హం.

ఇదీ దుగ్గిరాల మండలం శృంగారపురం వద్ద రేపల్లె కాల్వపై 1980లో నిర్మించిన వంతెన.  వంతెన అడుగుభాగం దెబ్బతింది. గోడ ఒకవైపు ఒరిగిపోతోంది. పెదపాలెం, శృంగారపురం, రేవేంద్రపాడు, చినపాలెం, నూతక్కి తదితర గ్రామాల రైతులు, ప్రజలు దీన్ని ఉపయోగిస్తారు. నిత్యం వందల మంది ప్రయాణం చేస్తారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని తీసుకెళ్తారు. కార్లు, ట్రాక్టర్లు, లారీలు సైతం వెళ్తుంటాయి. వంతెనకు దాదాపు 150 మీటర్ల దిగువన రేపల్లె కాల్వ ప్రవహిస్తోంది.

ఇదీ దుగ్గిరాల మండలం గొడవర్రు కాలి వంతెన. గొడవర్రుతో పాటు కొల్లిపర మండలం అత్తలూరివారిపాలెం రైతులు ఉపయోగిస్తారు. కాల్వ అవతల సాగయ్యే 1000 ఎకరాల పొలాల రైతులు, ఆ చేలల్లో పనిచేసే రైతు కూలీలు నిత్యం దీన్ని వినియోగిస్తారు. రెండు వైపులా గోడలు విరిగాయి. పలుచోట్ల పగుళ్లు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని