logo

నిలదీతలకు వేరసి.. పనులకు తెరదీసి..

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా నగరపాలిక అధికారులు అదేం పట్టించుకోకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రస్తుతం కొత్త పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు పనులు చేపట్టగా వాటిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Published : 28 Apr 2024 05:42 IST

నగరపాలిక అధికారులపై మంత్రి రజిని ఒత్తిడి!
కోడ్‌ ఉన్నా రాత్రికి రాత్రి రోడ్ల నిర్మాణాలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా నగరపాలిక అధికారులు అదేం పట్టించుకోకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రస్తుతం కొత్త పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు పనులు చేపట్టగా వాటిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ విషయం తెలుసుకుని ఒకటి, రెండు రోజులు మౌనం వహించారు. ఆ తర్వాత తిరిగి పనులు చేపట్టడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనంలోకి వెళ్తున్న అధికార అభ్యర్థులకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మా డివిజన్లలో రోడ్లు, మురుగు కాల్వలు సరిగా లేవని, వాటి నిర్మాణాలు చేపట్టాలని కార్పొరేటర్లు, అప్పటి ఎమ్మెల్యేలకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని నిలదీస్తున్నారు. దీంతో పశ్చిమం నుంచి పోటీ చేస్తున్న మంత్రి విడదల రజని అప్రమత్తమయ్యారు. ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు చేపట్టకుండా ఉన్న ప్రాంతాల్లో వెంటనే వాటిని ప్రారంభించాలని అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పనులు చేయిస్తున్నారు.

ఎన్నికల అధికారులూ చూస్తున్నారా?

మూడేళ్ల నుంచి ఆర్వోబీ ప్రతిపాదన ఉందని చెప్పి శ్యామలానగర్‌ గేటు ప్రధాన రహదారి పనులు విస్మరించారు. మోకాలి లోతు గుంతలు పడి రోడ్డు అధ్వానంగా మారింది. అటుగా రాకపోకలు సాగించడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు ఇంత దారుణంగా ఉంటే ఓట్లు ఎలా వేస్తారని ఆలోచించి మంత్రి రజని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అది పూర్తి కాగానే తాజాగా మరికొన్ని పనులు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పట్టాభిపురం పోలీసు స్టేషన్‌ రోడ్డులో కొత్తగా తారు రోడ్డు పనులు మొదలుపెట్టారు. మరోవైపు ఏటీఅగ్రహారం రోడ్డు పనులు వేగవంతం చేశారు. అరండల్‌పేట, వికాస్‌నగర్‌, విద్యానగర్‌ ప్రాంతాల్లో బాగా వ్యతిరేకత ఉందని తెలుసుకుని అక్కడా ఇదే వ్యూహాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీకి మేలు చేసేలా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నా ఎన్నికల అధికారులు స్పందించడం లేదు.

తూర్పు ఆర్వోగా కమిషనర్‌ కీర్తి చేకూరి ఉన్నారు. ఆ నియోజకవర్గ పరిధిలో రాజీవ్‌గాంధీనగర్‌లో కోడ్‌వేళ పలు సీసీ రోడ్లు వేసినా కనీసం స్పందించలేదు. పశ్చిమంలో ఆర్వోగా అదనపు కమిషనర్‌ ఉన్నారు. వారెవరూ ఈ కొత్త పనులపై నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల్లో అధికార అభ్యర్థులకు లబ్ధి చేయడమే యంత్రాంగం తీరుగా ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఏడాది కిందట టెండర్లు... ఇప్పుడు పనులా!

ఈ కొత్త పనులపై ఈఈ సుందరరామిరెడ్డిని వివరణ కోరగా ‘గతంలో టెండర్లు పిలిచిన పనులే ఇప్పుడు చేస్తున్నాం. అవేం కొత్త పనులు కాదు. ఎన్నికల అధికారులకు సమర్పించిన జాబితాలో పనులే చేస్తున్నామని’ తెలిపారు. కోడ్‌ అమల్లో ఉండగా ఏడాది కిందట టెండర్లు పిలిచి ఇప్పుడెలా చేస్తారని ప్రశ్నిస్తే ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

  • ఇదీ పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌ రోడ్‌ ఇక్కడ తారు(బీటీ) రోడ్డు కొత్తగా వేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌ స్టేడియం జంక్షన్‌ నుంచి పట్టాభిపురం కృష్ణాశ్రమం వరకు బీటీ వేయాల్సి ఉన్నా అప్పట్లో గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో కృష్ణనగర్‌ వరకు పనులు చేసి ఆపేశారు. అసంపూర్తి పనులపై జనం నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ సగం రోడ్డు నిర్మించకపోతే అధికార పార్టీకి నష్టం జరుగుతుందనుకున్నారో ఏమోకానీ హడావుడిగా శనివారం మిగిలిన పనులు ప్రారంభించారు. కోడ్‌ అమల్లో ఉండగా రాత్రికి రాత్రి పనులెలా చేపట్టారో అధికారులే చెప్పాలి.

  • ఈ చిత్రంలో కనిపిస్తున్నది విద్యానగర్‌ మూడోలైన్‌. పార్కు ప్రదేశంలో ఏడాది కిందటే అక్కడున్న ఒకటో, రెండో లైను పనులు చేశారు. మూడోలైను పనులు తాజాగా చేపట్టారు. గతంలో గుత్తేదారుకు బిల్లులు పేరుకుపోయాయి. మిగిలిన పనులు చేయలేనని పనులు మొదలుపెట్టలేదు. ప్రస్తుతం కొత్తగా మూడోలైను రహదారి యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ఏడాది కిందట టెండర్లు పిలిచిన పనుల్ని ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఎలా చేస్తున్నారో ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి.
  • వికాస్‌నగర్‌ నీటి ట్యాంకుల వద్ద మూడో లైన్‌లో సైడుకాల్వ నిర్మించి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. వాస్తవానికి ఈ రోడ్డు ఎన్నికల కోడ్‌కు ముందుగా టెండర్లు పిలిచి చేపట్టిన పనులు కావని, తక్షణమే వాటిని ఆపాలని కొందరు ఎన్నికల సంఘానికి, ఎంసీసీ బృందాలకు ఫిర్యాదు చేశారు. దీంతో పనులు మొదలుపెట్టలేదు. రెండు రోజులు ఆపారు. ఏమనుకున్నారో ఏమో శుక్రవారం మురుగుకాల్వ నిర్మాణ పనులు మళ్లీ చేపట్టారు. ప్రస్తుతం సీసీ రోడ్డు పనులు చేస్తున్నారు. ఎంసీసీ బృందాలకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పనులు చేయడం గమనార్హం.

  • దీ అరండల్‌పేట 17వ లైన్‌. అరండల్‌పేట ప్రాంతంలో రహదారులు నిర్మించకుండా రెండేళ్లుగా నగరపాలక విస్మరించింది. ఆ ప్రాంత ప్రజలు, స్థానిక కార్పొరేటర్‌ శ్రీవల్లి అనేక సందర్భాల్లో తమ డివిజన్లలో పనులు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటిది ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు అక్కడ కొత్తగా రోడ్డు వేయడం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని