logo

అర్ధరాత్రి దళిత మహిళల దుకాణాల కూల్చివేత

పేద దళిత మహిళల దుకాణాలను శనివారం అర్ధరాత్రి కూలగొట్టించిన వైకాపా కార్పొరేటర్‌ అచ్చాల వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 29 Apr 2024 06:23 IST

కారకుడైన వైకాపా కార్పొరేటర్‌ వెంకటరెడ్డిని అరెస్టు చేయాలి
ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌

కూల్చివేసిన దుకాణాలు

ఏటీ అగ్రహారం(గుంటూరు), న్యూస్‌టుడే : పేద దళిత మహిళల దుకాణాలను శనివారం అర్ధరాత్రి కూలగొట్టించిన వైకాపా కార్పొరేటర్‌ అచ్చాల వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం గుంటూరులోని ఏటీ అగ్రహారం 10వ వీధిలో దుకాణాలు పగలగొట్టిన ప్రాంతంలో బాధిత దళిత మహిళలు రోజమ్మ, వాణిలతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ లిటరేచర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు విల్సన్‌ మాట్లాడుతూ 70 ఏళ్లుగా అక్కడ దుకాణం పెట్టుకొని జీవిస్తున్న దళిత మహిళలు రోజమ్మ, వాణిల స్థలంపై కార్పొరేటర్‌ వెంకటరెడ్డి కన్నేసి గతంలో కబ్జాకు ప్రయత్నించాడన్నారు. అప్పుడు దళిత మహిళలందరూ అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అయినా కబ్జా చేయాలనే ప్రయత్నాలు మానుకోకుండా శనివారం అర్ధరాత్రి వారి దుకాణాలను పగలగొట్టించారని ఆరోపించారు. దళిత మహిళల ఆస్తిని ధ్వంసం చేసిన వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పేద దళిత మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కార్పొరేటర్‌ను ఎన్నికల దృష్ట్యా జిల్లా నుంచి బహిష్కరించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సమావేశంలో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ముత్తయ్య, వీసీకే పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె.జయసుధ, భారత్‌ బచావో నాయకులు ఎం.సమత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని