logo

వైద్యుల ఇష్టారాజ్యం.. పేదలకు సేవలు దూరం

ఆసుపత్రులను అన్ని విధాలుగా మెరుగు పరిచి రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తామని ఓ పక్క రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు చెబుతుండగా పరిగిలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 23 May 2022 01:23 IST

పరిగి సామాజిక ఆసుపత్రిలో అంతర్గత విభేదాలు

న్యూస్‌టుడే, పరిగి

ఆసుపత్రులను అన్ని విధాలుగా మెరుగు పరిచి రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తామని ఓ పక్క రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు చెబుతుండగా పరిగిలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్గత విభేదాలతో వైద్యులు విధులకు హాజరు కాక రోగులు అవస్థలు పడుతున్నారు. వరుస ఘటనలతో పరిగి ప్రాంత ప్రజలు సామాజిక ఆసుపత్రికి వెళ్లేందుకు వెనకడుగు వేయాల్సి వస్తోంది.

ఈ ఆసుపత్రి ఒక్కటే దిక్కు

పరిగి మండలంతో పాటు పూడూరు, దోమ, కుల్కచర్ల మండలాల ప్రజలకు సామాజిక ఆసుపత్రి ఏకైక దిక్కు. ఆయా మండలాల్లో 2.65 లక్షల జనాభా నివసిస్తోంది. వైద్యుల్లో నెలకొన్న అంతర్గత విభేదాలు వైద్య సేవలకు తీరని అవరోధంగా మారుతున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. స్థానికంగా నలుగురు వైద్యులు పనిచేస్తున్నారు. ఆదివారం రావాల్సిన ఓ వైద్యుడు విధులకు హాజరు కాలేదు. అప్పటివరకు పనిచేస్తున్న మరో వైద్యురాలు వెళ్లిపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఉసూరుమంటూ వెనుదిరుగాల్సిన దుస్థితి నెలకొంది. విషయం జిల్లా వైద్యాధికారి తుకారంభట్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే మీద శ్రీకాంత్‌ అనే వైద్యుడిని పరిగికి పంపాల్సి వచ్చింది.

రూ.3.5కోట్లతో ఆధునిక భవనం

పేదల సౌకర్యార్థం ప్రభుత్వం రూ.3.5కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక భవనాన్ని నిర్మించింది. ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేసింది. అంతేగాకుండా రెండు నెలల క్రితం దీనిని వైద్య విధాన పరిషత్‌లోకి మార్చింది. ఇటీవలే ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రక్తశుద్ధి కేంద్రాన్ని తీసుకువచ్చారు. ఓవైపు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుండగా వైద్యుల లొల్లి పేదల ప్రాణాల మీదకు వస్తోంది. వైద్యుల్లో నెలకొన్న అంతర్గత విభేదాలు పలుమార్లు బట్టబయలయ్యాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో అనాథ ఆసుపత్రిగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది పనితీరు కూడా ఇదే విధంగా మారిందన్నారు.

ఆరు నెలలుగా తిరగడం మానేశాయి

ఆసుపత్రికి అంబులెన్సు వాహనాలు ఉన్నా అవి ఆరు నెలలుగా పనిచేయడం లేదు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యా యత్నాలు, ప్రసవాల సమయంలో కళ్లముందు ప్రాణాలు పోతున్నా సకాలంలో స్పందించి ఘటనా స్థలానికి చేరడంలేదు. ఆసుపత్రికి వచ్చే నిధులు మాత్రం ఎప్పటికప్పుడు ఖర్చవుతున్నాయి. ఇవనీ ఎటుపోతున్నాయో ఎవరికీ తెలియదు. అత్యవసరమైతే విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌ అంబులెన్సు నిర్వాహకులు అడిగినంత ఇచ్చి వారి వాహనాల్లో ఉస్మానియా ఇతరత్రా ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోంది.

* వారం రోజుల క్రితం దోమ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బాసుపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోగా మరో యువకుని కాలు విరిగింది. ఇంకో యువకుని తల పగిలిగాయమైంది. వెంటనే పరిగి సామాజిక ఆసుపత్రికి తరలించారు. అంబులెన్సు కోసం వారు వైద్యులను బతిమాలినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ప్రైవేట్‌ వాహనాల్లో తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. క్షతగాత్రులు మొత్తుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారనే విమర్శలున్నాయి.

శాఖాపరమైన చర్యలు చేపడతాం

- తుకారం భట్‌, జిల్లా వైద్యాధికారి

పరిగి ఆసుపత్రిపై వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఎవరి విధులు వాళ్లు నిర్వహించాల్సిందే. ఒకరే నిరంతరంగా విధులు నిర్వహించడం అన్నది కూడా సరికాదు. ఆసుపత్రి పనితీరును మెరుగు పరిచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఆదివారం చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని