logo

పసిడి కథా నేరచిత్రమ్‌!

పాతబస్తీ సర్దార్‌మహల్‌ ప్రాంతంలో స్మగ్లింగ్‌ బంగారం ఉందనే సమాచారంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు వెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉన్నారు. ఏం జరిగిందో అంతలోనే పోలీసులపై దాడికి తెగబడ్డారు.

Published : 04 May 2023 02:55 IST

నగరంలోకి భారీగా స్మగ్లింగ్‌ బంగారం
ఆధిపత్యానికి గ్యాంగ్‌వార్‌
ఈనాడు, హైదరాబాద్‌ చార్మినార్‌, న్యూస్‌టుడే

శంషాబాద్‌ విమానాశ్రయంలో చిక్కిన బంగారం

* పాతబస్తీ సర్దార్‌మహల్‌ ప్రాంతంలో స్మగ్లింగ్‌ బంగారం ఉందనే సమాచారంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు వెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉన్నారు. ఏం జరిగిందో అంతలోనే పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఈకేసులో 8 మందిని మొగల్‌పుర పోలీసులు అరెస్ట్‌ చేశారు.

* చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో బంగారు ఆభరణాలు తయారీకి పశ్చిమబెంగాల్‌, యూపీ, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి వందలాది మంది కార్మికులు వస్తుంటారు. ముడిబంగారం చేతిలోకి చేరగానే కొద్దిమంది రాత్రికి రాత్రే పారిపోతుంటారు. ఈ ఏడాది 4 నెలల వ్యవధిలో సుమారు 10 మంది ఇలా మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీటిలో నాలుగు కేసులు నమోదయ్యాయి.

* గతేడాది జూన్‌లో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ 2 కిలోల బంగారం చేరింది. దీన్ని తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు శంషాబాద్‌ విమానాశ్రయం బయటకు రాగానే మాయమయ్యారు. స్మగ్లింగ్‌ ముఠా ఆ ముగ్గురి కుటుంబాల్లోని నలుగురిని కిడ్నాప్‌ చేసింది. విషయం పోలీసులు కేసు నమోదు చేసి మమ అనిపించారు. దీనివెనుక దాగిన ముఠాల గుట్టు వెలికితీయటంలో మీనమేషాలు లెక్కించారు.

దశాబ్దాలుగా బంగారం దందా సాగిస్తున్న నగరంలోని దళారులు, ఏజెంట్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ప్రత్యర్థుల గుట్టు పోలీసులకు చేరవేస్తున్నారు. రంగంలోకి దిగుతున్న పోలీసుల్లో కొందరు ఇరువర్గాలకు రాజీ కుదిర్చి కమీషన్‌ కింద పసిడి కొట్టేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆభరణాలు తయారు చేస్తామంటూ ముడిబంగారం తీసుకొని కార్మికులు పారిపోయినా కొందరు వ్యాపారులు నోరుమెదపలేకపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్మగ్లింగ్‌ గుట్టు బయటపడుతుందని మౌనం వహిస్తున్నారు. శాలిబండ, చార్మినార్‌, బేగంబజార్‌, ఘాన్సీబజార్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌, నారాయణగూడ ప్రాంతాల్లో బంగారు ఆభరణాల తయారీ కేంద్రాలున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన యువకులు ఇక్కడ రోజువారీ కార్మికులుగా పనిచేస్తున్నారు.

ష్‌.. అంతా గప్‌చుప్‌.. మహానగరం బంగారం జీరో వ్యాపారానికి కేరాఫ్‌ చిరునామా. దేశ, విదేశాలకు చెందిన నల్లధనం హవాలా రూపంలో చేర్చటంలో కొందరు బంగారు వ్యాపారులే కీలకపాత్ర పోషిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, దుబాయ్‌ తదితర ప్రాంతాల నుంచి నగరంలోకి రోజూ రూ.10కోట్ల విలువైన బంగారం అడ్డదారిలో చేరుతోందని అంచనా. ఇంత భారీగా సాగే వ్యాపార లావాదేవీలు నేరాలకు కారణమవుతున్నాయి. అధికశాతం పోలీసుల వరకూ చేరకుండా వ్యాపారులే సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారు. స్మగ్లర్ల మధ్య ఆధిపత్యపోరు మొదలైనపుడు కొందరు పోలీసు అధికారులు రంగ ప్రవేశం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. శివారు ప్రాంత ఠాణాకు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్‌ బంగారంపై ఆశతో వేసిన తప్పటడుగు బెడసికొట్టినట్టు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులకు విషయం తెలిసినా అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే పరువు పోతుందనే ఉద్దేశంతో మౌనం వహించినట్టు తెలుస్తోంది. మరో ఇన్‌స్పెక్టర్‌ అక్రమంగా చేరిన బంగారం విషయం బయటకు రాకుండా ఉండేందుకు రెండు బంగారు బిస్కెట్లు బహుమతిగా అందుకున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని