logo

అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు.. ఓటర్లు ఎటు?

సార్వత్రిక ఎన్నికల వేళ చేవెళ్ల రాజకీయం రసకందాయంగా మారుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమరం సమయంలో ఆ పార్టీలో ఉన్న వాళ్లు ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో ఉన్న వాళ్లు ఆ పార్టీలోకి మారడం సర్వసాధారణమైంది.

Published : 22 Mar 2024 01:16 IST

రసకందాయంగా చేవెళ్ల రాజకీయం
కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంజిత్‌ రెడ్డి  

న్యూస్‌టుడే, వికారాబాద్‌: సార్వత్రిక ఎన్నికల వేళ చేవెళ్ల రాజకీయం రసకందాయంగా మారుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమరం సమయంలో ఆ పార్టీలో ఉన్న వాళ్లు ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో ఉన్న వాళ్లు ఆ పార్టీలోకి మారడం సర్వసాధారణమైంది. ఈ పరిణామం ఓటర్లను ఒకింత గందరగోళానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో చేవెళ్లకు అభ్యర్థులను ప్రకటించడం పార్టీల అధిష్ఠానాలకు ఒకింత క్లిష్లంగానే మారింది. భాజపా తొలి జాబితాలోనే తమ అభ్యర్థిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ప్రకటించింది. భారాస తరఫున గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెదేపా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కారు ఎక్కిన కాసాని జ్ఞానేశ్వర్‌ బరిలోకి దిగనున్నారు. కాస్త ఆలస్యంగానైనా సిట్టింగ్‌ ఎంపీ, ఇటీవల కారు దిగి చేయి అందుకున్న రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని వికారాబాద్‌, పరిగి, తాండూర్‌ శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్‌, చేవెళ్ల, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం స్థానాల్లో భారాస అభ్యర్థులు విజయం సాధించారు.

భాజపా దూకుడు.. దేశంలో వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో భాజపా వ్యూహాలు రచిస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన బి.జనార్దన్‌రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 15.52 శాతం ఓట్లను మాత్రమే సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లోనూ భాజపా ప్రభావం పెద్దగా కనిపించలేదు. పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఓటర్లు భాజపా వైపు మొగ్గు చూపుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బలమైన అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బరిలో దించింది. చేవెళ్ల ఎమ్మెల్యేల పరిధిలో భాజపా ప్రాతినిథ్యం లేకున్నా, కాంగ్రెస్‌, భారాసలకు దీటుగా ప్రచారం చేసేందుకు కసరత్తు చేస్తోంది.

భారాసలో మలుపు తిరిగిన రాజకీయం

ప్రస్తుతం చేవెళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారాస సిట్టింగ్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిని రెండోసారి పోటీకి దించాలని రెండు మాసాల కిందటే నిర్ణయించారు. అప్పట్లో ఆయన కిమ్మనలేదు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి పోటీకి విముఖత వ్యక్తం చేసి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయనుండటం ఆపార్టీకి ఒకింత ప్రతికూలాంశమే. దీన్ని అధిగమించడానికి జిల్లాలో పరపతి, పలుకుబడి ఉన్న బలమైన బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలో నిలిపింది. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాలకు గాను చేవెళ్ల, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాల్లో భారాస గెలుపొందడం ఆపార్టీకి కలిసొచ్చే అంశం. ఈ నెల 18న మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి నివాస గృహంలో కాసాని జ్ఞానేశ్వర్‌, ఎమ్మెల్సీ వాణిదేవి చేవెళ్ల, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేలు యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఆనంద్‌, మహేష్‌రెడ్డిలతో సమావేశమై గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై చర్చించారు.

గడ్డం రంజిత్‌రెడ్డి నేపథ్యం

గడ్డం రంజిత్‌రెడ్డి వ్యాపారవేత్త. 1964 సెప్టెంబరు 18న వరంగల్‌లో రాజారెడ్డి, చంద్రకళ దంపతులకు జన్మించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వెటర్నరీ సైన్స్‌ విభాగంలో పీజీ పట్టా పొందారు. ఈయన భార్య సీతారెడ్డి తితిదే పాలకవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. భారాస అధినేత కేసీఆర్‌తో ఉన్న మంచి సంబంధాలతో 2019లో చేవెళ్లనుంచి  స్వల్ప మెజార్టీతో గెలిచారు.

హస్తగతం చేసుకోవాలని..

గత శాసనసభ ఎన్నికల ఊపునే కొనసాగించి చేవెళ్ల స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఇక్కడి నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రంజిత్‌రెడ్డి భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరి అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ అధ్యక్షురాలిగా రెండుసార్లు, వికారాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలిగా కొనసాగిన పట్నం సునీతారెడ్డి ఇటీవలే భారాసకు రాజీనామా సమర్పించి కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడి నుంచి ఈమెను రంగంలోకి దింపి విజయం సాధించాలని కాంగ్రెస్‌ తొలుత భావించినా, అనూహ్యంగా ఆమెకు మల్కాజిగిరి టిక్కెట్‌ ఇచ్చారు. నాయకులు ఇటీవలే పార్టీలు మారి చేరడం అనేది కాంగ్రెస్‌కు ఏమేరకు కలిసొస్తుందో చూడాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు