icon icon icon
icon icon icon

Priayanka Gandhi: తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి చాటి చెప్పాలి: ప్రియాంక

రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని దేశంలో ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. 

Published : 11 May 2024 17:56 IST

తాండూరు: రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని దేశంలో ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేవీ ఉండవని చెప్పారు. రైతుల, నిరుపేదలు, మహిళల కోసం ఆ ప్రభుత్వం ఏమీ చేయదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాస్‌ సిలిండర్‌ రూ.1200 ఉందని,  తెలంగాణలో రూ.500కే ఇస్తున్నామని గుర్తు చేశారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ప్రియాంక ప్రసంగించారు.

‘‘ భాజపా పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. పేద రైతులు రూ.50 వేలు, రూ.లక్ష రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి రుణమాఫీ చేసేందుకు భాజపా సర్కార్‌ అంగీకరించదు. కానీ, బడా వ్యాపారులకు మాత్రం భాజపా సర్కార్‌ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసింది. కీలకమైన సంస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని ఆడిస్తోంది. ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకునే ప్రయత్నాన్ని మోదీ ఎప్పుడూ చేయరు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వచ్చి ధర్మం అనే నినాదం ఎత్తుకుంటారు. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టి ఓట్లు వేయించుకుంటారు. కాంగ్రెస్‌పై భాజపా నేతలు ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు. కాంగ్రెస్‌ కొందరి ఆస్తులు గుంజుకొని మరో వర్గానికి ఇస్తుందని భాజపా దుష్ప్రచారం చేస్తోంది.

రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి మోదీ దానిని రాయలేదు. మన పూర్వీకులు ఎంతో కృషి చేసి భావితరాల కోసం రూపొందించారు. రాజ్యాంగమే మనకు ఎన్నో అవకాశాలు కల్పించింది. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది రాజ్యాంగం మాత్రమే. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి చాటి చెప్పాలి. ఈ రాష్ట్రానికి భాజపా ఏం చేసిందో అడగాలి. ఈ ప్రాంతం ఎంతో సుభిక్షమైనది. తెలంగాణ ప్రజలు ఎంతో కృషి చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు. భాజపా అబద్ధాలు నమ్మి.. మోసపోయేది లేదని చాటి చెప్పాలి’’ అని ప్రియాంక పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img