logo

రంజాన్‌ ఘుమఘుమలు.. ఓల్డ్‌ సిటీలో అర్ధరాత్రైనా జనాల కిటకిట

పాతనగరంలో రంజాన్‌ సందడి మొదలైంది. మెహిదీపట్నం, టోలిచౌకి, నాంపల్లి, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో అర్ధరాత్రుళ్లూ జనాలు కిటకిటలాడుతున్నారు. తక్కువ ఖర్చులో దొరికే వస్తువుల షాపింగ్‌ కోసం మహిళలు, నచ్చిన వంటకాలు ఆరగించేందుకు పురుషులు ఛలో చార్మినార్‌ అంటున్నారు.

Updated : 24 Mar 2024 07:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: పాతనగరంలో రంజాన్‌ సందడి మొదలైంది. మెహిదీపట్నం, టోలిచౌకి, నాంపల్లి, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో అర్ధరాత్రుళ్లూ జనాలు కిటకిటలాడుతున్నారు. తక్కువ ఖర్చులో దొరికే వస్తువుల షాపింగ్‌ కోసం మహిళలు, నచ్చిన వంటకాలు ఆరగించేందుకు పురుషులు ఛలో చార్మినార్‌ అంటున్నారు. హైదరాబాద్‌ వాసులే కాదు శివారు ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చినవారు, విదేశీయులు రంజాన్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మధ్యాహ్నం 12నుంచి అర్ధరాత్రి 2గంటల వరకు సందడి ఉంటోంది. పండగ నేపథ్యంలో వ్యాపారులు వినూత్న ఉత్పత్తులను పరిచయం చేయడంలో పోటీ పడుతున్నారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వేర్వేరు బ్రాండ్‌ స్టోర్లు పాతనగరంలో ఏర్పాటు చేశారు.

ఏ వస్తువులు ఎక్కడ లభిస్తాయంటే.. గుల్జార్‌హౌజ్‌ మార్కెట్‌లో అత్యంత విలువైన ముత్యాల నుంచి మహిళలకు అవసరమైన ప్రతి వస్తువూ లభిస్తుంది. మదీనా బిల్డింగ్‌, మొఘల్‌పురా మధ్య 2 కిలోమీటర్ల మేర టపాకాయలు, బూట్లు, పాదరక్షలు, గృహోపకరణాలు, దుస్తులు, టోపీలు, గాజులు, ఇతర వస్తువుల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇఫ్తార్‌ సమయంలో ‘రోజా’ను పాటించేవారి కోసం వేర్వేరు పండ్ల అమ్మకాలకు గిరాకీ పెరిగింది. లాల్‌బజార్‌ బ్యాంగిల్‌ మార్కెట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడి మెరిసే గాజులు, మెహందీ కోసమే చార్మినార్‌కు వచ్చేవారున్నారు.

వంటకాల విషయానికొస్తే.. హైకోర్టు రోడ్డు మదీనా సర్కిల్‌లో ఉన్న హోటల్‌ షాదాబ్‌లో చికెన్‌ కబాబ్‌ల నుంచి మటన్‌ బిర్యానీ, హలీం, మిర్చి కా సలాన్‌ వరకు అనేక ఆహార పదార్థాలు లభిస్తాయి. రుచిలో నిజాంకాలం నాటి వంటకాలను గుర్తుచేస్తాయి. నయాపూల్‌రోడ్‌ సమీపంలోని హోటల్‌ నయాబ్‌ చార్‌కోని నాన్‌ కోసం జనాలు క్యూ కడుతున్నారు. శాలిబండ కరాచీ బేకరీ సమీపంలోని షాగౌస్‌ రెస్టారెంట్‌ మొఘలాయి వంటకాలకు ప్రసిద్ధి. రంజాన్‌ మాసంలో ఇక్కడ లభించే ఆహారం కూడా ప్రత్యేకం. మటన్‌హలీమ్‌, ఖుబానీకా మీఠా, షాహీ తుక్డా, ఫిర్నీ వంటి వంటకాలు జిహ్వను మైమరిపిస్తాయి. మెహిదీపట్నం మసీద్‌ రోడ్‌లోని ప్రిన్స్‌ హోటల్‌లోని ఖిచ్డీ కీమా, చికెన్‌ 65 వంటకాలకు ఫేమస్‌. టోలిచౌకిలో ఉన్న సీజన్స్‌ రెస్టారెంట్‌ కబ్సాలహమ్‌, హలీం, మటన్‌బిర్యానీ వంటకాల కోసం జనాలు ఎగబడుతుంటారు.

అరబ్‌ వస్తువులకు కేరాఫ్‌ బార్కాస్‌ బజార్‌

అరబ్‌ సంస్కృతికి నిలయమైన బార్కాస్‌లో రంజాన్‌ సందడి మొదలైంది. పాతనగరానికి ఆనుకొని ఉన్నప్పటికీ ఈ ప్రాంత ఆచారాలన్నీ అరబ్‌ దేశాలవే. వహ్లాన్‌, బామ్స్‌, ఆవల్గీ, యాఫై, బహమాద్‌, కసేరీ తదితర కుటుంబీకులు ఇక్కడ నివసిస్తున్నారు. సూది, నెయిల్‌కట్టర్‌, అత్తర్‌, బెడ్‌షీట్లు, టీవీలు, బురఖా, ఖర్జూర్‌, ఉద్దాన్‌, షేవింగ్‌ కిట్‌, పాదరక్షలు ఇలా అతి చిన్న వస్తువులనూ ఇండోనేషియా, ఇటలీ తదితర దేశాల్లో తయారైనవే వినియోగిస్తుంటారు. బార్కాస్‌లోని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు లుంగీలు వాడతారు. వీటిధరలు రూ.1,500 నుంచి రూ.25వేల వరకు ఉంటాయి. వీటిని ఇండోనేషియా, దుబాయ్‌, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇక్కడ కొన్ని బ్రాండ్ల లుంగీలు వేలం వేస్తుంటారు. అవి రూ.30-50వేల వరకు పలుకుతాయని, వారు ధరించే లుంగీలు దాదాపు 15 ఏళ్లు చెక్కుచెదరవని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి పాదరక్షల ధర.. నాణ్యత, రంగులను బట్టి రూ.1,200 నుంచి రూ.20వేల వరకు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు