logo

పొరుగు నేతలకే పెద్దపీట

గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది.

Updated : 23 Apr 2024 05:22 IST

 ఆవేదనలో కాంగ్రెస్‌లో  సీనియర్‌ నాయకులు
ఎన్నికలపై ప్రభావం చూపుతుందేమోనని ఆందోళన

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. కొత్త, పాత నేతల మధ్య వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. ఇది ఎన్నికల్లో ఎక్కడ ప్రభావం చూపుతుందోననే ఆందోళన సీనియర్‌ నేతల నుంచి వ్యక్తమవుతోంది. నేతల మధ్య సమన్వయం తీసుకురావడానికి అగ్రనేతలు సంబంధిత నియోజకవర్గ నేతలతో చర్చిస్తున్నారు.

బలం పెంచుకోవడానికి..

రాజధాని పరిధిలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ కొంత బలహీనంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందే మొన్నటివరకు అధికార పక్షంగా ఉన్న భారాస నుంచి కీలక నేతలను చేర్చుకోవడం మొదలుపెట్టారు. సుమారు 50 మందికి పైగా నాయకులు హస్తం కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థలో 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరారు. నగరం చుట్టపక్కల ఉన్న నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల స్థానిక ప్రతినిధులు చాలామంది హస్తం గూటికి చేరారు.

అసంతృప్తి..

సుమారు 20 ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే ఉంటూ ఎన్నో కష్టనష్టాలు ఓర్చిన సీనియర్‌ నేతలను కొన్నిచోట్ల పక్కన పెట్టి భారాస నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటంతో పూర్వ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కొత్త నాయకులు చేరితే తాము ఎందుకూ కొరగాకుండా పోతామని ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఇప్పటికే కొంతమంది స్థానిక నేతలు కాంగ్రెస్‌ అగ్రనేతలకు ఫిర్యాదులు చేశారు. ఈ పరిణామంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఎక్కడ దెబ్బతగులుతుందోననే ఆందోళన కనిపిస్తోంది.

  •  ఇటీవలే పార్టీలో చేరిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ టికెట్‌ ఆశించిన పూర్వ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఖైరతాబాద్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి రెండుసార్లు పోటీ చేసిన విజయారెడ్డికి దానంకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అలాంటి ఆయనకు టికెట్‌ ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటికీ సఖ్యత లేదని చెబుతున్నారు. దీని సరిదిద్దే ప్రయత్నాలూ చేయకపోవడం గమనార్హం.
  •  కొంతమంది భారాస కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్‌లో చేరగా.. డివిజన్లలో అధికారపక్ష నేతలుగా చలామణి అవుతున్నారు. గతంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన నేతలకు ఇది మింగుడుపడటం లేదు.
  •  మొన్న జరిగిన కంటోన్మెంట్‌ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్‌ను రాత్రి రాత్రికి కాంగ్రెస్‌లో చేర్చుకొని ఉప ఎన్నికల్లో బరిలో నిలిపారు. దీంతో అక్కడ ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న నాయకులు కంగుతిన్నారు. గతంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయిన డీబీ దేవేందర్‌ ఆగ్రహంతో ఉన్నారు. శ్రీ గణేష్‌కు కాకుండా అసలైన వారికి టికెట్‌ ఇవ్వాలని కోరినా అగ్రనేతలు పట్టించుకోలేదు.
  •  గతంలో అనేక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన గజ్వేల్‌ భరత్‌ ఇక్కడి అయిదో వార్డు నుంచి కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. ఈలోగా భారాస నాయకుడు తేలుకుంట సతీష్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకుని అదే వార్డు నుంచి పోటీ చేస్తారని సీనియర్‌ నేతలు ప్రకటించారు. దీంతో భరత్‌ ఆగ్రహంతో ఉన్నారు. ఇలా అనేకమంది నేతలు తమ అవకాశాలను ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు తన్నుకుపోతున్నారంటూ ఆవేదనతో ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని