logo

నగరవాసి.. నీటికి అల్లాడి

వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు.

Updated : 28 Apr 2024 03:58 IST

వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. మరోవైపు ‘తక్కువ ధరకే శుద్ధజలం’ లక్ష్యం నీరుగారిపోయింది. ప్రధాన రైల్వే స్టేషన్లను పట్టించుకుంటున్న ద.మ.రైల్వే ఎంఎంటీఎస్‌ స్టేషన్లను పట్టించుకోవడం లేదు.

ఎండిన బోర్లు.. నిండని సంపులు

నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రమవుతోంది. అరంగుళం నల్లా కనెక్షన్‌ ఉన్న ఇంటికి నెలకు 15 కిలోలీటర్ల నీటిని అందిస్తున్నట్లు జలమండలి చెబుతోంది. కానీ 9-10 కి.లీ.కు మించి సరఫరా అయ్యే పరిస్థితి లేదు. అంటే 10 ఫ్లాట్లు ఉన్న అపార్టుమెంట్‌కు 15 వేల కి.లీ. వరకు అందించాలి. వేసవి కావడంతో ప్రస్తుతం 7-8 వేల కి.లీ. సరఫరా చేస్తున్నారు. నెల నుంచి భూగర్భ జలాలు అడుగంటడంతో పూర్తిగా జలమండలి పైనే ఆధారపడుతున్నారు.  నీటి కొరత వల్ల అరగంటకు మించి సరఫరా చేయడం లేదు. నార్సింగి, మణికొండ, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, కాప్రా తదితర ప్రాంతాల్లో ట్యాంకర్లకు భారీగా డిమాండ్‌ ఉంటోంది. గతంలో అపార్టుమెంట్‌లో సంపులు నిండిపోయి నల్లా బంద్‌ చేసుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు సంపులు సగమైనా నిండడం లేదని స్థానికులు వాపోతున్నారు.

ట్రాకింగ్‌ ఎక్కడ..?

గ్రేటర్‌ వ్యాప్తంగా నీటి ట్యాంకర్లకు డిమాండ్‌ పెరగడంతో జలమండలి అదనపు ట్యాంకర్లు, ఫిల్లింగ్‌ కేంద్రాలు, ఫిల్లింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల నుంచి అదనపు నీటిని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. పలు ప్రాంతాల్లో ట్యాంకర్‌ బుక్‌ చేసిన 2-3 రోజులైనా సరఫరా కావడం లేదు. ఈ సమయాన్ని తగ్గిస్తామని అధికారులు చెబుతున్నా మార్పు కనిపించడం లేదు. బుకింగ్‌ నుంచి సరఫరా వరకు సరైన ట్రాకింగ్‌ ఉండటం లేదని వినియోగదారులు చెబుతున్నారు. కొందరు ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు కాలనీల మధ్య బోర్లు తవ్వి నీటిని తోడి అమ్ముకుంటున్నారు. దీంతో చుట్టుపక్కల ఇళ్లల్లోని బోర్లు ఎండిపోతున్నాయి.

నీరివ్వని వాటర్‌ ఏటీఎంలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నగరవాసులకు తక్కువ ధరకే శుద్ధ జలం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సుమారు వంద వాటర్‌ ఏటీఎంలు అలంకారప్రాయంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో జీహెచ్‌ఎంసీ ఆరేళ్ల క్రితం వీటిని ఎల్బీనగర్‌, అమీర్‌పేట్‌, పాతబస్తీ, ఖైరతాబాద్‌, మలక్‌పేట, హైటెక్‌సిటీ, మియాపూర్‌, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌ తదితర రద్దీ ప్రాంతాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రంథాలయాల సమీపంలో ఏర్పాటు చేసింది. నిర్వహణకు సిబ్బందిని నియమించింది. ఒక్కోదానికి రూ.6.50 లక్షలు వెచ్చించి నీటి శుద్ధి పరికరాలను కొనుగోలు చేసింది. రూపాయికి అర లీటరు, రూ.5కు 10 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన నీటిని అందించేవారు. ఇవి ప్రారంభంలో బాగానే పనిచేసినా అనంతరం నిర్వహణ కొరవడటంతో మూలకు చేరాయి. శీతాకాలం, వర్షాకాలంలో వీటి వినియోగం తక్కువగా ఉండటంతో తాళాలు వేసి వదిలేయడంతో ఇప్పుడు మొరాయిస్తున్నాయి. మలక్‌పేట పరిధి ఆనందనగర్‌ కాలనీతోపాటు మరికొన్ని ప్రాంతాల్లోని వాటర్‌ ఏటీఎంలలో రూ.5 నాణెం వేస్తే విద్యుత్తు షాక్‌ కొడుతోందని వినియోగదారులు చెబుతున్నారు.  
ప్రైవేటు ప్లాంట్ల దందా.. నగరంలో నీటి కొరత, జీహెచ్‌ఎంసీ వాటర్‌ ఏటీఎంలు పనిచేయకపోవడం.. ప్రైవేటు శుద్ధజల కేంద్రాల నిర్వాహకులకు వరంగా మారింది. గతంలో 20 లీటర్ల నీటిని రూ.10కి విక్రయించగా ప్రస్తుతం రూ.20-30కి అమ్ముతున్నారు. వాటి పరిమితికి మించి నీటిని సరఫరా చేస్తున్నారు. బోరు నీటిని అప్పటికప్పుడే శుద్ధిచేసి విక్రయిస్తున్నారు. సాధారణంగా 12 పర్యాయాలు శుద్ధి ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. నీటి నాణ్యత నిర్ధారించేందుకు మైక్రో బయలాజికల్‌ ల్యాబ్‌ ఉండాలి. ఇవేవీ కానరావడం లేదు.

ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు దక్కని తాగునీటి సౌకర్యం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్‌లోనే ఎండలు మండిపోతున్నాయి. ప్రయాణాలు సాగించేవారి అవస్థలు చెప్పనలవి కాదు. బస్సుల్లో వెళ్లే వారు తాగునీరు ఎక్కడుంటే అక్కడ ఆగి దాహార్తి తీర్చుకోవచ్చు. రైల్వే ప్రయాణికులకు అది సాధ్యం కాదు.. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ద.మ. రైల్వే పరిధిలోని 170 స్టేషన్లలో 468 వాటర్‌ వెండింగ్‌ మెషిన్లు పెట్టి చల్లటి తాగునీరు అందిస్తున్నారు. ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో ఈ  సౌకర్యం అందుబాటులోకి రాలేదు. మొత్తమ్మీద కరోనా తర్వాత ఇప్పటికి ఐఆర్‌సీటీసీ రైల్వే స్టేషన్లలో వాటర్‌ వెండింగ్‌ మెషిన్లను (చల్లటి నీళ్లు అందించే యంత్రాలు) ఏర్పాటు చేసింది. ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లలో తాగునీరు కాదు కదా మండుటెండలో ముఖం కడుక్కుందామన్నా కుదరని పరిస్థితి. చుట్టుపక్కల స్థానికులు నీరు పట్టుకెళుతున్నారని కుళాయిలను బంద్‌ చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు ఆయువుపట్టు లాంటి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రోజూ 240 వరకూ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దాదాపు 1.80 లక్షల మంది ఈ స్టేషన్‌ ద్వారా ప్రయాణిస్తారు. ఇంతమంది నీటి అవసరాలు తక్కువ ఖర్చుతో తీర్చేందుకు ఇక్కడ సైతం వాటర్‌ వెండింగ్‌ మిషన్లను ఏర్పాటు చేశారు. రైల్‌ నీరంటూ.. లీటర్‌ సీసాను రైల్వే స్టేషన్లలో, రైళ్లలో రూ.15కు అమ్ముతున్నారు. సామాన్యులు అవి కొనలేరు. అలాంటి వారు ఒక్కసారి ఐదు లీటర్ల బాటిల్‌ను నింపేసుకుంటే గమ్యం చేరేవరకూ తాగునీటికి ఇబ్బంది ఉండదు. ఇందుకోసం ద.మ.రైల్వే పరిధిలో కొత్త మెషిన్లను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని