logo

ఆలిన్‌లో అదుపులోకి అగ్నికీలలు

ఆలిన్‌ ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు చల్లారక పోవడంతో భారీ నష్టం వాటిల్లింది. 24 గంటలు దాటినా మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో అటుగా ఉండే పరిశ్రమలు, కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Updated : 28 Apr 2024 03:58 IST

24 గంటలు దాటాక చల్లారిన మంటల్యు  
షెడ్డుతో పాటు బూడిదైన పరిశ్రమ

శనివారం మధ్యాహ్నం వరకు ఎగసిపడుతున్న మంటలు

నందిగామ న్యూస్‌టుడే: ఆలిన్‌ ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు చల్లారక పోవడంతో భారీ నష్టం వాటిల్లింది. 24 గంటలు దాటినా మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో అటుగా ఉండే పరిశ్రమలు, కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 7 అగ్నిమాపక యంత్రాలతో అధికారులు, సిబ్బంది మంటలను అదుపు చేసినా రసాయనాల కారణంగా మంటలు పలు దఫాలుగా ఉన్నట్టుండి ఎగిసిపడ్డాయి. పలుమార్లు భారీ పేలుళ్ల శబ్దం రావడంతో చుట్టు పక్కల కాలనీవాసులు ఉలిక్కి పడ్డారు. శుక్రవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో షెడ్డులో మంటలు వ్యాపించగా రాత్రి పదిగంటల వరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. గంట తర్వాత షెడ్డు అనుకుని ఉన్న భవనానికి మంటలు వ్యాపించడంతో తెల్లవారుజామువరకు అదుపుచేశారు. రసాయనాల కారణంగా తిరిగి శనివారం ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి భారీ పేలుళ్ల శబ్దాలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది సైతం ఒకానొక సమయంలో వెనుకంజ వేశారు. సాయంత్రం 5 గంటలకు పరిశ్రమలో మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయని, అక్కడక్కడ నిప్పురవ్వలున్నాయని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. పరిశ్రమలో రసాయనాలున్నందున నిప్పురవ్వలపై నీటిని పోస్తే మళ్లీ మంటలు ఎగిసిపడే అవకాశాలున్నాయన్నారు. రెండుమూడు రోజుల్లో ఆ నిప్పురవ్వలు కూడా చల్లారిపోతాయని చెప్పారు.

ముందుజాగ్రత్తగా..: మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిశ్రమకు కొద్ది దూరంలో ఉన్న ఎల్లమ్మకాలనీ వాసులను ముందుజాగ్రత్తగా శనివారం ఉదయమే పోలీసులు ఇళ్లు ఖాళీ చేయించారు. అలాగే ఆలిన్‌ పరిశ్రమకు సమీపంలోనే ఉన్న జీజీ ట్యూబ్‌లు, ఫిట్టి ల్యామినేషన్‌ కంపెనీలను కూడా మూసివేయించారు. పరిశ్రమ వైపు రాకపోకలు సాగించకుండా రహదారిపై ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.

సాహస బాలుడికి సన్మానం.. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు కార్మికులను కాపాడటంలో సిబ్బందికి సహకరించిన సాహస బాలుడు సాయిచరణ్‌ను తహసీల్దారు రాజేశ్వర్‌, ఉప తహసీల్దారు కృష్ణయ్య, ఆర్‌ఐలు శ్రీనివాస్‌, రోజా తదితరులు శనివారం  సన్మానించారు. చిన్నతనంలోనే అతడు చేసిన ధైర్యసాహసాలను అభినందించారు.

ఉపాధి కోల్పోయిన కార్మికులు.. పరిశ్రమలో అగ్ని ప్రమాదం కారణంగా  సుమారు 400 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కాగా కింది అంతస్తులో 70 వరకు ఆల్కహాల్‌కు సంబంధించిన డ్రమ్ములున్నాయని, అక్కడి వరకు మంటలు వెళ్లలేదని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్‌చారికి  ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని