logo

సాధించేందుకు పట్టు.. తెలిసిందే లోగుట్టు

మొన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు భారాసలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజకీయంగా సన్నిహితంగా మెలిగినవారే. ఇప్పుడు అదే నేతలు కాంగ్రెస్‌లో చేరి రాజధాని పరిధిలోని మూడు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచారు.

Updated : 28 Apr 2024 05:37 IST

గతంలో ఉన్న పార్టీని బలహీనం చేసే వ్యూహం
కాంగ్రెస్‌ అభ్యర్థులు ముగ్గురూ భారాస నేతలే  

మొన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు భారాసలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజకీయంగా సన్నిహితంగా మెలిగినవారే. ఇప్పుడు అదే నేతలు కాంగ్రెస్‌లో చేరి రాజధాని పరిధిలోని మూడు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచారు. గతంలో భారాసలో లోగుట్లు అన్నీ వారికి తెలియడంతో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆ పార్టీని బలహీనం చేసి పట్టు సాధించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయి గులాబీ నేతలంతా వారికి సన్నిహితులే కావడంతో కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో సహకరించేలా అంతర్గత ఒప్పందం చేసుకుంటున్నారు.

చక్రం తిప్పుతున్న మహేందర్‌రెడ్డి

మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి సునీతా మహేందర్‌ రెడ్డి భారాసలో కీలకంగా వ్యవహరించారు. అతని భార్య సునీతకు మూడుసార్లు జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిని ఇచ్చారు. ఇప్పుడామే మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్‌ దక్కించుకున్నారు. ఎమ్మెల్సీ గా ఉన్న మహేందర్‌రెడ్డి సాంకేతికంగా పార్టీలో చేరకపోయినా తన భార్య విజయానికి ప్రచారం చేస్తున్నారు. కంటోన్మెంట్‌ భాజపా నేత శ్రీ గణేష్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి అక్కడి ఉప ఎన్నికలో ఆయనకు టికెట్‌ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. సుమారు 50 మంది మండల స్థాయి గులాబీ నేతలను హస్తం గూటికి చేర్చారు.

అనుభవాన్ని రంగరిస్తున్న రంజిత్‌రెడ్డి

చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీగా రంజిత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.  ఈ ఎన్నికల్లోనూ భారాస ఆయనకే టికెట్‌ ఇచ్చినా.. సీఎం రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ అగ్రనేతలు రంగప్రవేశం చేయడంతో రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. అదే స్థానం నుంచి టికెట్‌ దక్కించుకొని పోటీ చేస్తున్నారు. ఈ పరిణామంతో భారాస కంగుతింది. తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చాలామంది నేతలతో ఇప్పటికీ  సంబంధాలు వదులుకోలేదు. మండల స్థాయి నాయకులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో నెల రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు.  కొంతమంది గులాబీ పార్టీలోనే ఉన్నా.. ఈ ఎన్నికల్లో ఆయన కోసం పని చేస్తామని ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.

చేరికలపై దానం దృష్టి

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌కు సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని తన పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల బలమైన నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఖైరతాబాద్‌పై ఆయన పట్టుంది. దీంతో మిగతా ప్రాంతాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా బల్దియా కార్పొరేటర్లకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే కొందరు చేరిపోగా.. మరికొందరితో మాట్లాడుతున్నారు. పలువురు కార్పొరేటర్లతో అంతర్గతంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పార్టీ మారకపోయినా కాంగ్రెస్‌కు ఓట్లు వేయించేలా అవగాహనకు వస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని