logo

ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా

నగరంలో విద్యుత్తు డిమాండ్‌ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్‌ జోన్‌ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్‌ డిమాండ్‌ చేరువైంది.

Published : 29 Apr 2024 04:52 IST

మేడ్చల్‌ జోన్‌లోనే మొత్తం విద్యుత్తులో పావువంతు వినియోగం
20 శాతం పెరిగిన డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో విద్యుత్తు డిమాండ్‌ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్‌ జోన్‌ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్‌ డిమాండ్‌ చేరువైంది. ఎండలకు ఓవర్‌లోడ్‌ సమస్య ఎదురయ్యే అవకాశం ఉండటంతో పలు 33/11కేవీ విద్యుత్తు ఉపకేంద్రాల్లో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. మేడ్చల్‌ జోన్‌ పరిధిలోని హబ్సిగూడ సర్కిల్‌లో గృహ, వాణిజ్య వినియోగం ఉంటే.. మేడ్చల్‌ పరిధిలో వీటితో పాటూ అదనంగా పరిశ్రమల వాడకం ఉంది. గతేడాది వేసవితో పోలిస్తే లోడ్‌ డిమాండ్‌ 20 శాతం పెరిగిందని ఇంజినీర్లు చెబుతున్నారు. మేడ్చల్‌ సర్కిల్‌లో ఈ నెలలో గరిష్ఠ డిమాండ్‌ 544 మెగావాట్ల వరకు నమోదైంది. హబ్సిగూడ సర్కిల్‌లో 402 మెగావాట్లు రికార్డైంది. వేర్వేరు తేదీల్లోనే అత్యధిక డిమాండ్‌ ఇది. ఈ నెల 20న రెండు సర్కిళ్లలో కలిపి గరిష్ఠంగా 953 మెగావాట్లు డిమాండ్‌ రాగా.. మేలో వెయ్యి దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

పవర్‌ పెంపు...

పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను తట్టుకునేందుకు ఉపకేంద్రాల సామర్థ్యాలు చాలవు. దీంతో కెపాసిటీ పెంచుతున్నారు. కొంపల్లి సుభాష్‌నగర్‌ ఉపకేంద్రంలో 8 ఎంవీఏ స్థానంలో అధిక సామర్థ్యం కలిగిన 12.5 ఏంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (పీటీఆర్‌)ను అమర్చారు. కూకట్‌పల్లి-సోమశిలలోనూ ఇదేవిధంగా అప్‌గ్రేడ్‌ చేశారు. కాప్రా ఎన్‌ఎన్‌ కాలనీలో పీటీఆర్‌ సామర్థ్యాన్ని పెంచారు. డిమాండ్‌ పెరగడంతో సరఫరాలో సమస్యలు రాకుండా సీఎండీ ఆదేశాలతో చర్యలు చేపడుతున్నారు. కరెంట్‌ పోతే..విధుల్లో అలక్ష్యంగా ఉంటే ఏఈ నుంచి డీఈ వరకు సస్పెండ్‌ చేస్తున్నారు.

ఆదాయమూ మెండే..  

కరెంట్‌ వినియోగం పెరగడంతో ఆదాయమూ పెరిగింది. ఏప్రిల్‌లో ఎల్‌టీ, హెచ్‌టీ కలిపి బిల్లింగ్‌ రూ.450 కోట్లు దాటింది. ఇక్కడ ఎల్‌టీ, హెచ్‌టీ బిల్లింగ్‌ దాదాపుగా సమానంగా ఉంది. మొత్తం బిల్లింగ్‌లో శనివారం నాటికే రూ.405 కోట్లపైగా వసూలైంది. నెలాఖరుకు 100 శాతం వసూలవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని