logo

4 స్థానాలు.. 140 మంది అభ్యర్థులు

రాజధాని పరిధిలో పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలతోపాటు గుర్తింపు పొందిన ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున పోటీలో నిలిచారు.

Published : 30 Apr 2024 03:09 IST

సికింద్రాబాద్‌లో అత్యధికం మల్కాజిగిరిలో అత్యల్పం

వివరాలు వెల్లడిస్తున్న చేవెళ్ల ఆర్వో  కె.శశాంక, సాధారణ పరిశీలకులు రాజేంద్రకుమార్‌ కటారియా

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని పరిధిలో పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలతోపాటు గుర్తింపు పొందిన ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియగా.. నగరంలోని నాలుగు స్థానాల్లో మొత్తం 140 మంది బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అందులో గరిష్ఠంగా సికింద్రాబాద్‌ నుంచి 45 మంది, మల్కాజిగిరిలో అత్యల్పంగా 22 మంది పోటీపడనున్నారు. చేవెళ్లలో 43 మంది, హైదరాబాద్‌ ఎంపీ స్థానానికి 30 మంది పోటీపడుతున్నారు. సికింద్రాబాద్‌ స్థానం నుంచి ఒక్కరే నామపత్రాన్ని ఉపసంహరించుకున్నారని, హైదరాబాద్‌లో 8 మంది, చేవెళ్లలో ముగ్గురు, మల్కాజిగిరిలో 15 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. ఇందులో మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ సతీమణి జమున, చేవెళ్ల బీఎస్‌పీ అభ్యర్థి గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

రెండుచోట్ల రెండు... మిగిలిన చోట్ల మూడు..

లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు అభ్యర్థి పేరును చూసుకోవాలంటే కనీసం అరనిముషమైనా కేటాయించాల్సిందే. ఎందుకంటే అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో రెండు, మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గం పరిధిలో 20మందికిపైగా అభ్యర్థులుండటంతో ఈవీఎంలో గరిష్ఠంగా 15మంది అభ్యర్థులు, నోటాకు ఓటు వేసేందు వీలుంటుంది. మల్కాజిగిరి నుంచి 22 మంది, హైదరాబాద్‌ ఎంపీ స్థానం నుంచి 30 అభ్యర్థులు  బరిలో ఉండడంతో రెండు చొప్పున ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నారు. చేవెళ్ల ఎంపీ స్థానంలో 43మంది,  సికింద్రాబాద్‌ నుంచి 45 మంది పోటీలో ఉండడంతో మూడు చొప్పున ఈవీఎంలు ఉంటాయి.


కంటోన్మెంట్‌లో 15..

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు సంబంధించి 15 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. సోమవారం ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్వో మధుకర్‌నాయక్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ రెబెల్‌గా నామపత్రాలు దాఖలు చేసిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఉపసంహరించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని