logo

ఓటరు నమోదుకు నేడే చివరి అవకాశం

ఓటరు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది.

Updated : 31 Oct 2023 13:56 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: ఓటరు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. నవంబరు 30న జరిగే శాసనసభ ఎన్నికల పోలింగ్‌ రోజున కొత్త ఓటర్లు ఓటు వినియోగించుకోవచ్చు. ఈనెల అయిదో తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయగా, కొత్తవారికి మాత్రం ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగుస్తుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి ప్రభుత్వ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.

మరో వైపు ప్రతి జిల్లా పరిధిలో ఓటరు నమోదు, ఓటు వినియోగం వంటి అంశాలపై యంత్రాంగం ప్రచారం చేపడుతోంది. చైతన్యం కల్పిస్తున్నారు. ఓటు హక్కు ఉండి పేరు నమోదు చేయించుకొని వారిని సర్వే ద్వారా గుర్తించి తగిన సమాచారం ఇస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా బీఎల్వోలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. వీలైనంత ఎక్కువ మంది నమోదు చేసుకొనే ఏర్పాట్లు చేశారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, కళాశాలల్లో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈక్రమంలో చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు..

కొత్త ఓటరు నమోదు కోసం ఎన్నికల సంఘం సేవలను సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ‌ceotelangana.nic.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్హత, వయసు, నిర్ధారణ పత్రం, ఆధార్‌ కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత బీఎల్వోలు విచారణ జరిపి ఓటు హక్కు ఆమోదం తెలుపుతున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

ఈ నెల 5న విడుదలైన ఓటరు తుది జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 3,24,734 కొత్త ఓటర్లు పెరిగారు. గడువు తర్వాత ఇంకా పెరగనున్నారు. 2018లో జిల్లాలో మొత్తం 27,87,549 మంది ఓటర్లు ఉన్నారు. 2023లో ఓటర్ల సంఖ్య 31,12,283కి చేరుకుంది. 11.65 శాతం పెరిగింది. ఈ శాతం నేటి ముగింపుతో మరింత పెరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని