logo

Karimnagar: గంజాయి చాక్లెట్లు.. సిగరెట్లు.. నూనె!

ఏళ్ల తరబడిగా గంజాయిని నిర్మూలిస్తామని అటు పోలీసులు ఇటు ఆబ్కారీ అధికారులు ప్రకటిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

Updated : 26 Jan 2024 08:41 IST

కొత్త రూపాల్లో మత్తుకు బానిసలను చేస్తున్న వ్యాపారులు
అరెస్టులు చేస్తున్నా దందాకు పడని అడ్డుకట్ట
 

గంజాయి పొడి

ఈనాడు, కరీంనగర్‌ : ఏళ్ల తరబడిగా గంజాయిని నిర్మూలిస్తామని అటు పోలీసులు ఇటు ఆబ్కారీ అధికారులు ప్రకటిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అక్కడక్కడా విశ్వసనీయ సమాచారం ఆధారంగా విక్రేతల్ని పట్టుకుంటున్నారు తప్పితే ఈ దందా వెనకున్న బడా వ్యాపారులపై దృష్టి పెట్టడం లేదు. ఉమ్మడి జిల్లాకు ఇవి ఏ ప్రాంతం నుంచి సరఫరా అవుతున్నాయి.? రవాణాకు సహకరిస్తున్నవారెవరు గుర్తిస్తే దందాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసే అవకాశముంటుంది. కానీ ఆ వైపుగా అధికారులు దృష్టి సారించక దొరికిన వారిని రిమాండ్‌ చేసి వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అసలు మూలాలకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు పెరిగేతేనే అమాయక యువత, ప్రజలు ఈ మత్తు బారిన పడకుండా ఉండే అవకాశముంది. హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో ఉమ్మడి జిల్లాకు గంజాయి సరఫరా అవుతోంది. పెద్దమొత్తంలో కొనుగోలు చేసి తీసుకొచ్చే వారిని గుర్తించకుండా.. చిన్న వ్యాపారులే లక్ష్యంగా తనిఖీలు జరుగుతుండటంతో దందాకు శాశ్వతంగా అడ్డుకట్ట పడటంలేదు.

  • ఈ నెల 24న పెద్దపల్లి బండారికుంట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు యువతకు విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలో ఓ వెల్డింగ్‌ దుకాణంలో పనిచేస్తున్న ఈ వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించాలని ఇలాంటి చాక్లెట్లను ఇతరులకు విక్రయిస్తున్నాడు. ఇటీవల సిరిసిల్ల జిల్లాలో రహస్యంగా వీటిని విక్రయిస్తున్న సందర్భాలు ఊపందుకుంటున్నాయి.
  •  కొన్ని నెలల కిందట కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో రహస్యంగా గంజాయి పొడిని నింపిన సిగరెట్లను వినియోగిస్తున్న తీరు సంచలనాన్ని రేకెత్తించింది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన వ్యక్తులిలా వీటిని నగరంలో విక్రయిస్తున్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల ధర్మపురి ప్రాంతంలో గతంలో ఈ తరహా చర్యల్ని పోలీసులు అడ్డుకున్నారు.

నూనెను తయారు చేశారిలా..

ఎన్నో అనర్థాలు..!

  •  గ్రామీణ ప్రాంతాల్లోని యువత కూడా గంజాయికి అలవాటు పడుతున్నారంటే ఉమ్మడి జిల్లాలో దీని వ్యాప్తి ఎలా ఉందనేది అర్థమవుతోంది. దీన్ని సేవించి విపరీత వేగంగా వెళ్తూ రోడ్డు ప్రమాదాల్లో యువత చనిపోయిన సందర్భాలున్నాయి.
  •  హుక్కా రూపంలోనూ కరీంనగర్‌ చుట్టుపక్కల దీన్ని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో పట్టుబడుతున్న వారిలో కళాశాల విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించే విషయం.
  •  కొత్తగా గంజాయి నుంచి ఆయిల్‌ను కూడా తయారు చేసి విక్రయిస్తున్నారు. కరీంనగర్‌లో అరకు నుంచి తెచ్చి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆయిల్‌ కొద్ది మొత్తం తీసుకున్నా 8-10 గంటల వరకు మత్తులోనే తూగుతారని పోలీసు అధికారులు చెబుతున్నారు.
  •  ఇతర ప్రాంతాల నుంచి లీటర్ల కొద్దీ ఈ నూనెను రూ.35-50 వేలకు తెచ్చి ఇక్కడ చిన్న సీసాల్లో పోసి అమ్ముతున్నారు. ఒక్కసారి తెచ్చిన సరకుతో వ్యాపారులకు మూడు నాలుగింతల ఆదాయం సమకూరుతుండటంతో ఈ తరహా నేరాలు చేస్తున్నారు.
  •  అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వ్యసనంతో మెదడుపై విపరీత ప్రభావం పడుతున్నా.. తాగడాన్ని మానడం లేదు.
  •  గతేడాదిలో 160కి పైగా కేసులయ్యాయి. ఇందుకుగానూ దాదాపుగా 300 మందిని అరెస్ట్‌ చేశారు. ప్రతి ఏడాది ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సగటున రెండు రోజులకోమారు ఎక్కడో ఒకచోట గంజాయిని విక్రయించేవారు పట్టుబడుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని