logo

సామాజిక మాధ్యమాల్లో.. జర జాగ్రత్త!

చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. ఇంకేముంది ఇష్టం వచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతామని అనుకుంటున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడక తప్పదు.

Updated : 15 Apr 2024 06:44 IST

హద్దు మీరితే ఊచలు లెక్క పెట్టాల్సిందే

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. ఇంకేముంది ఇష్టం వచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతామని అనుకుంటున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడక తప్పదు. మత, రాజకీయ, వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టులు పెట్టినా పోలీసు కేసులను ఎదుర్కోవాల్సిందే. జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే.

సాధారణ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సామాజిక మాధ్యమ పోస్టింగ్‌లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చే లీకులను పోస్టు చేస్తే, ఆ తర్వాత లీకులు ఇచ్చిన వారే అది తప్పుడు పోస్టంటూ ఫిర్యాదులు చేసే అవకాశముంది. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీల నాయకులు, అభ్యర్థులు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఫిర్యాదులు చేసుకోగా, కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లోని పోస్టింగులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేయించేలా వివిధ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఆయా పార్టీల్లో సామాజిక మాధ్యమాలకు సంబంధించి ప్రత్యేక విభాగాలున్నాయి.

అడ్మిన్లదే పూర్తి బాధ్యత

  • సామాజిక మాధ్యమ గ్రూపుల్లో, ముఖ్యంగా వాట్సాప్‌లో అభ్యంతరకర, విద్వేషాలను రెచ్చగొట్టేలా గ్రూఫులోని సభ్యులెవరు పోస్టులు పెట్టినా అడ్మిన్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.
  • అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని గ్రూపు నుంచి తొలగించడంతో పాటు సదరు పోస్టును సైతం వెంటనే తొలగించాలి.
  • గతంలో కేవలం పోస్టు చేసిన వారు మాత్రమే దాన్ని తొలగించే అవకాశముండగా ప్రస్తుతం గ్రూపులోని ఏ సభ్యుడు పెట్టిన పోస్టునయినా అడ్మిన్‌ తొలగించే వీలుంది.
  • గ్రూప్‌లో కొత్త సభ్యులను చేర్చుకునే ముందు వారి అనుమతి తీసుకోవడంతో పాటు తప్పుడు పోస్టులు పెట్టిన వారిని తొలగించి పోలీసులకు సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా అడ్మిన్‌దే.
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యే తప్పుడు పోస్టులపై, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసే అవకాశముంది.
  • ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో ప్రత్యర్థులను అవమానపరిచేలా, తమ అభ్యర్థి గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టులు పెట్టే అవకాశముంది.
  • ప్రత్యర్థులను కించపరిచే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, ఫొటోలు మార్చి, వాయిస్‌ మెసేజ్‌లు వాస్తవ విరుద్ధంగా పోస్టులు పెట్టినా, వాటిని షేర్‌ చేసినా, వాటికి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేసినా చట్టరీత్యా శిక్షలు తప్పవు.
  • తమ అనుమతి లేకుండా గ్రూపులో చేర్చుకునే అవకాశం లేకుండా వాట్సాప్‌లో ప్రత్యేక ఆప్షన్‌ను చరవాణి వినియోగదారులు ఎంచుకోవడం ఉత్తమం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని