logo

విస్తరించని జాతీయ మార్కెట్‌ వ్యవస్థ

రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్‌(ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌)ను 2016 ఖరీఫ్‌నకు ముందు ప్రవేశపెట్టింది.

Updated : 28 Apr 2024 05:45 IST

జగిత్యాల మార్కెట్‌లో దినుసులు

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు: రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్‌(ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌)ను 2016 ఖరీఫ్‌నకు ముందు ప్రవేశపెట్టింది. దేశంలోని 615 మార్కెట్లను ఈ-నామ్‌ పరిధిలో చేర్చగా యార్డుల్లో కంప్యూటర్లు తదితర ఆన్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఈనామ్‌ యార్డులను జాతీయ సర్వర్‌తో అనుసంధానించకపోవటం, కొనుగోళ్లు ఇతర మార్కెట్లకు విస్తరించనందున అన్నదాతలు కష్టించి పండించిన పంటలను స్థానిక యార్డుల వ్యాపారులే కొనుగోలు చేయడంతో ధరల్లో పెరుగుదల ఉండటంలేదు. గతంలో బీటులో వేలం ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులు ప్రస్తుతం కంప్యూటర్ల ద్వారా ధరలను కోట్‌చేసి కొంటున్నారు. పంట ఉత్పత్తుల ధరల్లో ఏమాత్రం పెరుగుదల నమోదులేక కర్షకులకు గిట్టుబాటు గగనంగా మారుతోంది.

  •  ఈ-నామ్‌ మార్కెట్ల పరిధిలో గుర్తింపు పొందిన వ్యాపారులు దేశంలో ఎక్కడినుంచైనా సరకులు కొనవచ్చు. స్థానిక బీటునుంచి సరకులు వ్యాపారి ప్రాంతానికి తరలించనుండగా మార్కెట్‌ కార్యదర్శి ద్వారా రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరుపుతారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త వ్యాపారులు పోటీలో ఉంటే కనీసం 10 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దేశవ్యాప్త వ్యాపారులు పోటీపడేలా అన్నియార్డులను అనుసంధానించాలి.
  •  ఏకీకృత మార్కెట్‌ను విస్తరిస్తే దిల్లీ, నాగ్‌పూర్‌, సాంఘ్లీ, నిజామాబాద్‌, ఈరోడ్‌ తదితర ప్రాంతాల వ్యాపారులు ఆన్‌లైన్‌ ద్వారానే స్థానిక బీటు నుంచి పసుపు, మామిడి తదితర ఉత్పత్తులను కొనవచ్చు. రైతులు దూరప్రాంతం వెళ్లాల్సిన భారం తప్పుతుంది. అన్ని ఆన్‌లైన్‌ మార్కెట్లను జాతీయ సర్వర్‌తో అనుసంధానిస్తే జీరో క్రయవిక్రయాలు అరికట్టబడి ప్రభుత్వానికి ఆదాయం సమకూరటం.. సరకుల క్రయవిక్రయాలు ఆన్‌లైన్‌లో ఉంటాయి కాబట్టి అక్రమ నిల్వలు అరికట్టబడి ధరలు అదుపులో ఉంటాయి.
  •  జగిత్యాల, మెట్పల్లి, గొల్లపల్లి యార్డులు ఈనామ్‌ పరిధిలో ఉండగా జాతీయ సర్వర్‌తో అనుసంధానించాలి. పెద్ద యార్డుల్లోనే క్రయవిక్రయాలు సాగుతుండగా మండల కేంద్రాల యార్డులు నామమాత్రంగా మారాయి.  
  •  మార్కెట్లను ఆన్‌లైన్‌ చేయాలి, గ్రామాల్లో జీరో క్రయవిక్రయాలను పూర్తిగా అరికట్టాలి. మార్కెట్ల కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పోస్టులను భర్తీచేయాలి. అన్ని యార్డుల్లోనూ నిరంతరం లావాదేవీలను జరపాలి. గ్రామీణ మక్కలు, ధాన్యం సేకరణ కేంద్రాల్లో సిమెంట్‌గచ్చు నిర్మించాలి.
  •  చల్‌గల్‌ మామిడి మార్కెట్‌లో నిర్మించిన పండ్లను మాగేసే కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి. చల్‌గల్‌లో శాశ్వత పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలి. గోదాముల నిర్మాణాన్ని పూర్తిచేయాలి.
  •  రైతులు వరి, జొన్న, సజ్జ, ఆవాలు, మక్క తదితర పంటల్లో విత్తనోత్పత్తి చేపడుతున్నందున ఈ పంట క్రయవిక్రయాలన్నీ మార్కెట్ల పరిధిలోకి తేవాలి. జీరో సేకరణను నియంత్రించాలి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని