logo

అనిశా వలలో ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌

గిఫ్ట్‌ డీడ్‌ కింద పట్టా మార్పిడి కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ గంగాధర ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌ సురేశ్‌బాబు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.

Published : 28 Apr 2024 05:34 IST

గిఫ్ట్‌ డీడ్‌ పట్టా కోసం రూ.10 వేలు డిమాండ్‌ 

అనిశాకు దొరికిన ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌ సురేశ్‌బాబు, ఉద్యోగి శ్రీధర్‌, చిత్రంలో తీసుకున్న నగదు

గంగాధర, న్యూస్‌టుడే: గిఫ్ట్‌ డీడ్‌ కింద పట్టా మార్పిడి కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ గంగాధర ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌ సురేశ్‌బాబు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కొక్కుల అజయ్‌కుమార్‌ తన తండ్రి రాజేశం పేరిట కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఉన్న 484 చ.గ నివాస స్థలాన్ని తన పేరుపై (గిఫ్ట్‌ డీడ్‌) పట్టా చేసుకునేందుకు గంగాధర సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సంప్రదించారు. రూ.10 వేలు ఇస్తేనే పని చేస్తామని ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌ శివారపు సురేశ్‌బాబు డిమాండు చేశారు. బాధితుడు అనిశా అధికారులకు ఆశ్రయించారు. వారి సూచనతో అజయ్‌కుమార్‌ శనివారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. అతడి నుంచి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కొత్తకొండ శ్రీధర్‌ ద్వారా రూ.10 వేలు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌ సురేశ్‌బాబు, సిబ్బంది శ్రీధర్‌పై కేసు నమోదు చేసి అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈయన గతంలో కరీంనగర్‌ కార్యాలయంలో స్టాంపుల కుంభకోణానికి పాల్పడి సస్పెండై.. తర్వాత విధుల్లో చేరారు. పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ అవినీతికి పాల్పడ్డారు. శనివారంతో ఈయన అదనపు బాధ్యతలు ముగిసిపోనుండగా చివరి రోజు అనిశాకు చిక్కడం చర్చనీయాంశమైంది. ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ పద్మ నెల రోజులుగా సెలవులో ఉండగా ఆమె స్థానంలో కరీంనగర్‌ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌బాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎవరైనా లంచం కోసం వేధిస్తే రాష్ట్రవ్యాప్తంగా అయితే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు, ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలోని వారు అనిశా డీఎస్పీ 91543 88954 నంబరులో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

అధికారి ఇంట్లో సోదాలు : కరీంనగర్‌లోని గంగాధర ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ సురేశ్‌బాబు నివాసంలో శనివారం అనిశా అధికారులు సోదాలు జరిపారు. రూ.12.30 లక్షల నగదు, 350 గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తించారు. ఇంకా ఏమైనా ఆస్తులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని