logo

రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రకటించరెందుకు?

రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ ప్రశ్నించారు.

Published : 30 Apr 2024 02:08 IST

టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌

మాట్లాడుతున్న మధుయాస్కీగౌడ్‌

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ ప్రశ్నించారు. సోమవారం ఆయన మెట్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు రిజర్వేషన్లకు వ్యతిరేకమని, 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని కూడా మారుస్తారన్నారు. స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగం ప్రకారం అప్పటి ప్రధాని నెహ్రూ రిజర్వేషన్లను ప్రవేశపెడితే అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘ్‌ వ్యతిరేకించాయన్నారు. గత బిహార్‌ ఎన్నికల్లో కూడా భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై హోంమంత్రి అమిత్‌షా కేసులు పెట్టించినంత మాత్రాన భయపడేది లేదన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలకు రుణాలు మాఫీ చేయలేని నరేంద్రమోదీ ప్రభుత్వం 21 మంది పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. నిజామాబాద్‌ ఎంపీగా కవిత ఉన్నప్పుడు ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని మూసివేసి దిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారన్నారు చక్కెర కర్మాగారాన్ని సొంత నిధులతో తెరిపిస్తానని, పసుపు బోర్డు అంటూ ప్రస్తుత ఎంపీ అర్వింద్‌ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో నిజామాబాద్‌-జగిత్యాల రహదారి విస్తరణ, రైల్వేలైన్‌ పూర్తి చేయడంతో పాటు పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేయించానన్నారు. మే 1న కోరుట్లలో జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జువ్వాడి కృష్ణారావు, జెట్టి లింగం, ఆకుల లింగారెడ్డి, అల్లూరి మహేందర్‌రెడ్డి, లింగారెడ్డి, వెంకట్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని