logo

సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు

‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు..

Published : 30 Apr 2024 02:10 IST

ఎన్నికల ప్రచారంలో భానుడే ప్రత్యర్థి

‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. సరాసరి నాలుగు పదులు దాటే ఉష్ణోగ్రత పంచుతుండటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది.. ‘ప్రచారానికి సమయం తక్కువుంది బాసూ..’ అనుకుంటూ అభ్యర్థులు, అనుయాయులు మైకులు అందుకుందామనుకున్నా ఎండదెబ్బతో ప్రజలను పోగు చేయడం సవాలై కూర్చుంది. అందుకే  నీడ పట్టున మీటింగ్‌ ఏర్పాటు చేసి టింగురంగా అనుకుంటూ తమ వాణి వినిపించేందుకు నాయకులు తాపత్రయపడుతున్నారు. ఉదయం 11 లోపే కార్యక్రమాలు ముగించేసుకొని మధ్యాహ్నం ఫంక్షన్‌ హాళ్లలోనో, ఇతరత్రా గదుల్లోనో ప్రచారం కానిచ్చేస్తున్నారు.

పగటి పూట ప్రణాళికలు

సాయం సంధ్య వేళ అటు సూరీడు మాయం కాగానే ఇటు ప్రచార హడావుడి మొదలు పెడుతున్నారు. అదే సమయంలో చీకటి మాటునే పలు చోట్ల మందుబాబులు వెలుగులోకి వస్తుండటం... కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. మద్యం ప్రభావం పగటి ఎండ కంటే ఘాటైన వేడి తగిలిస్తోందంటూ ప్రచారాన్ని ముగించేస్తున్నారు. ఎన్నికల పర్వంలో నామినేషన్లు, ఉపసంహరణల ఘట్టం ముగియడంతో ప్రచారానికి పదును పెట్టడమే తరువాయిగా నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అధినాయకులు వస్తే ఉదయం గానీ, సాయంత్రం గానీ సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీల వారు మధ్యాహ్నం స్థానిక సమస్యలను పర్యవేక్షించేందుకు సమయాన్ని కేటాయిస్తుంటే, అధికార పక్షం వారు ఇతరత్రా కార్యక్రమాలను డిజైన్‌ చేసుకుంటున్నారు.

వాతావరణ హెచ్చరికలతో దడ

చాలా మంది నాయకులు చల్లని వేళల్లో ఉపాధిహామీ కూలీల చుట్టూ ఓట్ల ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొంతమంది సూరీడు సుర్రుమంటుండగానే ‘మీ ఓటు మాకే వేయాల’ంటూ ఉదయం నడకకు వచ్చిన ఓటర్లతో ఏకరువు పెట్టుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ ఫోన్లు చేసేద్దామనీ, సామాజిక మాధ్యమాల ప్రభావాలను పసిగడదామనీ ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే మే నెలలో ఇంకెంత వేడి చూడాల్సి వస్తుందోనంటూ నాయకులు హైరానా పడుతున్నారు. నాలుగైదు రోజుల పాటు సరాసరి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదవుతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు నీడలోనూ నాయకులకు చెమటలు పట్టిస్తున్నాయి. వరాల జల్లులతో ఓటరన్నను తడిసి ముద్ద చేద్దామనుకుంటే భాస్కరుడి భగభగతో తమ ఖద్దరే తడిచిపోతోందంటూ మదనపడుతున్నారు. అకాల వర్షాలు కరుణిస్తేనే తమ ప్రచారానికి మరింత సమయం దొరుకుతుందని నాయకులు చెబుతున్నారు.. ఇక ‘కాలమేదైతేనేమి.. ఎంత ఎండ ఉంటేనేమి..? మేం మాత్రం ఏ ఎండకా గొడుగు పట్టేస్తామం’టూ జంప్‌ జిలానీలు అటూ ఇటూ దూకేస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లను చుట్టి రావడమంటే మాటలు కాదు. నియోజకవర్గ స్థాయి సమావేశాలు, కార్నర్‌ మీటింగ్‌లు, బహిరంగ సభలు... ఇలా ఓట్ల వేటలో తలమునకలైన నాయకులు ఎండలు చూసి తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా అన్ని పార్టీలకు భానుడు కూడా ఓ ప్రత్యర్థిగానే మిగిలిపోవడం ఈ ఎన్నికల ప్రత్యేకమంటూ చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.

న్యూస్‌టుడే, మేడిపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని