logo

యువత.. కురిపించాలి మమత

నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు.

Updated : 30 Apr 2024 06:12 IST

ప్రసన్నం చేసుకోవడానికి  నాయకుల ప్రచార వ్యూహాలు
3 నియోజకవర్గాల్లో 46 శాతానికి పైగా యువ ఓటర్లు
ఈనాడు, కరీంనగర్‌

నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. అదే సమయంలో యువ ఓటర్లకు గాలం వేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. గడిచిన రెండు దశాబ్దాలతో పోలిస్తే అన్ని నియోజకవర్గాల్లో ఈసారి 18-39 ఏళ్ల వయసు ఓటర్లే దాదాపు 46 శాతానికి మించి ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అవుతున్నారు. రోడ్‌షోలు, సమావేశాలకు మహిళలు వస్తున్నా.. అందులో యువత ఎక్కువగా ఉండేలా లెక్కలేసుకుంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఓట్లు మూడు పార్టీలకు కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తరువాత కొత్తగా ఓటు హక్కును పొందిన వారే దాదాపు 2 లక్షల మంది వరకు ఉండటం యువత ప్రాధాన్యతను చాటుతోంది. అందుకే అభ్యర్థులందరూ పార్టీలో చేరికలు సహా ఇతర ఏ కార్యక్రమమైనా వారికే పెద్దపీట వేస్తున్నారు. ఇక ప్రతి ఎన్నికల సమయంలో పెరిగిన ఓట్ల సంఖ్య అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. పెరిగిన ఓట్ల ప్రభావం ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా నమోదైన ఓట్లను తమవైపు మలచుకునేందుకు ప్రణాళికాయుతంగా ముందడుగేస్తున్నారు.

తమవైపు తిప్పుకొనేందుకు పాట్లు

కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో గ్రామాల వారీగా యువ ఓటర్లు ఎంత మంది ఉన్నారనే అంచనాతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. మొత్తం 5,843 పోలింగ్‌ బూత్‌ల వారీగా అంచనా రూపొందిస్తున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 18-39 ఏళ్లలోపు వయసు వారు 300-400 మంది ఉంటారు. ఈ లెక్కన ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో దాదాపు 7 లక్షల మంది యువ ఓటర్లుంటారు. వీరికి గాలం వేయడానికి నాయకులు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు, ఇతర అంశాలపై తమ పార్టీ విధానాలను వివరిస్తూ ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నారు.

ప్రభావిత వర్గంపై కన్ను

అలాగే గ్రామాల వారీగా బూత్‌ కమిటీలు, ఇతరత్రా పార్టీ కలాపాల్లో యువ భాగస్వామ్యం ఉండేలా ముఖ్య నాయకులు చొరవ చూపుతున్నారు. ఊరిలో ప్రభావితం చేయగలిగిన యువత కోరితే ఏదైనా చేస్తామనే భరోసా ఇస్తూనే ఖర్చుల నిమిత్తం వారికి ఎంతో కొంత ముట్టచెబుతున్నారు. గ్రామాల వారీగా యువజన సంఘాల సభ్యులు, ఇతర నాయకులు తమ వద్దకు వచ్చి కలిస్తే వారికి భోజనాలు సమకూర్చడంతో పాటు ఖర్చులకు డబ్బులు చేతిలో పెడుతున్నారు. మొత్తమ్మీద ‘యువతే తమ బలం.. బలగం..’ అనేలా నాయకులు వ్యూహాత్మక ధోరణిని క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని