logo

కమల దళంలో మారిన సమీకరణలు

పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ, కాంగ్రెస్‌ నేత బోర్లకుంట వెంకటేశ్‌నేత భాజపా గూటికి చేరారు.

Updated : 30 Apr 2024 06:10 IST

భాజపా గూటికి ఎంపీ వెంకటేశ్‌నేత

ఈనాడు, పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ, కాంగ్రెస్‌ నేత బోర్లకుంట వెంకటేశ్‌నేత భాజపా గూటికి చేరారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో మంథని నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ నేత చల్లా నారాయణరెడ్డి సైతం భాజపాలో చేరారు.

83 రోజులకే బయటకు..

వెంకటేశ్‌నేత 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ భారాస అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఫిబ్రవరి 6న దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే పార్టీ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఎక్కడా హాజరు కాలేదు. ఎంపీ టికెట్‌ ఇస్తారనే స్పష్టమైన హామీ మేరకే ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం. కాగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ తన కొడుకు వంశీకృష్ణకు పార్టీ టికెట్‌ దక్కేలా చక్రం తిప్పారు. మరోవైపు భాజపా అధిష్ఠానం నేతకాని సామాజికవర్గానికి చెందిన గోమాసె శ్రీనివాస్‌కు మార్చి 13న టికెట్‌ కేటాయించింది. అయినప్పటికీ వారం రోజుల కిందటి వరకు బీఫామ్‌ ఇవ్వకపోవడంతో మరోమారు వెంకటేశ్‌నేత పేరు తెరపైకి వచ్చింది. ఆయన భాజపాలో చేరి బీఫామ్‌ తీసుకుంటారన్న వార్తలు వినిపించాయి. వెంకటేశ్‌నేత పలుమార్లు కిషన్‌రెడ్డిని కలవడం ఇందుకు బలం చేకూర్చింది. అయితే అప్పటికే గోమాసె పేరు ప్రకటించడం, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కూడా ఆయనకే ఇవ్వాలని పట్టుబట్టడంతో మరోమారు వెంకటేశ్‌నేతకు నిరాశే మిగిలింది.

ఫలించిన సామాజికవర్గ మంత్రాంగం

నేతకాని సామాజికవర్గ పెద్దలు పలుమార్లు వెంకటేశ్‌ నేతను సంప్రదించారు. తమ వర్గానికి చెందిన ఓట్లు చీలకుండా భాజపాలో చేరి గోమాసెకు మద్దతు పలకాలని కోరారు. దీంతో ఎంపీ మరోసారి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. భవిష్యత్తులో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భాజపా కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు స్పష్టమై హామీ ఇవ్వడం వల్లే చేరానని ఎంపీ వెంకటేశ్‌నేత ‘ఈనాడు’తో పేర్కొన్నారు. ప్రధాని మోదీ దార్శనికత, సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, హిందూ ధర్మ రక్షణ కార్యక్రమాలతో కేంద్రంలో మూడోసారి భాజపా అధికారంలోకి రావడం  ఖాయ మన్నారు. త్వరలో పెద్దపల్లిలో జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని