logo

ప్చ్‌.. కానరాని ప్రజ్వల్‌ జాడ

లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్‌ పాస్‌పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను భారత్‌కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Published : 20 May 2024 02:47 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్‌ పాస్‌పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను భారత్‌కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ నోటీసులకు స్పందించకపోవడంతో న్యాయస్థానం ద్వారా అరెస్టు వారెంటు జారీ చేశారు. ఆయన పాస్‌పోర్టును రద్దు చేయించే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజ్వల్‌కు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను రద్దు చేశామని చెప్పారు. అతనికి నగదు పంపిస్తున్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే లుకవుట్, బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేయగా, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టారు. మరో వైపు ఒక మహిళను అపహరించిన ఆరోపణల కేసులో మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణకు జామీను లభించింది. మరో మహిళ (47)ను లైంగికంగా వేధించిన కేసులో సోమవారం వరకు ఆయనకు జామీను ఉంది. పెన్‌డ్రైవ్‌లో ఉన్న వీడియోల ఆధారంగా సాంకేతిక సాక్ష్యాలు, ఆధారాలను సేకరించేందుకు సిట్కు ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నిపుణులు సహకారాన్ని అందిస్తున్నారు. వీడియోలను ఇతరులకు పంచుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది నివాసాల నుంచి ఫోన్లు, హార్డ్‌ డిస్కులను జప్తు చేసుకున్నారు. న్యాయవాది, భాజపా నాయకుడు దేవరాజేగౌడ తన వద్ద ఉన్న అశ్లీల వీడియోలను విక్రయించుకున్నారని మాజీ ఎంపీ ఎల్‌ఆర్‌ శివరామేగౌడ ఆరోపించారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గత నెల 29న తాను దేవరాజేగౌడను భేటీ అయ్యానని అంగీకరించారు. పెన్‌డ్రైవ్‌లకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకే తాను వెళ్లానని చెప్పారు. ఇప్పుడు అతను కూడా తనపై ఆరోపణలు చేయడం బాధిస్తోందన్నారు. తాను భాజపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు బీవై విజయేంద్రకు ఆదివారం పంపించానని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు అప్రమత్తతతో లేకపోతే ఏం జరుగుతుందో ప్రజ్వల్‌ కేసు ఒక ఉదాహరణ అని అన్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడితే, అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కుమారస్వామికి అశ్లీల చిత్రాల విషయం తెలిసినా, తన కుమారుడు నిఖిల్‌ భవిష్యత్తు కోసం ఆయనే వాటిని విడుదల చేసి ఉండే అవకాశం ఉందన్నారు. జరిగిన తప్పు విషయాన్ని మాట్లాడకుండా, పెన్‌డ్రైవ్‌ల విడుదల వెనుక కుట్ర ఉందంటూ భాజపా, దళ్‌ నాయకులు పెడబొబ్బలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాధిత మహిళ వివరాలు బయటకు రాకుండా, వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మా కుటుంబాన్ని వేధించేందుకే

మా కుటుంబాన్ని వేధించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. దేవేగౌడ కుటుంబ సభ్యుల ప్రాణాల్ని బలి తీసుకునేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నిందన్నారు. శివరామేగౌడ, దేవరాజేగౌడ ఇద్దరి ఫోన్‌ కాల్‌ సంభాషణలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ప్రధాని మోదీకి చెడ్డపేరు తీసుకురావడం, తన నాయకత్వాన్ని పాడు చేయడం, దళ్‌-భాజపా పొత్తులో చీలికలు తీసుకురావడం ఇవన్నీ డీకే శివకుమార్‌ ఉద్దేశమని దుయ్యబట్టారు. దీని కోసం ఆయన రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ తన ఎక్స్‌ కార్ప్‌ ఖాతాలో వరుస ట్వీట్లు చేసి విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని