logo

చిక్క ఎవరి చేతికి చిక్కేనో!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్‌సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు.

Published : 25 Apr 2024 01:37 IST

ఆసక్తికరంగా త్రిముఖ పోరు

యలహంకలో భాజపా అభ్యర్థి డాక్టర్‌ సుధాకర్‌ ఓట్ల వేట

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్‌సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. రాజకీయ నిర్ణయాలకూ అదే కారణమవుతుంటుంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ఇది కాంగ్రెస్‌ కంచుకోట. 2019 ఎన్నికల్లో భాజపా విజయపతాక ఎగురవేసింది. మరోసారి ఇక్కడ పతాకాన్ని రెపరరెపలాడించాలని కాంగ్రెస్‌ శ్రమటోడుస్తోంది. అదే సమయంలో నియోజకవర్గంపై పట్టుసడలించరాదని భాజపా శ్రమిస్తోంది. కీలక అభ్యర్థులు రక్షా రామయ్య (కాంగ్రెస్‌), డాక్టర్‌ సుధాకర్‌ (భాజపా), మునివెంకటప్ప (సీపీఎం) మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ, మాజీ మంత్రి శివశంకర్‌రెడ్డితో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చర్చించడంతో వారంతా పార్టీ విజయానికి శ్రమిస్తున్నారు. కాంగ్రెస్‌కు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న మాజీ శాసనసభ్యులు, తాలూకా స్థాయి నాయకులను మళ్లీ ప్రచార రంగంలోకి దింపడంలో సఫలీకృతులయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కాంగ్రెస్‌ అభ్యర్థి ఇటీవల రామయ్య కోసం ప్రచారం చేయడం కలిసొచ్చింది. ఈ నియోజకవర్గ బాధ్యతలను మంత్రి కె.హెచ్‌.మునియప్పకు అప్పగించారు. భాజపా అభ్యర్థి డాక్టర్‌ సుధాకర్‌పై ‘అవినీతి’ అస్త్రాలు సంధిస్తున్నారు. కరోనా సమయంలో ఆరోగ్య శాఖ బాధ్యతలు చూసిన ఆయనే అక్రమాలకు బాధ్యుడంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వారి విమర్శలను డాక్టర్‌ సుధాకర్‌ గట్టిగానే ఎదుర్కొంటున్నారు. తనదైన శైలిలో స్థానిక నేతలను కలుపుకొని ప్రచారం సాగిస్తున్నారు. చిక్కబళ్లాపుర నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ప్రకటించారు. భాజపాలో అసమ్మతి నియంత్రించేందుకు జాతీయ స్థాయి నాయకులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర తదితరులతో పాటు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రచారం చేశారు. జనతాదళ్‌ నేతలతో సుధాకర్‌ సరిగా పనిచేయించుకోవడం లేదనే అపవాదు లేకపోలేదు. ఆ పార్టీ నేతలు ప్రచారానికి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇండియా కూటమి పార్టీ- సీపీఎం అభ్యర్థి మునివెంకటప్ప ఇక్కడ గట్టిపోటీనే ఇస్తున్నారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం ఇదే. పార్టీ కోసం అంకిత భావంతో పని చేసే కార్యకర్తలకు కొదవలేదు. కళాబృందాల సాయంతో దూసుకెళుతున్నారు. పార్టీ అగ్రనేతలు బీవీ రాఘవులు, బృందాకారత్‌ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆపార్టీ అభ్యర్థి వరలక్ష్మీకి ఇక్కడ 37 వేల ఓట్లు రావడం ప్రస్తావనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని