logo

ప్రధాని ముఖంలో ఓటమి భయం

అబద్ధాల సర్దార్‌..మౌని బాబా ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని లోక్‌సభ మాజీ సభ్యుడు వి.ఎస్‌.ఉగ్రప్ప తెలిపారు.

Published : 28 Apr 2024 04:46 IST

రాష్ట్రంలో 20 స్థానాల్లో గెలుపొందుతాం

మాట్లాడుతున్న లోక్‌సభ మాజీ సభ్యుడు వి.ఎస్‌.ఉగ్రప్ప, చిత్రంలో వెంకటేశ్‌ హెగ్డె,
డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్‌, కల్లుకంబ పంపాపతి, గాదెప్ప

బళ్లారి, న్యూస్‌టుడే: అబద్ధాల సర్దార్‌..మౌని బాబా ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని లోక్‌సభ మాజీ సభ్యుడు వి.ఎస్‌.ఉగ్రప్ప తెలిపారు. శనివారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఈ ఎన్నికలు రెండో స్వతంత్ర సంగ్రామంగా జరుగుతున్నాయని చెప్పారు. రాజ్యాంగంపై నమ్మకం లేని భాజపాతో కాంగ్రెస్‌ తలపడుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఐదు గ్యారంటీలను ప్రవేశపెట్టామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరో 25 గ్యారంటీలను కూడా ప్రవేశపెడతామన్నారు. 2018 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 165 హామీలను పూర్తి చేశాం. 2014, 2019లో లోక్‌సభ ఎన్నికల సందర్భంలో ప్రకటించిన భాజపా ఒక్క హామీ కూడా పరిష్కరించలేదన్నారు. శ్రీమంతులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. దేశంలో ఎన్‌.డి.ఎ.కి ఎదురుగాలి వీస్తోంది. మేకపోతు గాంభీర్యంతో దేశంలో 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో తమ పార్టీ 20 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతారని జోస్యం చెప్పారు.

కోర్టు చీవాట్లతో కరవు నిధులు విడుదల

కర్ణాటకపై కేంద్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. మొత్తం ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్‌. ప్రకారం కరవు నష్టం రూ.4,663 కోట్లు, మొత్తం నష్టం రూ.18,171 కోట్ల నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి గతేడాది అక్టోబరులో నివేదిక సమర్పించినా నిధులు విడుదల చేయలేదని ఉగ్రప్ప ధ్వజమెత్తారు. కోర్టుకు వెళ్లడంతో కేంద్రానికి చీవాట్లు పెట్టిన తర్వాత ప్రస్తుతం రూ.3,454 కోట్లు విడుదల చేశారన్నారు. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నాకు టికెట్‌ ఎందుకు ఇవ్వలేదో పార్టీ అధిష్ఠాన నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం బరిలో ఉన్న లోక్‌సభ అభ్యర్థి ఇ.తుకారామ్‌ గెలుపొందడం నూటికి నూరు శాతం కచ్చితమన్నారు. డీడీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్‌, కల్లకంబ పంపాపతి, పి.గాదెప్ప, లోకేష్‌కుమార్‌, వెంకటేశ్‌ హెగ్డె  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని