logo

అమాత్యులకు పరువు.. ఆయనకు రాజకీయ మలుపు

బళ్లారి లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారాం గెలుపును బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, జమీర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

Published : 28 Apr 2024 04:49 IST

బళ్లారిలో కాంగ్రెస్‌, భాజపా పోటాపోటీ

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారాం గెలుపును బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, జమీర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు తమ రాజకీయం భవిష్యత్తును నిర్దేశిస్తుందని గెలుపు కోసం శ్రమిస్తున్నారు. భాజపా అభ్యర్థి బి.శ్రీరాములుకు ఈ ఎన్నిక రాజకీయ పునర్జన్మ ఇస్తుందని భావిస్తున్నారు. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది విధానసభ నియోజక వర్గాలు ఉండగా, వాటిలో ఆరు విధానసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. గతేడాది ముందు జరిగిన విధానసభ ఎన్నికల కంటే ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావాలని ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు కె.పి.సి.సి. అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు లక్ష్యాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు వారు ఎక్కడికి వెళ్లకుండా వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. ఇ.తుకారామ్‌ తనదైన శైలితో లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. తుకారామ్‌ సతీమణి అన్నపూర్ణ, కుమారుడు, కుమార్తెలూ ఓటర్లను కలిసి అభ్యర్థిస్తున్నారు. శుక్రవారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కార్యక్రమం విజయవంతం చేశారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ విజయనగర జిల్లాలో పర్యటించనున్నారు. బళ్లారి జిల్లా బాధ్య మంత్రి బి.నాగేంద్ర ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇ.తుకారామ్‌ గెలుపొంది, పార్లమెంట్‌కు పంపితే పూర్తి కాలం మంత్రి పదవిలో కొనసాగుతారు. లేకుంటే 30 నెలలు తర్వాత ఇ.తుకారామ్‌కు అవకాశం ఇవ్వాలని మొదట్లో ఒప్పందం జరిగింది. మరో మంత్రి జమీర్‌ కూడా విజయనగర జిల్లాలో ప్రచారం చేస్తున్నారు.


 భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు

భాజపా అభ్యర్థి బి.శ్రీరాములుకు రాజకీయ అనుభవం ఉండటంతో అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి రెండు విడతల ప్రచారం పూర్తి చేశారు. నిత్యం సముదాయాల వారీగా సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. * ఇదివరకటి  భాజపా ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం ఉంది. వాల్మీకి సముదాయంలో బలమైన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు. మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి భాజపాలో చేరినా..ఆయన బళ్లారికి రావడానికి అవకాశం లేకపోవడంతో ఆయన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.

  • నేడు ప్రధాని నరేంద్ర మోదీ విజయనగర జిల్లాకు రానున్నారు. గత విధానసభ ఎన్నికల్లో ప్రధాని బళ్లారికి వచ్చినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లింలు, దళితలు, కురుబ సముదాయం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో కష్టంగా మారింది.

కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారామ్‌

అనుకూల అంశాలు: ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, నియోజకవర్గం అభివృద్ధి చేశారు. కొంత కాలం పాటు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌ కొండంత బలం ఉంది.

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీలు
  • నాలుగు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన అనుభవం. లోక్‌సభ నియోజకవర్గంలో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బలం ఉంది.
  • ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలపై వెంటనే స్పందిస్తారు.

ప్రతికూల అంశాలు: మొదటి సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

  • పార్టీలో అంతర్గత భేదాభిÅప్రాయాలు
  • ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో ఓటర్లను కలవడం కష్టంగా మారడం.

అనుకూలం అంశాలు

  • ఈ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా పని చేసిన అనుభవం ఉంది.
  • విధానసభ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ విధానసభ నియోజకవర్గం ఓటమిపాలైన సానుభూతి
  • మాజీ మంత్రి, అత్యంత ఆప్తుడు గాలి జనార్దన్‌రెడ్డి భాజపాలోకి చేరడం
  • నియోజకవర్గంలో వివిధ సముదాయం ప్రజలతో మంచి సంబంధాలు.

ప్రతికూల అంశాలు:

  • ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి.
  • లోక్‌సభ నియోజకవర్గంలో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండటం.
  • భాజపాలో నేతలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం.
  • గ్యారంటీల భయం ఎక్కువగా ఉంది.
  • గాలి జనార్దన్‌రెడ్డి భాజపాలోకి చేరినా..ఆయన జిల్లాలోకి ప్రవేశం లేకపోవడం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని