logo

ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు

ట్రాక్టర్‌ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు హులిగమ్మ భక్తులు దుర్మరణం పాలయ్యారు.

Updated : 19 May 2024 04:25 IST

నలుగురు హులిగమ్మ భక్తుల దుర్మరణం

బోల్తాపడిన ట్రాక్టర్‌ ట్రాలీ

గంగావతి, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు హులిగమ్మ భక్తులు దుర్మరణం పాలయ్యారు. కొప్పళ జిల్లా జాతీయ రహదారి నంబరు 50పై హొసనింగాపుర వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలిలో ఇద్దరు, చికిత్స కోసం తరలిస్తుండగా ఒకరు, ఆసుపత్రిలో మరొకరు చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 18 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యలబుర్గా తాలూకా కరముడికి చెందిన శివప్ప తన కుటుంబ సభ్యులు, బంధువులు 30 మందితో కలిసి ట్రాక్టర్‌లో శుక్రవారం హులిగమ్మ దర్శనానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి రాత్రి స్వగ్రామానికి వెనుదిరిగారు. హొసనింగాపుర వద్దకు ట్రాక్టర్‌ చేరుతుండగా ఓ ప్రైవేటు బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ట్రాలీ బోల్తాపడటంతో అందులో ఉన్నవారు చెల్లాచెదురుగా రహదారిపై పడిపోయారు. కరముడికి చెందిన బసవరాజ్‌ (22), తేజస్‌(21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. దురుగమ్మ (65) ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. గదగ జిల్లా తిమ్మాపురకు చెందిన కొండప్ప (60) ఆసుపత్రిలో చనిపోయారు. కొప్పళ ఎస్పీ యశోదా ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మునిరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

మృతిచెందిన తేజస్‌


‘సెల్‌ఫోన్‌’ కోసం సోదరుడి ఊపిరితీశాడు

హత్య జరిగిన చోట నిందితుడు (ఎడమ).. శివకుమార్‌ (కుడి)

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : బెంగళూరు నగర శివార్లలో దిగ్భ్రాంతికి గురిచేసిన- మంత్రాలయానికి చెందిన ప్రాణేశ్‌ (15) హత్య కేసును సర్జాపుర ఠాణా పోలీసులు ఛేదించారు. ఆ బాలుడి అన్న శివకుమార్‌ (18) ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. మంత్రాలయంలో నాయనమ్మ వద్ద ఉంటూ ప్రాణేశ్‌ చదువుకునేవాడు. అతని సోదరుడు, తల్లిదండ్రులు బెంగళూరు శివారు నెరిగా గ్రామంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికులుగా పని చేసేవారు. వేసవి సెలవులకు అమ్మానాన్నల వద్దకు ప్రాణేశ్‌ వచ్చాడు. శివకుమార్‌ చరవాణి తీసుకుని, కాలం వెళ్లదీయడం మొదలుపెట్టాడు. మొబైల్‌ డేటాను ఖాళీ చేయడం, ఎక్కువ సమయం దానితో ఆడుకుంటూ ఉన్న సోదరుడి తీరుపై అతనికి కోపం వచ్చింది. బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ప్రాణేశ్‌ను వెంబడించి వెళ్లి అతనిపై దాడి చేశాడు. కట్టెతో, అనంతరం సుత్తితో తీవ్రంగా కొట్టడంతో బాలుడు మరణించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు చెన్నమ్మ, బసవరాజ్‌ వద్ద సోదరుని విషయాన్ని శివకుమార్‌ నాటకీయంగా ప్రశ్నించాడు. ఆ రోజు సాయంత్రం తాను మృతదేహాన్ని చూశానని చెప్పాడు. హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు నమోదయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు ఆ యువకుడిని ప్రశ్నిస్తున్నారు.


విహారయాత్ర విషాదంతం

మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

గంగావతి, న్యూస్‌టుడే: చెరువులో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన గంగావతి తాలూకా సణాపుర గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కొప్పళ తాలూకా కుణికేరికి చెందిన మంజునాథ్‌ చెన్నప్ప (19) తన స్నేహితులతో కలిసి ఇక్కడికి విహారయాత్రకు వచ్చాడు. కాలుజారి చెరువులో పడిపోయాడు. స్నేహితులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అగ్నిమాపక దళంతో వచ్చి గాలించారు. మృతదేహం బయటపడడంతో ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గంగావతి గ్రామీణ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది.


బాలుడిపై దూసుకెళ్లిన బస్సు

హొసపేటె, న్యూస్‌టుడే: బస్సును అధిగమించే ప్రయత్నంలో ద్విచక్ర వాహనచోదకుడు ఎదురుగా వచ్చిన మరో బైకును ఢీకొన్న ఘటనలో బాలుడు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి కొట్టూరు తాలూకా హారాళు క్రాస్‌ వద్ద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కూడ్లిగికి చెందిన ఆస్లాం బాషా తన ఇద్దరు కొడుకులు మహమ్మద్‌ ఆఫాన్‌ (12), మహమ్మద్‌ ఫరాన్‌ను బైకుపై ఎక్కించుకుని హరపన హళ్లినుంచి కొట్టూరు వైపు బయలుదేరారు. ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును అధిగమించే యత్నంలో ఎదురుగా వచ్చిన మరో బైకును ఢీకొన్నాడు. రెండు ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న నలుగురు కిందపడ్డారు. మహమ్మద్‌ అఫాన్‌పై బస్సు ఎక్కడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అస్లాంబాష, మరో కొడుకు మహ్మద్‌ ఫరాన్, బైకు చోదకుడు రేవణసిద్ధప్పకు గాయాలయ్యాయి. అస్లాంబాషా భార్య మోసిన్‌ తాజ్‌ ఫిర్యాదు మేరకు కొట్టూరు ఠాణాలో కేసు నమోదైంది.


గుర్తుతెలియని మహిళ మృతదేహం

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లా హడగలి తాలూకా శివారులోని తుంగభద్ర నది పోటు జలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పశువుల కాపరి ఒకరు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిరేహడగలి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వయసు సుమారు 42 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతం హావేరి గ్రామీణ పోలీస్‌ ఠాణా పరిధి కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశామని హిరేహడగలి పోలీసులు తెలిపారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.


వేదగంగలో నలుగురు బెళగావివాసుల మృతి

బెళగావి, న్యూస్‌టుడే : చిక్కోడి నుంచి మహారాష్ట్రలోని కొల్హాపుర తాలూకా బస్తవాడె గ్రామానికి వెళ్లిన నలుగురు వేదగంగ నదిలో మునిగి శనివారం మరణించారు. జితేంద్ర విలాస్‌ లోక్రే (36), సవితా అమర్‌ కాంబళె, రేష్మా దిలీప్‌ (34), యశ్‌ దిలీప్‌ (17)లను మృతులుగా గుర్తించారు. తీర్థయాత్రకు వెళ్లిన వీరు శుక్రవారం రాత్రి అనూరు గ్రామంలోని వసతిగృహంలో ఉన్నారు. శనివారం ఉదయం వేదగంగ నది వద్ద దుస్తులను శుభ్రం చేసుకుంటూ ఇద్దరు నీటిలో పడ్డారు. వారిని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు.


రథోత్సవంలో ఇద్దరి మృతి

గదగ్, న్యూస్‌టుడే : రోణ పట్టణంలో శనివారం నిర్వహించిన శ్రీ వీరభద్రేశ్వర రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. రథాన్ని లాగే సమయంలో జరిగిన తోపులాటలో ఇద్దరు భక్తులు చక్రాల కింద పడి నలిగి మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల వివరాలను గుర్తించవలసి ఉందని రోణ పోలీసులు తెలిపారు.


కన్నకొడుకునే కడతేర్చిన తండ్రి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : పొలం విక్రయించిన సొమ్మును పంచుకునే విషయంలో జరిగిన గొడవలో భాస్కర్‌ (31) అనే వ్యక్తిని అతని తండ్రి కృష్ణప్ప (60) హత్య చేశాడని బెంగళూరు నగర పోలీసులు వెల్లడించారు. నగదు పంచుకునే విషయంలో నగర శివార్లలోని లక్కోజనహళ్లి గ్రామానికి చెందిన వీరిద్దరూ గొడవ పడ్డారు. రాత్రి నిద్రపోతున్న సమయంలో కుమారుడిపై మచ్చుకత్తితో దాడి చేసి హత్య చేశాడని తెలిపారు. తీవ్రంగా గాయపడిన భాస్కర్‌ అక్కడికక్కడే మరణించారు. రామనగర గ్రామీణ ఠాణా పోలీసులు హంతకుడ్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.


తండ్రీకొడుకుల దుర్మరణం

కలబురగి, న్యూస్‌టుడే : కలబురగిలోని సుల్తానపుర వలయ వర్తుల రహదారిలో శనివారం మధ్యాహ్నం సంభవించిన రోడ్డు ప్రమాదంలో మునీర్‌ (35), ఆయన కుమారుడు అమీర్‌ మకాన్‌దార (10) అనే వారు మరణించారు. మునీర్‌ భార్య మాశా, రెండున్నరేళ్ల కుమారుడు అద్నాన్‌ చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వీరు వెళుతున్న బైకును ఎడురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కలబురగి నుంచి అఫ్జలపుర తాలూకా టాకళికి వెళుతుండగా ప్రమాదం సంభవించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని