logo

పరిషత్తు పోరులోనూ కాసుల మాటే !

విధానపరిషత్తు అంటే పెద్దలు చర్చించుకునే సభ! ప్రభుత్వాలు రూపొందించే బిల్లులు మేధావుల చర్చల తర్వాతనే గవర్నర్‌ చెంతకు చేరుతాయి.

Published : 19 May 2024 04:17 IST

ప్రత్యక్ష ఎన్నికలకు తీసిపోని జోరు

వానాకాలంలో పాలనా సౌధాన్ని ఎన్నికల మబ్బులు కమ్మేసినట్లుంది కదూ..

ఈనాడు, బెంగళూరు : విధానపరిషత్తు అంటే పెద్దలు చర్చించుకునే సభ! ప్రభుత్వాలు రూపొందించే బిల్లులు మేధావుల చర్చల తర్వాతనే గవర్నర్‌ చెంతకు చేరుతాయి. 25 మందిని స్థానిక సంస్థల నుంచి, మరో 25 మందిని ఎమ్మెల్యేల తరఫున ఎన్నుకోగా, 11 మందిని గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. మిగిలిన 14 మందిలో ఏడుగురిని పట్టభద్రులు, మరో ఏడుగురిని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. ఇలా మూడు ఉపాధ్యాయ, మరో మూడు పట్టభద్రులు ఎన్నుకునే స్థానాలకు జూన్‌ 3న ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ముగిసి పట్టుమని పది రోజులైనా కాకముందే ఈ ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ, విధానసభ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేసిన అలవాటు కాబోలు పరిషత్‌ అభ్యర్థులు సైతం గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అక్షర జ్ఞానం నిండుగా ఉన్న ఉపాధ్యాయ, పట్టభద్ర ఓటర్లు సాధారణ ఎన్నికల మాదిరి కాకుండా ఏదో సమున్నతమైన లక్ష్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అందరూ భావించారు. ఈ ఓట్లనూ కొనుగోలు చేయాలన్న ఆలోచన అభ్యర్థుల్లో పుట్టిందంటే పెద్దల ఎన్నికలకున్న గౌరవం అంతకంతకూ తగ్గుతోందని రాజకీయ పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న రేటు

దారి తప్పుతున్న సమాజానికి బుద్ధి చెప్పాల్సిన ఉపాధ్యాయ, పట్టభద్ర ఓటర్ల రేటు ప్రతి ఎన్నికల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ బెంగళూరు పట్టభద్రుల క్షేత్రం. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న రామోజీగౌడ ముఖచిత్రంతో కొన్ని విలువైన బహుమతుల పెట్టెలను ఆనేకల్‌ గోదాముల నుంచి ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అభ్యర్థిపై భాజపా సైతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం ప్రస్తావనార్హం. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తులు విధానసభ అభ్యర్థులకు తీసిపోని విధంగా ఉండటం నివ్వెరపరిచే అంశం. కర్ణాటక నైరుతి పట్టభద్ర క్షేత్రం నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి ఆస్తులు రూ.41.03 కోట్లకు పైమాటే. ఈయనే కాదు మరికొందరిపైనా క్రిమినల్‌ కేసులుండటం మారుతున్న పరిషత్తు ఎన్నికల సంప్రదాయానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆగ్నేయ ఉపాధ్యాయ క్షేత్రం నుంచి ఓటు వేస్తున్న ఓ ఉపాధ్యాయుడు చెబుతున్న లెక్కల ప్రకారం గత ఎన్నికల్లో ఒక ఓటు విలువ రూ.5 వేలుగా అభ్యర్థులు నిర్ణయిస్తే ఈసారి ఆ విలువ రెట్టింపు (రూ.10వేలు) అవుతుందనే ఆందోళన నెలకొంది. ప్రతిసారీ ఈ ఓటు విలువ అంతకంతకూ పెరుగుతోందన్నమాట.

పార్టీలకు సవాలు

జూన్‌ 3న నిర్వహించే పరిషత్తు ఎన్నికలను అన్ని పార్టీలూ సవాలుగా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం 75 మంది సభ్యులున్న పరిషత్తులో అధికార పక్షం కాంగ్రెస్‌ 30, ఎన్‌డీఏ 40 మంది సభ్యులతో ఆధిక్యంలో ఉంది (5స్థానాలు ఖాళీగా ఉన్నాయి). ఈ ఎన్నికలతో కాంగ్రెస్‌ తన ఆధిక్యాన్ని పెంచుకోవాలని, ఎన్‌డీఏ మిత్రులు అధికార పక్షాన్ని కట్టడి చేయాలని చూస్తున్నాయి. చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, కోలారు, తుమకూరు, దావణగెరె, కొడగు, శివమొగ్గ, హాసన, మండ్య, మైసూరు, ఉడుపి, బళ్లారి, బీదర్, కలబురగి, కొప్పళ, రాయచూరు, యాదగిరి, విజయనగర, బీబీఎంపీ పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తుండగా ఈ ప్రాంతాలకు చెందిన నేతలంతా లోక్‌సభ ఎన్నికలు ముగిశాయని విశ్రాంతి తీసుకోకుండా అభ్యర్థుల విజయానికి శ్రమించాలని పార్టీలు సూచించాయి. మొత్తం 103 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో భాజపాకు నింగరాజు (దక్షిణ ఉపాధ్యాయ) రఘుపతి భట్‌ (నైరుతి పట్టభద్ర) రూపంలో, జేడీఎస్‌కు శ్రీకంఠేగౌడ (దక్షిణ ఉపాధ్యాయ) రూపంలో అసమ్మతి సవాలుగా మారింది.

లక్ష్యాన్ని చేరుకోవాలి

పరిషత్తు ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రాధాన్యక్రమంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. అంటే సగటున ఓ అభ్యర్థి మొత్తం ఓట్లలో కనీసం 50 శాతం ఓట్లను తొలి రౌండ్‌లో పొందాడంటే అతను దాదాపు గెలుపొందినట్లే. ఆపై అభ్యర్థి ఒక్క ఓటు అదనంగా పొందితే చాలు అతను గెలిచినట్లు ప్రకటించేస్తారు. ఓ క్షేత్రంలో లక్ష ఓట్లుంటే అందులో 50,001 ఓట్లను రాబడితే చాలు అతను గెలిచినట్లే. దక్షిణ ఉపాధ్యాయ క్షేత్రంలో కేవలం చామరాజనగర, హాసన, మండ్య, మైసూరు జిల్లాల ఉపాధ్యాయులు 18 వేల మందే ఓటేస్తారు. వీరిని లెక్కగట్టడం పార్టీలకు ఓ లెక్కే కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 20 ఏళ్ల కిందట కేవలం ఓ పోస్టుకార్డు ద్వారా ఉపాధ్యాయులు, పట్టభద్రులకు ఓటేయాలని సమాచారాన్ని అందించే సంప్రదాయం నుంచి నేడు విలువైన బహుమతులు ఇంటి గుమ్మానికి చేరుకునే స్థితికి పరిషత్తు ఎన్నికలు చేరాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని