logo

ఎన్నెస్పీ స్థలం కబ్జాకు యత్నం

ఖమ్మంలోని రామచంద్రయ్యనగర్‌ కాలనీలో ఎన్నెస్పీ భూములపై నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెలు తొలగిస్తున్న వైనమిదీ. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారంటూ కొద్ది నెలల క్రితం అధికారులు

Updated : 25 May 2022 04:52 IST

ప్రభుత్వ భూమిగా గుర్తించినా చర్యలకు వెనకాడుతున్న అధికారులు

ఖమ్మంలోని రామచంద్రయ్యనగర్‌ కాలనీలో ఎన్నెస్పీ భూములపై నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెలు తొలగిస్తున్న వైనమిదీ. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారంటూ కొద్ది నెలల క్రితం అధికారులు రంగంలోకి దిగి దాదాపు 60కి పైగా నిర్మాణాలు కూల్చివేయగా ఎన్నో కుటుంబాలకు నిలువ నీడ కరవైంది. అధికారుల కాళ్లావేళ్లా పడ్డా ఫలితం లేకపోయింది.


ఈటీవీ ఖమ్మం: పేదలకో న్యాయం.. బడాబాబులకో న్యాయం అన్నట్లుంది ఖమ్మంలో రెవెన్యూ, ఎన్నెస్పీ అధికారుల తీరు. నిలువ నీడలేని నిరుపేదలు ఎన్నెస్పీ కాల్వల పక్కనే ఉన్న ఖాళీ జాగాల్లో నిర్మాణాలు వేసుకొంటే అధికార దర్పం ప్రదర్శించే యంత్రాంగానికి.. బడా బాబులపై చర్యలకు మాత్రం చేతులు రావడం లేదు. నగరంలోని గొల్లగూడెం రోడ్డులో సర్వే నంబరు 413లో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వం 59 జీవో కింద క్రమబద్ధీకరణ చేసింది. కొంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంకా చాలా స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే.. ఇక్కడ రహదారికి ఆనుకుని ఉన్న సుమారు 300 నుంచి 400 గజాల అత్యంత విలువై ఎన్నెస్పీ కాల్వ భూమిపై ఓ స్థిరాస్తి వ్యాపారి కన్నుపడింది. ప్రభుత్వ భూమిలో పాగా వేసేందుకు పక్కా ప్రణాళికతో కాల్వ భూమి పూడ్చేసి నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

అధికార పార్టీ పేరుజెప్ఫి.

గొల్లగూడెం, పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం భూములకు డిమాండ్‌ ఉంది. రహదారికి ఇరువైపులా గజం భూమి విలువ సుమారు రూ.70,000 వరకు ఉంది. అంటే ఈ లెక్కన స్థిరాస్తి వ్యాపారి కబ్జాకు యత్నం చేస్తున్న భూమి విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందన్న మాట. ప్రభుత్వ భూమిగా తేల్చినప్పటికీ ఆ తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించడం లేదు. కబ్జాకు యత్నిస్తున్న సదరు వ్యక్తి తాను అధికార పార్టీ నాయకులకు దగ్గరి వ్యక్తినని, అవసరమైతే ఫోన్లు చేయిస్తానని చెప్పడంతో అధికారులు చర్యలకు వెనకడుకు వేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, సర్వేకు వెళ్లిన అధికారులపై బెదిరింపులకు సైతం పాల్పడ్డట్లు తెలిసింది. నెలలు గడుస్తున్నా అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం లేదంటూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


..ఇది లకారం కూడలి నుంచి గొల్లగూడెం వెళ్లే దారిలో ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఎన్నెస్పీకి చెందిన భూమి. సుమారు 400 గజాల వరకు ఉంటుంది. ఈ భూమిలో నుంచే గతంలో ఎన్నెస్పీ కాలువ ఉండేది. పక్కనే ఉన్న భూమి మొత్తం ఎన్నెస్పీదే. ఏళ్లుగా నివాసం ఉంటున్న కొందరికి క్రమబద్ధీకరణ పేరిట ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఇదే అదునుగా తీసుకున్న నగరానికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఈ భూమిపై కన్నేశాడు. రాత్రికి రాత్రే కాలువ భూమిలో పాగా వేసి.. ప్రహరీ తిప్పి ఏకంగా నిర్మాణాలు చేపట్టాడు. భూ కబ్జాపై రెవెన్యూ, ఎన్నెస్పీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల తర్వాత అధికారులు స్పందించారు. ఆక్రమణకు గురైన భూమి ఎన్నెస్పీ భూమిగా తేల్చి మార్కింగ్‌ సైతం చేశారు. అయినా కబ్జా పర్వం ఆగడం లేదు.


విషయం మా దృష్టిలో ఉంది శైలజ, ఖమ్మం అర్బన్‌ తహసీల్దారు

ఈ భూమికి సంబంధించిన అంశం మా దృష్టిలో ఉంది. గతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశాం. మరోసారి పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని