logo

ఎన్నికల విధులు సమర్థంగా నిర్వర్తించాలి

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ లోక్‌సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం లోక్‌సభ స్థానం  సాధారణ పరిశీలకుడు సంజయ్‌ జి.కోల్టే అన్నారు.

Updated : 28 Apr 2024 05:57 IST

సిబ్బందికి సూచనలిస్తున్న సాధారణ పరిశీలకుడు సంజయ్‌ జి.కోల్టే, చిత్రంలో పోలీస్‌ విభాగం పరిశీలకుడు చరణ్‌జిత్‌ సింగ్‌, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు గౌతమ్‌, ప్రియాంక, వ్యయ పరిశీలకుడు శంకర్‌ అనంత్‌ మిశ్రా, ఎస్పీ రోహిత్‌రాజు

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ లోక్‌సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం లోక్‌సభ స్థానం  సాధారణ పరిశీలకుడు సంజయ్‌ జి.కోల్టే అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో వ్యయ  పరిశీలకుడు శంకర్‌ అనంత్‌ మిశ్రా, పోలీస్‌ విభాగం పరిశీలకుడు చరణ్‌జిత్‌ సింగ్‌, ఖమ్మం లోక్‌సభ  స్థానం రిటర్నింగ్‌ అధికారి వి.పి.గౌతం, కలెక్టర్‌ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి సహాయ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో శనివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ ఎన్నికల క్రతువును విజయవంతం చేయాలని సంజయ్‌ అన్నారు. ‘ఎవరికి కేటాయించిన విధులను వారు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి. ప్రచారం, వ్యయ పరిశీలన, పోలింగ్‌ బృందాలు  క్రియాశీలకంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. పోలింగ్‌ కు 72 గంటల ముందు నుంచే ఎంసీసీ బృందాలు అప్రమత్తం కావాలి. తాజా శిక్షణను సద్వినియోగం చేసుకుని విధి నిర్వహణలో సమర్థంగా రాణించాలి. పోలింగ్‌ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఓటరు చైతన్యానికి స్వీప్‌ విభాగం విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి’ అని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు అక్రమంగా తరలించకుండా చెక్‌ పోస్టుల వద్ద నిఘా పెంచాలని పోలీస్‌ విభాగం పరిశీలకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ ఆదేశించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్థానిక పోలీసులు ఇతర బృందాల సమన్వయంతో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల గురించి కలెక్టర్‌ ప్రియాంక అల ఉన్నతాధికారులకు వివరించారు. కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా కొత్తగూడెం ఆర్డీఓ మధు, అదనపు కలెక్టర్‌  వేణుగోపాల్‌ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఓటరు చీటీల పంపిణీ చేపట్టినట్లు వివరించారు. ఏర్పాట్ల వివరాలపై పవర్‌ పాయంట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, డీఆర్డీఓ విద్యాచందన, ఎన్నికల విభాగం తహసీల్దార్‌ దారా ప్రసాద్‌, డీటీ రంగాప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని