logo

ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన: మంత్రులు

ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన అందుతుందని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Published : 28 Apr 2024 01:22 IST

 సత్యనారాయణపురంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి, మాజీ మంత్రి సంభాని తదితరులు

ఖమ్మం కమాన్‌బజార్‌, ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన అందుతుందని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలను ఖమ్మం, సత్యనారాయణపురంలో వేర్వేరుగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లాతో ఏళ్లుగా అనుబంధం ఉన్న రఘురాంరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ కన్నా రెండింతల ఆధిక్యంతో ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని  కోరారు. అధికారం ఉందని ప్రగల్భాలు పలికిన భారాస నాయకులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చెంప చెల్లుమనిపించారని చెప్పారు.  ప్రస్తుతం తాము అనుభవిస్తున్న పదవులు ప్రజల చలువే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కోసమైనా రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో  కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల కష్ట ఫలితంగానే రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. రాష్ట్రాన్ని రూ.7 వేల కోట్ల అప్పుల పాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను పదవి నుంచి దిగిపోగానే కరెంటు పోతుందని అనడం విడ్డూరమని చెప్పారు.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసిన ఆయన విద్యుత్‌పై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అధికారం, అహంకారంతో విర్రవీగిన భారాస పాలకులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు. కేంద్రంలో మతోన్మాద భాజపా సర్కారును గద్దెదింపుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తప్పనిసరిగా అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా 15 రోజులు కష్టపడాలని సూచించారు. కష్టపడ్డ వారందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని తెలిపారు. పాలేరు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు అశోక్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, పీసీసీ సభ్యుడు మహ్మద్‌ జావేద్‌, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ రాయల   నాగేశ్వరరావు, మద్దినేని స్వర్ణకుమారి, దొబ్బల సౌజన్య, ఫాతిమా జోహ్రా, ఎర్రం బాలగంగాధర్‌ తిలక్‌, పిడమర్తి రవి, నల్లమల వెంకటేశ్వరరావు, సాధు రమేశ్‌రెడ్డి, కమర్తపు మురళీ, చావా నారాయణరావు, సైదుబాబు, సలాం, విక్రమ్‌, శ్రీనివాసరెడ్డి, నరేశ్‌రెడ్డి, కళ్లెం  వెంకటరెడ్డి, బండి జగదీశ్‌, మల్లారెడ్డి, తిరుమలాయపాలెం జడ్పీటీసీ సభ్యుడు బెల్లం శ్రీనివాసరావు, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, సీపీఐ నాయకులు జానీమియా, దండి సురేశ్‌, మౌలానా, సీపీఎం నాయకులు ఎర్రా శ్రీకాంత్‌, బత్తినేని వెంకటేశ్వరరావు, కొమ్ము శ్రీను, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • రీ అనంతరం ఖమ్మం నగరంలోని వివిధ డివిజన్ల నుంచి పార్టీలో చేరేందుకు పలువురు కార్యకర్తలను నేతలు ఆహ్వానించగా స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గందరగోళం సృష్టించారు. జిల్లా నాయకులు వారిని  సముదాయించడంతో శాంతించారు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని