logo

అభ్యర్థుల్లో వాటా 3 శాతమే

ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యానికి ప్రతీక. ఏ ఎన్నిక జరిగినా ఓటు జాబితాలో మహిళోత్సాహం ఎక్కువనే చెప్పాలి. వివిధ ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా వీరే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతను మార్చటంలో కీలకపాత్ర వహించారు.

Updated : 02 May 2024 06:51 IST

ఖమ్మం లోక్‌సభ నుంచి ఇద్దరు మహిళల ప్రాతినిధ్యం

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యానికి ప్రతీక. ఏ ఎన్నిక జరిగినా ఓటు జాబితాలో మహిళోత్సాహం ఎక్కువనే చెప్పాలి. వివిధ ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా వీరే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతను మార్చటంలో కీలకపాత్ర వహించారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా  వెల్లడైన ఓటరు జాబితాలో పురుషుల కంటే అత్యధికంగా మహిళా ఓటర్లే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం వారికి తగిన ప్రాతినిధ్యం దక్కలేదనే చెప్పవచ్చు. 

పాల్వంచ, న్యూస్‌టుడే: ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్‌ మినహా మరే పార్టీ మహిళా అభ్యర్థుల ఎంపికపై పెద్దగా మొగ్గుచూపలేదు. దేశ భవితను నిర్ణయించే, చట్టాలు రూపొందించే పార్లమెంట్‌లో ఖమ్మం స్థానం నుంచి ఇప్పటివరకు ఇద్దరు మహిళలు, మొత్తం అయిదు సార్లు అడుగుపెట్టారు. మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. గెలిచిన మహిళలు ఇద్దరూ స్థానికేతరులే కావటం విశేషం. ఎన్నికల్లో స్థానిక మహిళలెవరినీ లోక్‌సభకు పంపే అవకాశం ఇక్కడి ఓటర్లకు దక్కలేదు.

ఆ ఇద్దరు.. ఐదుసార్లు ప్రాతినిధ్యం

ఖమ్మం లోక్‌సభ స్థానానికి 1951 ఎన్నికల నుంచి తాజా పోరు వరకు బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థులు 221 మంది ఉన్నారు. వీరిలో మహిళలు కేవలం ఏడుగురు (3.17%) మాత్రమే. ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ దక్కించుకున్న వారిలో లక్ష్మీకాంతమ్మ, రేణుకాచౌదరి (కాంగ్రెస్‌), స్వర్ణకుమారి (తెదేపా) ఉన్నారు. మిగతా వారంతా స్వతంత్ర అభ్యర్థులే. తొలినాళ్లలో జరిగిన 1962, 67, 72 ఎన్నికల్లో తేళ్ల లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. ఆ తర్వాత సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత అదే పార్టీ నుంచి టిక్కెట్‌ దక్కించుకున్న మహిళా అభ్యర్థి రేణుకాచౌదరే. 1999, 2004లో వరుసగా ఆమె హస్తం గుర్తుపై గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2019లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థినిగా బరిలో నిలిచినా ఓటమి పాలయ్యారు. మొత్తమ్మీద ఖమ్మం స్థానం నుంచి ఇప్పటివరకు అయిదు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించింది ఇద్దరు మహిళలే. 1999లో అప్పటి ప్రధాన పార్టీ అయిన తెదేపా నుంచి బరిలో నిలిచే అవకాశం స్వర్ణకుమారికి దక్కింది. ఆమె రేణుకాచౌదరిపైనే స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. వీరు కాకుండా వివిధ ఎన్నికల్లో ఎన్డీ, స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు బరిలో నిలిచారు. 1980లో ఆలూరి అన్నపూర్ణ విశాలాక్షి (స్వతంత్ర), 1999, 2004లో చండ్ర అరుణ(స్వతంత్ర), 2004లో నలజాల సరోజ (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), 2014లో కల్తీ రాములమ్మ (స్వతంత్ర) పోటీచేశారు. వీరెవరూ ఓట్లపరంగా పెద్దగా ప్రభావం చూపలేదు. ఓటు భాగస్వామ్యంలో సగం మందికిపైగా మహిళలున్న ఈ లోక్‌సభ స్థానంలో.. తాజా ఎన్నికల్లో ఒక్క వనిత కూడా నామినేషన్‌ వేయలేదు. ఖమ్మం లోక్‌సభ స్థానం చర్రితలో అత్యధికంగా 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచింది ఈ ఎన్నికల్లోనే. అంతకుముందు 1996లో 28 మంది అత్యధికంగా పోటీపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని