logo

‘ఏక’స్వామ్య కోటకు బీటలు

అవుకు మండలంలో కాటసాని, చల్లా కోటకు బీటలు పడ్డాయి.. 50 ఏళ్ల తర్వాత అక్కడ తెదేపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. ఆయా గ్రామాల్లో తెదేపా జెండాలు రెపరెపలాడుతున్నాయి.

Updated : 28 Apr 2024 03:02 IST

ప్రచారానికి శ్రీకారం చుట్టిన తెదేపా

నంద్యాల, న్యూస్‌టుడే: అవుకు మండలంలో కాటసాని, చల్లా కోటకు బీటలు పడ్డాయి.. 50 ఏళ్ల తర్వాత అక్కడ తెదేపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. ఆయా గ్రామాల్లో తెదేపా జెండాలు రెపరెపలాడుతున్నాయి. పలు గ్రామాల్లో కాటసాని, చల్లా కుటుంబాల పెత్తనం కొనసాగుతోంది. ఎన్నికలంతా ఏకపక్షంగా కొనసాగుతాయి.. ప్రతిపక్ష పార్టీలకు అక్కడ ఏజెంట్లు కూడా ఉండరు.. అక్కడ ప్రతిపక్ష నాయకులు కాలుమోపాలంటే భయపడతారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొనే పరిస్థితి ఉండదు..

చల్లా ఆధిపత్యానికి గండి

మాజీ ఎమ్మెల్యే, దివంగతనేత చల్లా రామకృష్ణారెడ్డి స్వగ్రామం ఉప్పలపాడు. ఆ గ్రామంతోపాటు జూనుంతల, కొండమనాయునిపల్లెలను గత 50 ఏళ్లుగా ఆ కుటుంబమే శాసిస్తోంది. వారు ఎక్కడ ఉంటే ఆ పార్టీకే మెజార్టీ వస్తుంది. ఎన్నికల ప్రక్రియను అంతా వారి కనుసన్నల్లో నడిపిస్తారు. ఆ కుటుంబానికి చెందిన చల్లా విజయ భాస్కరరెడ్డి తెదేపాలో చేరారు. కొండమనాయునిపల్లె, జూనుంతలలో గడప.. గడపకు వెళ్లారు. ఉప్పలపాడులోనూ ప్రచారం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. మూడు గ్రామాల్లో ఉన్న మూడు వేల ఓట్లు ఇప్పుడు కీలకం కానున్నాయి.

తెదేపా వ్యూహాలు

నియోజకవర్గంలో 2,38,900 మంది ఓటర్లు ఉండగా ఇందులో అవుకు మండలంలో 42,709, బనగానపల్లిలో 82,820, కోవెలకుంట్లలో 39,145, కొలిమిగుండ్లలో 42,317, సంజామలలో 31,909 ఉన్నారు. గత ఎన్నికల సమయంలో గుండ్లశింగవరంలో 1,450 ఓట్లకు 1,400, ఉప్పలపాడులో 1,750 ఓట్లకు 1,600 వైకాపాకు పడ్డాయి. గత ఎన్నికల్లో అవుకు మండలంలో అధికార పార్టీ వైకాపాకు ఎనిమిది వేల వరకు మెజార్టీ వచ్చింది. కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాల నుంచి తెదేపాలో చేరే వారి సంఖ్య పెరిగింది. అవుకు మండలానికి చెందిన కాటసాని చంద్రశేఖరరెడ్డి, చల్లా విజయ బాస్కరరెడ్డి, చెన్నంపల్లె నుంచి కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, కోనాపురం నుంచి వంగల పరమేశ్వరరెడ్డి తెదేపాలో చేరారు. అవుకు మండలం నుంచి గత ఎన్నికల్లో వైకాపాకు ఆరు వేల ఓట్ల మెజారీ వచ్చింది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.


కాటసాని పెత్తనం కుదరదిక

వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి సొంతూరు అవుకు మండలం గుండ్ల శింగవరం. ఆ గ్రామంతోపాటు చుట్టు పక్కల ఉన్న అన్నవరం, నిచ్చెనమెట్ల, లింగంబోడు, పెద్దకొట్టాల, కోనాపురం గ్రామాల్లో ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. ఎన్నికల సమయంలో అక్కడ ఏజెంట్లు కూర్చోవడానికి కూడా ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు దొరకరు. పోలింగ్‌ ప్రక్రియ అంతా ఏకపక్షంగా కొనసాగుతుంది. ఆయా గ్రామాల్లో కనీసం మూడువేలకు పైగా మెజార్టీ వస్తుంది. ఆయన సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డి సైకిలెక్కారు. గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. గడప..గడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు.. వైకాపా అరాచకాలు వివరిస్తూ తెదేపా గెలుపు ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని