logo

స్మార్ట్‌ సిటీగా పాలమూరు అభివృద్ధి

పాలమూరు పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్‌నగర్‌ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 05:57 IST

‘మహబూబ్‌నగర్‌ విజన్‌’ పేరుతో డీకే అరుణ మ్యానిఫెస్టో విడుదల

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : పాలమూరు పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్‌నగర్‌ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. ‘మహబూబ్‌నగర్‌ విజన్‌’ పేరుతో ఆమె ప్రత్యేకంగా రూపొందించిన మ్యానిఫెస్టోను నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఆమె భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్‌ చేతుల మీదుగా గురువారం మహబూబ్‌నగర్‌ పట్టణం క్లాక్‌టవర్‌ వద్ద ఏర్పాటుచేసిన కార్నర్‌ మీటింగ్‌లో విడుదల చేశారు. 10 అంశాలను మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతో నియోజకవర్గంలో అత్యున్నతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌, దేవరకద్ర, షాద్‌నగర్‌, జడ్చర్ల నియోజకవర్గ కేంద్రాలు, వాటి పరిధిలోని పురపాలికలను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తానని, వికసిత్‌ మహబూబ్‌నగర్‌లో భాగంగా రహదారులు, రైలుమార్గాలు విస్తరిస్తామని, ఆయుస్మాన్‌ భారత్‌ ద్వారా పేదలకు కార్పొరేట్‌ తరహా వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామని, కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటు చేయిస్తామని, ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా మహిళా సంఘాలకు ముద్ర యోజన, లఖ్‌పతి దీదీ రుణాలు, స్వచ్ఛ మహబూబ్‌నగర్‌లో భాగంగా జిల్లా కేంద్రంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి కృషి, ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి భాజపా శ్రేణులు భారీ సంఖ్యలో మహబూబ్‌నగర్‌కు తరలి వచ్చారు. కలెక్టరేట్‌ నుంచి వన్‌టౌన్‌ కూడలి వరకు మహబూబ్‌నగర్‌ - భూత్పూర్‌ రోడ్డు కాషాయమయంగా మారింది. భగీరథకాలనీ  నుంచి క్లాక్‌టవర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, ఒగ్గు కళాకారుల ఆటపాటలు, ఇతర కళాకారుల విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, సీనియర్‌ నేతలు నాగురావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, ఎగ్గని నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌, నారాయణరెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, కొండయ్య, కె.రాములు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని