icon icon icon
icon icon icon

రేవంత్‌రెడ్డిపై నిషేధం ఏదీ?

ఎన్నికల ప్రచారంలో 48 గంటలపాటు పాల్గొనవద్దని తనపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ).. ‘పేగులు మెడలో వేసుకుంటా.. గుడ్లు పీకుతా’ అంటూ అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై నిషేధం ఎందుకు పెట్టలేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు.

Updated : 02 May 2024 07:06 IST

ఆయన వ్యాఖ్యలను ఈసీ పట్టించుకోదా..
భారాస కార్యకర్తలు 96 గంటలపాటు అవిశ్రాంత ప్రచారం చేస్తారు
మానుకోట రోడ్‌షోలో కేసీఆర్‌

ఈనాడు, మహబూబాబాద్‌: ఎన్నికల ప్రచారంలో 48 గంటలపాటు పాల్గొనవద్దని తనపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ).. ‘పేగులు మెడలో వేసుకుంటా.. గుడ్లు పీకుతా’ అంటూ అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై నిషేధం ఎందుకు పెట్టలేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. లక్షల సంఖ్యలో ఉన్న భారాస కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. భారాస మహబూబాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి మాలోత్‌ కవితను గెలిపించాలని కోరుతూ బుధవారం మహబూబాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్‌ మాట్లాడారు.

కాంగ్రెస్‌ పాలనలో రైతుల ఆత్మహత్యలు

‘‘కాంగ్రెస్‌ పరిపాలనలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వడ్లు తెచ్చి 15 రోజులైనా కొనకపోవడంతో.. తట్టుకోలేక వాటిని ఆరబెడుతూ అక్కడే ఓ రైతు బుధవారం గుండె ఆగి చనిపోయారు. రైతుభరోసా కింద రేవంత్‌రెడ్డి ఇస్తామన్న రూ.15 వేలు ఇవ్వలేదు. రైతుబంధు కింద మేమిచ్చిన రూ.10 వేలు కూడా రాలేదు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12000, వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వలేదు. మహిళలకు ప్రతినెలా ఇస్తామన్న రూ.2,500 రాలేదు. కల్యాణలక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఒక్కటే కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చింది. అయితే, దాంతో ఆటోడ్రైవర్లు రోడ్డున పడుతున్నారు. వాళ్ల బతుకులు ఆగమైపోతున్నాయి. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయాలి. న్యాయం జరిగేదాకా భారాస కొట్లాడుతుంది. మా హయాంలో ఎనిమిదేళ్లు బాగా ఉన్న నిరంతర విద్యుత్‌, మిషన్‌ భగీరథ ఏమయ్యాయి? ప్రస్తుతం ఖమ్మంలో మురుగు నీళ్లు వస్తున్నాయి. మహబూబాబాద్‌, డోర్నకల్‌, నర్సంపేట నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత వెన్నవరం కాలువ ద్వారా నీళ్లు వచ్చాయి. ఈ ఏడాది రాలేదు. మళ్లీ బోరుబండ్లు వస్తున్నాయి. దీనిపై ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్‌  ఈ ఎన్నికల్లో గెలిస్తే హామీలను అమలు చేయకున్నా ఏమీ కాదని పక్కనపెట్టేస్తుంది. 70 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో గిరిజనులను గౌరవించలేదు. భారాస ప్రభుత్వంలో సేవాలాల్‌ మహరాజ్‌, బంజారా భవనాలు కట్టించాం. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాం.

మోదీ హయాంలో నినాదాలు తప్ప పనులు లేవు

విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని గతంలో మోదీ అన్నారు. ఎవరికైనా వచ్చాయా? మోదీ హయాంలో బేటీ బచావో.. బేటీ పఢావో.. అమృత్‌ కాల్‌.. అంటూ అన్నీ నినాదాలే తప్ప ఏ ఒక్క పనీ జరగలేదు. గోదావరి నదిని ఎత్తుకుపోతానని అంటుంటే తెలంగాణ సీఎం నోరు మెదపడం లేదు. ఇదివరకే కృష్ణా నదిని కేఆర్‌ఎంబీకి అప్పగించారు.

జిల్లాను తీసేస్తామంటున్నారు  

మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు జిల్లాగా మార్చాం. జిల్లాను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోంది. జిల్లా ఉండాలంటే.. మాలోత్‌ కవిత గెలవాలి. భారాస అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎలా ఉండేదో, ఇప్పుడెలా ఉందో యువకులు, మేధావులు విచక్షణతో ఆలోచించాలి’’ అని కేసీఆర్‌ అన్నారు. ఆయన ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఎక్కువ సమయం లేదంటూ సాయంత్రం 7.20కి తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్‌   7.34కు అంటే 14 నిమిషాల్లోనే ముగించారు. రోడ్‌షోలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్‌, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, రెడ్యానాయక్‌, సుదర్శన్‌రెడ్డి, హరిప్రియనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img